‘రియల్’ ఢమాల్
-
రూ. వెయ్యి, 500 నోట్ల రద్దుతో ఆగిన క్రయ, విక్రయాలు
-
మార్పిడి నగదుపై కేంద్రం ఆంక్షలతో ఇబ్బందులు
-
మరో మూడు నెలలు ఇదే పరిస్థితి ఉంటుందన్న భయంతో అయోమయం
-
దీంతో దిగిరానున్న ఇళ్ల స్థలాలు, ఇంటి ధరలు
సాక్షి, రాజమహేంద్రవరం:
రూ. వెయ్యి, 500 నోట్ల రద్దుతో జిల్లాలో స్థిరాస్తి వ్యాపారం ఒడుదొడుకులకు గురవుతోంది. పాత నోట్ల స్థానంలో కొత్త రూ.500, రూ. 2000 నోట్లు మార్చుకున్నా నగదు చలామణిపై కేంద్రం విధించిన ఆంక్షలతో ఇప్పట్లో స్థిరాస్తి వ్యాపారం పుంజుకునే అవకాశం లేదని రియల్ వ్యాపారస్తులు వాపోతున్నారు. ప్రస్తుతం పాత నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్లు చేసినా ఖాతాదారుడు ఈ నెల 24 వరకు రోజుకు గరిష్టంగా రూ.10 వేలు, వారానికి రూ.20 వేలు మాత్రమే తీసుకునేలా కేంద్రం ఆంక్షలు విధించడం ... నగదు తీసుకోవడంపై ఆంక్షలు ఎత్తివేస్తామని చెప్పకపోవడంతో రియల్ వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో వందల వెంచర్లున్నాయి. ప్లాట్లు మార్చి అభివృద్ధి చేసి విక్రయానికి సిద్ధంగా ఉంచారు. ప్రస్తుత పరిస్థితుల్లో నగదు అందుబాటులో లేక క్రయవిక్రయాలు నిలిచిపోయే పరిస్థితి తలెత్తడంతో వారంతా దిక్కు తోచని స్థితిలో తలలు పట్టుకుంటున్నారు.
స్థలాలపైనే ఎక్కువగా ప్రభావం...
ప్రస్తుత పరిస్థితుల్లో మరో మూడు నాలుగు నెలల వరకు పూర్తి స్థాయిలో నగదు చలామణిలోకి వచ్చే అవకాశం లేదు. అప్పటి వరకు భారీ స్థాయిలో నగదు అవసరమయ్యే పొలాలు, స్థలాల క్రయ విక్రయాలు నిలిచిపోనున్నాయి. నగదు కొరత ప్రభావం పొలాలు, ఓపె¯ŒS ప్లాట్ల కన్నా ఇళ్లపై తక్కువగా ఉంటుందని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇళ్లు కొనుగోలు చేయడం ద్వారా ఆ మొత్తాన్ని ఆదాయ పన్నులో చూపించుకునే అవకాశం ఉండడంతో అటువైపు ఆసక్తి చూపుతారని వివరిస్తున్నాయి.
నగదు రహిత వ్యవహారాలే అధికం
కేంద్రం నగదు చలామణిపై ఆంక్షలు విధించడంతో మార్కెట్‌లోకి కొత్తనగదు ప్రవాహం తక్కువగా ఉంది. దీంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో క్రయవిక్రయాలకు సంబంధించిన ఆస్తుల రిజిస్ట్రేష¯ŒS చాలా వరకు తగ్గింది. ప్రస్తుతం గిఫ్ట్‌లు, మార్ట్‌గేజ్‌లు, చెల్లు రసీదులు, ఆస్తుల బదలాయిపు వ్యవహారాలే ఎక్కువగా జరుగుతున్నాయి.
దిగిరానున్న ఇళ్ల ధరలు..
ఇప్పటి వరకు ఇళ్ల ధరలు ఆకాశాన్నంటాయి. నల్ల ధనాన్ని అరికట్టడానికి నగదు చెలామణిపై కేంద్రం పరిమితులు విధించడంతో ఇంటి స్థలాల ధరలు తగ్గుతాయని పలువురు భావిస్తున్నారు. ఫలితంగా ప్లాట్లు, ఇళ్ల ధరలు తగ్గించే అవకాశం ఉంటుందని స్థిరాస్తి వ్యాపారులు పేర్కొంటున్నారు.
నగదు చెలామణి పెరిగితే యథాతథం
రూ.వెయ్యి, 500 నోట్లు రద్దుతో నగదు చెలామణి తగ్గింది. దీని ప్రభావం స్థిరాస్తి వ్యాపారంపై పడింది. గతంలో కన్నా 40 నుంచి 50 శాతం మేర రిజిస్ట్రేషన్లు తగ్గాయి. డిసెంబర్ వరకు ఇదే పరిస్థితి ఉండొచ్చు. నగదు పూర్తి స్థాయిలో చెలామణి అయితే మళ్లీ రిజిస్ట్రేషన్లు పుంజుకుంటాయి.
– ఆర్. సత్యనారాయణ, జిల్లా రిజిస్ట్రార్, రాజమహేంద్రవరం.
ఇళ్ల కొనుగోళ్లు పెరుగుతాయి
స్థల క్రయవిక్రయాల నగదు అధికారికంగా చెల్లిస్తే భూముల విలువ తగ్గుతుంది. తద్వారా ప్లాట్ ధర తగ్గుతుంది. మధ్య తరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో ఇళ్లు ఉంటాయి. ఇళ్ల కొనుగోళ్లకు బ్యాంకులు రుణాలు ఇస్తాయి. మా వ్యాపారం పెరుగుతుంది.
– ఎ.కృష్ణమోహన్, అపార్ట్‌మెంట్ బిల్డర్ల అసోసియేష¯ŒS సెక్రటరీ, కాకినాడ
వీరి రూటే వేరు...
డిసెంబర్ నెలాఖరు వరకు రద్దయిన నోట్లు మార్చుకునేందుకు అవకాశం ఉండడంతో పలుకుబడి ఉన్న వ్యాపారస్తులు, రియల్ వ్యాపారంలో ఉన్న రాజకీయ నేతలు తమ వ్యాపారాన్ని కొంతమేరకు నిర్వహిస్తున్నారు. సాధారణంగా మార్కెట్ విలువ కన్నా ప్రభుత్వ విలువ తక్కువగా ఉంటుంది. కొనుగోలుదారుడు ప్రభుత్వ విలువనే చూపిస్తూ రిజిస్ట్రేష¯ŒS చేయించుకుంటాడు. ఆ మొత్తానికే పన్ను చెల్లిస్తాడు. ఇది మార్కెట్ విలువలో కేవలం 15 నుంచి 20 శాతం ఉంటుంది. మిగతా మొత్తం నల్లధనంగా ఇస్తాడు. అయితే పాత నోట్లను మార్చుకునే పలుకుబడి ఉన్న వారు క్రయవిక్రయాలు జరుపుతున్నారు. అయితే నగదు రూపంలో ఇచ్చే మొత్తానికి అదనంగా 10 శాతం తీసుకుంటూ వ్యాపారం చేస్తున్నారు.