నూతన వంగడాలు దేశవాలి శనగ, ప్రభాత్ పొద్దుతిరుగుడు
– నూతన వంగడాల ఆవిష్కరణ
– శాస్త్రవేత్తల కృషిని కొనియాడిన ఏడీఆర్
నంద్యాలరూరల్: నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన వంగడాలను ఏడీఆర్ గోపాల్‌రెడ్డి బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన శాస్త్రవేత్తల కషిని కొనియాడారు. ఎన్‌డీఎల్‌ఆర్–7 నంద్యాల సోనా, ఎస్‌బీజీ49 నంద్యాల గ్రాము దేశ వాలి శనగ రకం, ఎండీ ఎస్‌హెచ్ 1012 ప్రభాత్ పొద్దుతిరుగుడుకు చెందిన నూతన వంగడాలను ఆవిష్కరించారు. ఇటీవలే ఆచార్య ఎన్‌జీరంగా విశ్వవిద్యాలయ పరిధిలో రూపొందించిన ఏడింటిలో నాలుగు అత్యల్ప వర్షపాత మండలాల కోసం రూపొందించబడినవని, వాటిలో మూడు నంద్యాల శాస్త్రవేత్తల సష్టే కావడబం గర్వకారణమన్నారు.
– నంద్యాల సోనా..
వరిలో కర్నూలు సోనా(బీపీటీ 5204)కు ప్రత్యామ్నాయంగా నంద్యాల సోనాను రూపొందించారు. గింజ నాణ్యత, పరిమాణం, రుచి, అన్నం నిల్వ సామర్థ్యం తదితర విషయాల్లో కర్నూలు సోనాతో సమానం. ఖరీఫ్‌లో 140రోజులు, రబీలో 135రోజుల్లో కోతకు వస్తుంది. దోమపోటు, ఆకుముడత, అగ్గితెగులను తట్టుకుటుంది. కోత దశలో పైరు పడిపోదు, గింజ రాలదు. ఎకరాకు సగటున 25–35 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఆలస్యంగా నాటుకు అనుకూలం. కర్నూలు సోనా కంటే రూ.100 నుండి రూ.150 వరకు అధిక ధర. 2015–16లో కర్నూలు జిల్లాలో 8వేల ఎకరాలు, కడప జిల్లాలో 1000 , కర్ణాటకలో 3500 ఎకరాలు వ్యవసాయ పరిశోధనా స్థానం పర్యవేక్షణలో సాగులో ఉంది.
నంద్యాల గ్రాము–49..
శనగకు సంబంధించి నంద్యాల గ్రాము –49 రకం అధిక దిగుబడిని ఇచ్చే దేశ వాలి వంగడం. ఇది జేజీ–11 రకానికి ప్రత్యామ్నాయం. 90–105 రోజుల వ్యవధిలో 20 నుంచి 25క్వింటాళ్లు దిగుబడి వస్తుంది. గింజలు మంచి సైజు, నాణ్యత, రంగు కలిగి ఉండటంతో అధిక ధర లభిస్తుంది.
ప్రభాత్ –1012..
తక్కువ పంట కాలం, అధిక దిగుబడి, అధిక నూనెశాతం కల్గిన సన్‌ఫ్లవర్ రకం ఇంది. 90–95రోజుల వ్యవధిలో వర్షాధారంగా ఎకరాకు 6 నుంచి 7క్వింటాళ్లు, నీటి పారుదల కింద 8 నుంచి 10క్వింటాళ్లు దిగుబడి వస్తుంది. బూజు తెగులను తట్టుకుంటుంది. ఇది కేబీఎస్‌హెచ్–44, డీఆర్ ఎస్‌హెచ్–1, ఎస్‌బీ–275, ఇతర ప్రయివేటు సంకరాలకు మంచి ప్రత్యామ్నాయం.
– కె.1535(కదిరి అమరావతి)..
వేరుశెనగకు సంబంధించిన ఈ రకం కదిరి ఆరు రకాలకు ప్రత్యామ్నాయం. చీడపీడలు, బెట్టను తట్టుకునే శక్తి అధికం. కాండం కుళ్లు తెగులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సాగుకు అనుకూలం.