ములుగు జిల్లా చేయాలని టవరెక్కి నిరసన
Published Thu, Sep 22 2016 12:47 AM | Last Updated on Mon, Sep 4 2017 2:24 PM
ములుగు : ములుగును జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ టీఎన్‌ఎస్‌ఎఫ్ నియోజకవర్గ ఇన్‌చార్జి బొమ్మకంటి రమేశ్, బహుజన సమాజ్‌వాదీ పార్టీ డివిజన్ అధ్యక్షుడు బొట్ల ప్రశాంత్ బుధవారం సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. దీంతో గంట పాటు ఉద్రిక‍్త పరిస్థితి నెలకొంది. ఆర్డీఓ వచ్చి సమస్య పరిష్కరించే వరకు దిగేది లేదని పట్టుబడడంతో ఆయన ఫోన్లో మాట్లాడారు. జిల్లాల విషయంలో పూర్తి స్థాయి నివేదికను కలెక్టర్‌కు అందించామని, నివేదిక ఆధారంగా తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
ఆ తర్వాత వారు కలెక్టర్‌తో మాట్లాడేంత వరకు దిగేది లేదని చెప్పడంతో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే ధనసరి సీతక్క, ఎస్సై దగ్గు మల్లేశ్‌యాదవ్ అక్కడకి చేరుకుని వారిని కిందికి దిగాలని కోరారు. డిమాండ్లను ఉన్నతాధికారుల ముందు ఉంచుతానని ఎస్సై హామీ ఇవ్వడంతో కిందికి దిగారు. అనంతరం వారిని ఎస్సై స్టేషన్‌కు తరలించారు. కాగా , టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీతక్క మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల సౌకర్యార్ధం ప్రభుత్వం ములుగును జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
Advertisement