పది పరీక్షలపై.. డేగ కళ్ల నిఘా
పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమేరాల ఏర్పాటు
మాస్‌కాపీయింగ్, అక్రమాలు అరికట్టేందుకు విద్యాశాఖ సమాయత్తం
జిల్లాలోని 304 సెంటర్లలో ఏర్పాటుకు ప్రతిపాదనలు
ప్రారంభం కానున్న పరీక్షలు
గుంటూరు ఎడ్యుకేషన్ పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ సిద్ధమవుతోంది. మార్చి 21 నుంచి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. అక్రమాలకు తావు లేకుండా అనుక్షణం డేగ కళ్లతో పర్యవేక్షించేందుకు సమాయత్తమవుతోంది. పరీక్ష కేంద్రాల పరిధిలో తొలిసారిగా సీసీ కెమేరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అనుకున్నదే తడవుగా సీసీ కెమేరాల ఏర్పాటుకు టెండర్లు పిలిచేందుకు చర్యలు వేగవంతం చేసింది. విద్యాశాఖ నిర్ణయం అమల్లోకి వస్తే పరీక్ష కేంద్రాల్లో తొలిసారిగా సీసీ కెమేరా వ్యవస్థ అమల్లోకి జిల్లాలో పరీక్ష కేంద్రాలుగా ఏర్పాటు చేస్తున్న 304 విద్యాసంస్థలు సీసీ కెమేరా వ్యవస్థతో అనుసంధానం కానున్నాయి. పబ్లిక్ పరీక్షల్లో ఏటా మాల్ ప్రాక్టీసులకు పాల్పడి విద్యార్థులు పెద్ద సంఖ్యలో పట్టుబడుతున్నారు.
జిల్లా కేంద్రానికి దూరంగా ఉండే మారుమూల ప్రాంతాల్లోని పరీక్ష కేంద్రాల్లో మాస్ కాపీయింగ్ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీనిని నివారించేందుకు పరీక్షల నిర్వహణలో చేపట్టిన సంస్కరణల్లో భాగంగా పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లా వ్యాప్తంగా పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమేరాలు ఏర్పాటు చేసి జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ పరీక్షాల విభాగంలోని మెయిన్ సర్వర్‌కు అనుసంధానం చేస్తారు. దీంతో జిల్లాలోని ప్రతి పరీక్ష కేంద్రంలో పరీక్షలకు హాజరైన విద్యార్థులు, ఇన్విజిలేటర్ల కదలికలు, పరీక్షలు జరుగుతున్న తీరు ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వీలుంటుంది. అవకతవకలు చోటు చేసుకుంటే వీడియే పుటేజీ ఆధారంగా బాధ్యులపై చర్యలు చేపట్టేందుకు అవకాశం ఉంటుంది.