బదిలీలకు సై
రెండేళ్లుగా ఎదురు చూస్తున్న వారికి ఊరట
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రభుత్వ ఉద్యోగుల బదిలీ లపై సర్కారు నిషేధం ఎత్తివేసింది. గత రెండేళ్లుగా ఎప్పుడెప్పుడు బదిలీలు జరుగుతాయా అని ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వ నిర్ణయం ఊరటనిచ్చింది. ఉద్యోగుల పంపకంలో భాగంగా కమలనాథన్ కమి టీ చేస్తున్న కసరత్తుకు ఇబ్బంది కలగకుండా జూన్ 2, 2014 నుంచి బదిలీలు నిర్వహించలేదు. తాజాగా ఉద్యోగుల పంపకం పూర్తికావడంతో రాష్ట్ర ప్రభుత్వం బదిలీల ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఈమేరకు మంగళవారం బదిలీలపై నిషేధం ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక, జిల్లా, జోనల్, మల్టీ జోనల్ ఉద్యోగులందరికీ బదిలీ అవకాశాన్ని కల్పించింది. అయితే ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను మాత్రం ఇంకా విడుదల చేయలేదు.
ప్రత్యేక బదిలీలకు బ్రేక్..
రెండేళ్లుగా ప్రభుత్వం బదిలీల ప్రక్రియ చేపట్టలేదు. ఈక్రమంలో సుదీర్ఘకాలంగా ఓకే చోట పనిచేస్తున్న ఉద్యోగులకు ఈప్రక్రియ కొంత ఇబ్బంది కలిగించింది. ఈక్రమంలో కొందరు పైస్థాయిలో ప్రయత్నాలు చేసి ప్రత్యేక కేటగిరీలో బదిలీ ఉత్తర్వులు తెచ్చుకున్నారు. కొందరైతే కోరిన చోటుకు బదిలీ చేయించుకున్నారు. ఇలాంటి బదిలీలు పదుల సంఖ్యలో జరిగాయి. మరికొన్నిచోట్ల పరిపాలన విభాగం కింద ఉన్నతాధికారులు అత్యుత్సాహంతో బదిలీలు చేశారు. తాజాగా ఇలాంటి బదిలీలకు బ్రేక్ పడింది. ఉద్యోగులందరికీ నిర్దిష్ట గడువును విధిస్తూ బదిలీలకు అవకాశం కల్పించింది. ఒకట్రెండు రోజుల్లో మార్గదర్శకాలు వచ్చిన వెంటనే ఆయా శాఖాధిపతులు బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉంటుంది.