mas copying
-
ఎంబీబీఎస్.. మ.. మ.. మాస్!
వారంతా రేపటి ప్రాణదాతలు.. నాడిని పరీక్షించాల్సిన భావి వైద్యులు. రోగులు దైవంగా భావించే వృత్తిని చేపట్టా ల్సిన వారు. కానీ, పరీక్షల సమయంలోనే పెడదారి పట్టారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం దుర్వినియోగపర్చారు. సెల్ఫోన్ల సాయంతో ఎంచక్కా మాస్ కాపీయింగ్‌కు పాల్పడ్డారు. నిబంధనలకు కాలదన్ని పరీక్ష హాల్లోకి స్మార్ట్ఫోన్లు తెచ్చారు. వాట్సప్ ద్వారా ప్రశ్నలను స్నేహితులకు పంపి, జవాబులు తెప్పించుకొని మరీ రాస్తున్నారు. ఇది తప్పని చెప్పాల్సిన వైద్య కళాశాల అధికారులే వారికి సహకరించారు. ఒంగోలు రిమ్స్ వెద్య కళాశాలలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న ఈ తంతు సోమవారం కొత్త అబ్జర్వర్ రాకతో బట్టబయలైంది. వెంటనే అప్రమత్తమైన కళాశాల అధికారులు విషయం బయటికి పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. అజ్జర్వర్ నోటికి సైతం తాళం వేశారు. ఎంబీబీఎస్ విద్యార్థులు ఇలా పరీక్షల్లోనే కాపీ కొడితే ఇక ప్రజల ప్రాణాలేం కాపాడతారు? అనే ప్రశ్న ఉదయిస్తోంది. సాక్షి, ఒంగోలు సెంట్రల్: జిల్లా కేంద్రం ఒంగోలులోని రాజీవ్‌గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో గత నాలుగు రోజులుగా ఎంబీబీఎస్ సప్లమెంటరీ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ నెల 21వ తేదీ నుంచి మొత్తం మూడు బ్యాచ్‌ల విద్యార్థులు ఎంబీబీఎస్ థియరీ సప్లిమెంటరీ, ప్రాక్టికల్ పరీక్షలకు హాజరవుతున్నారు. ఫైనల్ ఇయర్ విద్యార్థులు 19 మంది, సెకండ్ ఇయర్లో ఒక విద్యార్థి, మూడో సంవత్సరం విద్యార్థులు ఏడుగురు తాము ఫెయిల్ అయిన పరీక్షలను రాస్తున్నారు. మొత్తం 27 మంది వైద్య విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలను రాస్తున్నారు. సోమవారం ఫైనల్ ఇయర్, సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ ఫోరెన్సిక్, ఈఎన్టి, పీడియాట్రిక్ పరీక్షలు జరిగాయి. వైద్య కళాశాల అధ్యాపకులు, ప్రిన్సిపల్ వీటిని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో హెల్త్ యూనివర్సిటీ నుంచి సోమవారం నెల్లూరుకు చెందిన ఒక ప్రొఫెసర్ అబ్జర్వర్‌గా వచ్చారు. అబ్జర్వర్ రాకతో పట్టుబడిన వైద్య విద్యార్థులు ఈనెల 21వ తేదీ నుంచి వైద్య పరీక్షలు జరుగుతున్నా, ఎక్సటర్నల్ పరీక్షల అబ్జర్వర్ సోమవారం రావడంతో వైద్య విద్యార్థుల కాపీయింగ్ గుట్టు రట్టయింది. ఈ పరీక్షలలో ఫైనల్ ఇయర్‌కు చెందిన ఎనిమిది మంది కాపీయింగ్‌కు పాల్పడుతున్నట్లు నెల్లూరు నుంచి వచ్చిన యూనివర్సిటీ అబ్జర్వర్ గుర్తించారు. ఆయన ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని విద్యార్థుల నుంచి సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సెల్‌ఫోన్ ద్వారా విద్యార్థులు ప్రశ్న పత్రాలను బయట వారి స్నేహితులకు పంపి, అక్కడి నుంచి సమాధానాలను తిరిగి పొందుతున్నట్లు గుర్తించారు. కొంత మంది విద్యార్థుల వద్ద కాపీయింగ్ స్లిప్‌లను కూడా స్వాధీనం చేసుకున్నారు. మొదట ఓ విద్యార్థి వద్ద సెల్‌ఫోన్‌ను చూసిన అబ్జర్వర్, ఇతర విద్యార్థులను తనిఖీ చేయగా ఇంకొందరి వద్ద కూడా సెల్ఫోన్లు ఉన్నాయి. దీంతో అబ్జర్వర్ వాటన్నిటినీ స్వాధీనం చేసుకున్నారు. ఎరేజర్ పై కాపీ రాసిన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయం తెలిసి, అప్రమత్తమైన వైద్య కళాశాల అధికారులు అబ్జర్వర్‌తో మాట్లాడి, కాపీయింగ్‌కు పాల్పడిన విద్యార్థులను డీబార్ కాకుండా కాపాడారు. పరీక్ష కేంద్రంలోకి సెల్ఫోన్లా.. సెల్ఫోన్లను పరీక్ష హాలులోకి తీసుకు రాకూడదనే నిబంధన ఉన్నా వైద్య కళాశాల అధికారులు, నిబంధనలను తుంగలో తొక్కారు. సెల్ఫోన్లను పరీక్షల గదిలోకి అనుమతించారు. అధికారులు పట్టించుకోకపోవడంతో విద్యార్థులు కాపీయింగ్‌కు పాల్పడుతున్నట్లు సమాచారం. పరీక్షల గదిలో సీసీ కెమెరాలు ఉన్నా కాపీయింగ్ విషయం వాటి కంట పడకుండా అధికారులు మేనేజ్ చేసినట్లు సమాచారం. విద్యార్థుల నుంచి డబ్బు దండుకుని వైద్య కళాశాల అధికారులే ఈ వ్యవహారాన్ని గుట్టుగా నడుపుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వారే సోమవారం కాపీయింగ్‌ను గుర్తించిన అబ్జర్వర్‌ను బతిమాలి చర్యలు లేకుండా చూశారనే విమర్శలూ వినిపిస్తున్నాయి. నాలుగు రోజులుగా జరుగుతున్న పరీక్షల్లో రోజూ ఇదే తంతు కొనసాగిందని వైద్య కళాశాలలోని కొందరు సిబ్బంది గుసగుసలాడుకుంటున్నారు. స్పందించని ప్రిన్సిపల్.. పరీక్షల్లో వైద్య విద్యార్థులు కాపీయింగ్ వ్యవహారంపై ‘సాక్షి’ ఫోన్లో వివరణ కోరేందుకు ప్రయత్నించగా ప్రిన్సిపల్ అందుబాటులోకి రాలేదు. ఈ వ్యవహారంలో భారీ ఎత్తున నగదు చేతులు మారిన్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. -
చూసుకో..రాసుకో..
జిల్లాలో ఈ నెల 12 నుంచి ప్రారంభమైన ఓపెన్ స్కూల్ పరీక్షల్లో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. ‘రాసుకున్నోళ్లకు రాసుకున్నంత’ అన్న రీతిలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. మాస్ కాపీయింగ్‌ను యథేచ్ఛగా ప్రోత్సహిస్తున్నారు. కొన్ని చోట్ల ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాస్తున్నారు. ఇదంతా ఇన్విజిలేటర్ల పర్యవేక్షణలోనే సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్లు ఉండగానే జరుగుతోందంటే ఆశ్చర్యం కలగకమానదు. - ఓపెన్ స్కూల్ పరీక్షల్లో జోరుగా మాస్‌కాపీయింగ్ - కొన్నిచోట్ల ఇన్విజిలేటర్లే ప్రోత్సహిస్తున్న వైనం అనంతపురం ఎడ్యుకేషన్ : ఓపెన్ స్కూల్ పరీక్షల్లో చూచిరాతలకు అధికారులు ఈసారీ అడ్డుకట్ట వేయలేకపోయారు. ఈనెల 12 నుంచి జిల్లాలో ప్రారంభమైన సార్వత్రిక విద్యాపీఠం(ఓపెన్ స్కూల్) ఇంటర్ పరీక్షల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. జిల్లాలో అనంతపురం, తాడిపత్రి, గుత్తి, ధర్మవరం, కదిరి, పెనుకొండ, కళ్యాణదుర్గంలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. చాలా కేంద్రాల్లో చూచిరాతలు, మాస్ కాపీయింగ్ జరుగుతోంది. తమకు అనుకూలమైన వారిని చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, ఇన్విజిలేటర్లుగా నియమించుకుని మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్నారు. కొందరు కో-ఆర్డినేటర్లు ఆయా సెంటర్లలో తిష్టవేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా కొందరు ఇన్విజిలేటర్లు ఏకంగా బోర్డుపైనే సమాధానాలు రాయిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కొన్ని కేంద్రాల్లో గేట్లకు తాళాలు వేసి, మరికొన్ని కేంద్రాల్లో గేటు వద్ద ఒకరిద్దరిని కాపాలాగా ఉంచి స్కా్వడ్ వస్తే అన్నీ సర్దేసుకుంటున్నారు. ఇన్విజిలేటర్ల పర్యవేక్షణలోనే చూచిరాతలు కదిరి : కదిరి జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల, బాలికల జూనియర్ కళాశాలలో ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షల్లో అక్రమాలు జరుగుతున్నాయి. ఓపెన్ స్కూల్ పరీక్షా కేంద్రాల నిర్వాహకుల అనుచరులు కొందరు వాచ్‌మన్, క్లర్క్, వాటర్‌మ్యాన్ అవతారమెత్తి పరీక్ష ప్రారంభం కాగానే అన్ని గదులకు తిరుగుతూ జవాబులతో కూడిన స్లిప్‌లు అందిస్తున్నారు. ఈ విషయం తెలిసి విలేకరులు అక్కడికి వెళ్తే ‘మీడియా వాళ్లకు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి లేదు’ అని అక్కడున్న ఇన్విజిలేటర్లతోపాటు సిట్టింగ్ స్క్వాడ్ పేరుతో వచ్చిన అధికారులు అడ్డు చెబుతున్నారు. ఒకరి బదులు మరొకరు పరీక్ష రాస్తున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకుని పరీక్షలు సజావుగా నిర్వహించాలని చెబితే ‘పరీక్ష ఎలా నిర్వహించాలో మాకు తెలుసు.. మీకు అనుమతి లేదు.. పోలీస్ ఈ మీడియా వాళ్లను బయటకు పంపేయండి’ అని పోలీసులను ఆదేశిస్తున్నారు. ఒక్కొక్కరు రూ.10 వేలు ఇచ్చారట! ‘మిమ్మల్ని పాస్ చేయించే బాధ్యత మాది.. మీకు చూసి రాయడం వస్తే చాలు.. పాస్ గ్యారంటీ. పోలీసోళ్లను, మీడియా వాళ్లను మ్యానేజ్ చేయాలి.. అనుకూలమైన ఇన్విజిలేటర్లను వేయించుకోవాలి.. సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లైయింగ్ స్క్వాడ్లను మ్యానేజ్ చేయాలి.. ఎంత రిస్క్ ఉంటుందో మీకేం తెలుసు..’ అంటూ ఒక్కొక్కరి దగ్గర నిర్వాహకులు రూ.10 వేలు తీసుకున్నారని అభ్యర్థులు పరీక్షా కేంద్రం నుంచి బయటకు వస్తూ ఓపెన్‌గానే చెప్పారు. చిట్టీలు దొరికితే సెంటరు రద్దు చేస్తాం ఓపెన్ స్కూల్ పరీక్షలను చాలా సీరియస్‌గా తీసుకుంటున్నాం. అన్ని కేంద్రాల్లోనూ సిట్టింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేశాం. మాస్‌కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తే సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు ఉంటాయి. అభ్యర్థుల వద్ద ఎలాంటి చిట్టీలు దొరికినా వారు ఏ సెంటర్ నుంచి దరఖాస్తు చేసుకున్నారో ఆ కేంద్రం గుర్తింపు రద్దు చేస్తాం. చిట్టీలు దొరికితే ఆయా సెంటర్ల కో-ఆర్డినేటర్లదే బాధ్యత. - డీఈఓ -
పది పరీక్షలపై.. డేగ కళ్ల నిఘా
పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమేరాల ఏర్పాటు మాస్‌కాపీయింగ్, అక్రమాలు అరికట్టేందుకు విద్యాశాఖ సమాయత్తం జిల్లాలోని 304 సెంటర్లలో ఏర్పాటుకు ప్రతిపాదనలు ప్రారంభం కానున్న పరీక్షలు గుంటూరు ఎడ్యుకేషన్ పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ సిద్ధమవుతోంది. మార్చి 21 నుంచి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. అక్రమాలకు తావు లేకుండా అనుక్షణం డేగ కళ్లతో పర్యవేక్షించేందుకు సమాయత్తమవుతోంది. పరీక్ష కేంద్రాల పరిధిలో తొలిసారిగా సీసీ కెమేరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అనుకున్నదే తడవుగా సీసీ కెమేరాల ఏర్పాటుకు టెండర్లు పిలిచేందుకు చర్యలు వేగవంతం చేసింది. విద్యాశాఖ నిర్ణయం అమల్లోకి వస్తే పరీక్ష కేంద్రాల్లో తొలిసారిగా సీసీ కెమేరా వ్యవస్థ అమల్లోకి జిల్లాలో పరీక్ష కేంద్రాలుగా ఏర్పాటు చేస్తున్న 304 విద్యాసంస్థలు సీసీ కెమేరా వ్యవస్థతో అనుసంధానం కానున్నాయి. పబ్లిక్ పరీక్షల్లో ఏటా మాల్ ప్రాక్టీసులకు పాల్పడి విద్యార్థులు పెద్ద సంఖ్యలో పట్టుబడుతున్నారు. జిల్లా కేంద్రానికి దూరంగా ఉండే మారుమూల ప్రాంతాల్లోని పరీక్ష కేంద్రాల్లో మాస్ కాపీయింగ్ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీనిని నివారించేందుకు పరీక్షల నిర్వహణలో చేపట్టిన సంస్కరణల్లో భాగంగా పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లా వ్యాప్తంగా పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమేరాలు ఏర్పాటు చేసి జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ పరీక్షాల విభాగంలోని మెయిన్ సర్వర్‌కు అనుసంధానం చేస్తారు. దీంతో జిల్లాలోని ప్రతి పరీక్ష కేంద్రంలో పరీక్షలకు హాజరైన విద్యార్థులు, ఇన్విజిలేటర్ల కదలికలు, పరీక్షలు జరుగుతున్న తీరు ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వీలుంటుంది. అవకతవకలు చోటు చేసుకుంటే వీడియే పుటేజీ ఆధారంగా బాధ్యులపై చర్యలు చేపట్టేందుకు అవకాశం ఉంటుంది.