బాధ్యతలు స్వీకరిస్తున్న రవీందర్‌రావు
- తొమ్మది నెలల తర్వాత రెగ్యులర్ కమిషనర్
- సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్‌గా రవీందర్‌రావు
- జోగిపేటలో సస్పెన్షన్.. ఇక్కడ పోస్టింగ్
- ప్రజా సమస్యలు పరిష్కారమయ్యేనా?
సంగారెడ్డి మున్సిపాలిటీ: సంగారెడ్డి గ్రేడ్-1 మున్సిపల్ రెగ్యులర్ కమిషనర్‌గా రవీందర్‌రావు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మున్సిపల్ చెర్ పర్సన్ విజయలక్ష్మి ఇంటికి వెళ్లి మర్యాద పూర్వకంగా కలిశారు. రెండు నెలల క్రితం తెలంగాణ హరితహారం కార్యక్రమం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని జోగిపేట-అందోల్ నగర పంచాయతీ కమిషనర్‌గా పనిచేసిన రవీందర్‌రావును కలెక్టర్ జూల్12న సరెండర్ చేశారు. అదే అధికారి జిల్లా కేంద్రానికి కమిషనర్‌గా వచ్చారు.
దీంతో ఏ మేరకు సమస్యలు పరిష్కారం అవుతాయోనన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మరో వైపు తొమ్మిది నెలల పాటు ఇన్‌చార్జి కమిషనర్లతో పాలన కుంటుపడిందని సర్వత్రా ఆరోపణలు వినవస్తున్నాయి. దీనికి తోడు ప్రధానంగా ఇంటి అనుమతుల సమస్య తీవ్రంగా ఉంది. గత ఆరు నెలలుగా ఇంటి నిర్మాణల కోసం వందల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. కాని అనుమతులు ఇవ్వ లేదు. దీని కోసంగ గత ఇనచార్జి కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించిన ఏజేసీపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి వచ్చినా నిబంధనల ప్రకారమే అనుమతులు ఇస్తానని తేల్చి చెప్పేవారు.
దీంతో పాలకవర్గ సభ్యులు కొందరు అధికార పార్టీ కౌన్సిలర్లు, చైర్‌పర్సన్‌తో కలిసి మంత్రి పై ఒత్తిడి తీసుకొచ్చారు. ఇన్‌చార్జి కమిషనర్ బాధ్యతల నుంచి ఏజేసీని తప్పించి రెగ్యులర్ కమిషనర్‌ను నియమించాలని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌తో పాటు భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావుల వద్దకు పలు మార్లు వెళ్లినట్లు తెలిసింది. దీంతో జోగిపేటలో సస్పెండ్‌కు గురైన జోగిపేట నగర పంచాయతీ కమిషనర్‌ను సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్‌గా నియమించారు.
విమర్శల వెల్లువ
నగర పంచాయతీకి విధులు నిర్వహిస్తున్న కమిషనర్‌ను గ్రేడ్-1 మున్సిపల్ కమిషనర్‌గా పోస్టింగ్ ఇవ్వడంపై పలు విమర్శలు వెల్లువెత్తున్నాయి. సంగారెడ్డి మున్సిపాలిటీలో గ్రేడ్-1 అధికారిని నియమించాల్సి ఉంది. కాని నగర పంచాయతీకి కమిషనర్‌గా, ఆపై సస్పెండ్ అయిన అధికారిని ఎలా గ్రేడ్-1 మున్సిపల్ కమిషనర్‌గా నియమిస్తారని స్వయంగా ఆ శాఖకు చెందిన ఉన్నత స్థాయి ఉద్యోగులే ప్రశ్నిస్తున్నారు.