రీకౌన్సెలింగ్‌..రచ్చరచ్చ | Reconstruction process | Sakshi
Sakshi News home page

రీకౌన్సెలింగ్‌..రచ్చరచ్చ

Published Wed, Jun 7 2017 6:22 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

రీకౌన్సెలింగ్‌..రచ్చరచ్చ - Sakshi

రీకౌన్సెలింగ్‌..రచ్చరచ్చ

కడప రూరల్‌: కడప పాత రిమ్స్‌లోని వైద్య ఆరోగ్యశాఖ రీజనల్‌ డెరెక్టర్‌ కార్యాలయ పరిధిలోని నాలుగు (కర్నూలు, చిత్తూరు, అనంతపురం, వైఎస్సార్‌)జిల్లాల ఉద్యోగులకు సోమవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో రీకౌన్సెలింగ్‌ ప్రక్రియ రచ్చ..రచ్చగా సాగింది. గడిచిన గురు, శుక్ర, శనివారాల్లో కడపలోని ఆ శాఖ ఆర్డీ కార్యాలయంలో నిర్వహించిన కౌన్సెలింగ్‌లో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈక్రమంలో ఆ శాఖ కమిషనర్‌ రీకౌన్సెలింగ్‌ జరపాలని ఆదేశాలు జారీ చేశారు. ముందుజాగ్రత్త చర్యగా ఈ రీకౌన్సెలింగ్‌ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో నిర్వహించాలని నిర్ణయించారు.

  ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఆ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ మీనాకుమారి, ప్రాజెక్టు ఆఫీసర్‌ డాక్టర్‌ అరుణ్, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ప్రకాశ్‌రావు, డిప్యూటీ డైరెక్టర్లు డాక్టర్‌ శ్రీనివాసరెడ్డి, గణపతిరావు తదితరులు డీఎంహెచ్‌ఓ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అయితే వారిని లోనికి వెళ్లనీయకుండా ఎన్జీఓ అసోసియేషన్‌ నాయకులతోపాటు ఇతరులు అడ్డుకున్నారు. తప్పులు సరిదిద్దాలని, రీకౌన్సెలింగ్‌ను మాత్రం జరపరాదని డిమాండ్‌ చేశారు. గోబ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు శివారెడ్డి, కార్యదర్శి శ్రీనివాసులరెడ్డి తదితరులు మాట్లాడుతూ ఏవైనా లోపాలు ఉంటే సరిదిద్దండి..రీకౌన్సెలింగ్‌కు మాత్రం జరపరాదని తెలిపారు. రీకౌన్సెలింగ్‌ జరిగితే చాలామందికి ఇబ్బందిగా ఉంటుందని, అందరూ హాజరుకావాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. అనంతరం రీకౌన్సెలింగ్‌కు వ్యతిరేకవర్గం డీఎంహెచ్‌ఓ కార్యాలయ తలుపులను మూసివేశారు. రీకౌన్సెలింగ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

అనుకూల వర్గం ఆగ్రహం
ఇదే తరుణంలో రీకౌన్సెలింగ్‌ జరపాలని ఓ వర్గం డిమాండ్‌ చేసింది.  కొంతమంది కార్యాలయం లోపల, బయట బైఠాయించి రీకౌన్సెలింగ్‌ జరిపి తీర్సాలిందే అంటూ పోటీ నినాదాలు చేశారు. రీ కౌన్సెలింగ్‌ జరపకపోతే తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా  తిరుపతి రుయా ఆస్పత్రి స్టాఫ్‌ నర్సు సుజాత మాట్లాడుతూ సుఖాలు, సంతోషాలు నాయకులకేనా.. తమకు లేవా? అని నిలదీశారు. నిబంధనల మేరకు ఎవరైనా సరే లాంగ్‌ స్టాడింగ్‌లో ఉన్న వారందరినీ బదిలీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ రీకౌన్సెలింగ్‌లో కూడా ఏవైనా అక్రమాలు జరిగితే  సహించేది లేదని హెచ్చరించారు.

రీ కౌన్సెలింగ్‌ చేపట్టి తీరుతాం
రీకౌన్సెలింగ్‌ వద్దన్న వారి మాటలను ఆ శాఖ జేడీ మీనాకుమారి తదితరులు లెక్కచేయలేదు. ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తామని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాము వెనక్కి వెళ్లేది లేదని, రీకౌ న్సెలింగ్‌ చేపట్టి తీరుతామన్నారు. ఏదైనా అభ్యంతరాలుంటే ఫిర్యాదులు ఇచ్చుకోవచ్చని తెలిపారు. అంత ఆందోళన జరుగుతున్నా అధికారులు ఏమాత్రం వెనుకడుగు వేయకుండా మెల్లమెల్లగా ముందుకు సాగి కార్యాలయంలోకి వెళ్లిపోయారు. దీంతో చేసేదేమీలేక రీకౌన్సెలింగ్‌కు వ్యతిరేకులు చూస్తూ ఉండిపోయారు.

స్థానికేతరుల ఇబ్బందులు..కరువైన సౌకర్యాలు
రీకౌన్సెలింగ్‌ ఉందంటూ ఉన్నఫలంగా వైఎస్సార్‌ జిల్లాతోపాటు చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని ఆ శాఖ ఉద్యోగులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారంతా తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. చాలామంది ఉద్యోగులు వ్యయ ప్రయాసలు కోర్చి డీఎంహెచ్‌ఓ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే రావాల్సిన వారిలో ఎంతమంది వచ్చారనేది తేలియలేదు. అలాగే  ఆర్డీ కార్యాలయంలో నీడ ఇవ్వడానికి కనీసం చెట్లయినా ఉన్నాయి. డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో అవి కూడా లేకపోవడంతో నాలుగు జిల్లాలకు చెందిన ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అక్కడ నామమాత్రంగా చిన్నవి రెండు షామియానాలు మాత్రమే వేశారు. ఒక షామియాన వాహనాల పార్కింగ్‌కు సరిపోయింది. దీంతో నిలువ నీడలేక చాలామంది ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా పిల్లాపాపలతో వచ్చిన వారు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. అందులోనూ మహిళా ఉద్యోగులు మరింతగా ఇబ్బందులకు గురయ్యారు. కాగా, మండువేసవిలో కనీసం తాగునీటి సౌకర్యం కూడా కల్పించకపోవడం గమనార్హం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement