
‘ఎర్ర’ క్వీన్‌కి అరెస్టు వారెంట్
చిత్తూరు(అర్బన్): మాజీఎయిర్ హోస్టెస్, ఎర్రచందనం స్మగ్లింగ్ క్వీన్ సంగీత చటర్జీకి చిత్తూరు న్యాయస్థానం అరెస్టు వారెంటు జారీ చేసింది. అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ లక్ష్మణ్ రెండో భార్య అయిన సంగీతపై చిత్తూరు డివిజన్‌లోని మూడు స్టేషన్లలో ఎర్రచందనం కేసులు ఉన్నాయి. లక్ష్మణ్ అరెస్టు తరువాత ఈమె ఎర్రచందనం ఎగుమతి, స్మగ్లర్లకు భారీ ఎత్తున నగదు సమకూర్చడం తెలిసిందే. కోల్‌కతాలో ఈమెను అరెస్టు చేసిన చిత్తూరు పోలీసులు, అక్కడున్న న్యాయస్థానంలో హాజరు పరచి రిమాండు చేశారు.
తదుపరి బెయిల్‌పై వచ్చిన ఆమె, కేసు విచారణకు చిత్తూరు కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతోంది. ఈ నేపథ్యంలో నాలుగు నెలల క్రితం సంగీతపై చిత్తూరు న్యాయస్థానం నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దీనిపై కోల్‌కతా పోలీసులు స్పందించలేదు. తాజాగా మరో అరెస్టు వారెంటును జారీ చేస్తూ, జనవరి 10లోపు ఆమెను చిత్తూరు కోర్టులో హాజరుపరచాలని కోల్‌కతా పోలీస్ కమిషనర్‌ను ఆదేశించింది.