బెల్ట్‌షాపులు ఎత్తివేయాలని ధర్నా
నందిగామ రూరల్ : గ్రామంలో బెల్టు షాపులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఏటూరు గ్రామ మహిళలు నందిగామ ఎక్సైజ్ శాఖ కార్యాలయం ఎదుట శనివారం ధర్నా నిర్వహించారు. అధికారులు చర్యలు తీసుకునే వారుకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. గతంలో ఆందోళన ఫలితంగా మూడు నెలలపాటు బెల్టు షాపులు మూసివేశారని, అయితే, ఇటీవల మళ్లీ బెల్టు షాపులు తిరిగి ఏర్పాటు చేయడంపై మండపడ్డారు. విద్యార్థులు కూడా మద్యానికి బానిసలవుతున్నారని వాపోయారు. మహిళల ఆందోళనకు సీపీఎం నాయకుడు సయ్యద్ ఖాసిం, కటారపు గోపాల్ మద్దతు తెలిపారు. విషయం తెలుసుకున్న అధికారులు మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఎక్సైజ్ సీఐ సాయిస్వరూప్ ఆధ్వర్యంలో సిబ్బంది గ్రామానికి వెళ్లారు. వారు తిరిగి కార్యాలయానికి వచ్చే వరకు మహిళలు ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. గ్రామంలోని బెల్టు షాపులను పూర్తిగా మూసివేయించామని, ఇకపై గ్రామంలో బెల్టు షాపు నడవకుండా చూసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. డ్వాక్రా సంఘాల లీడర్లు శీలం నాగేంద్రం, కామా అరుణకుమారి, నేలపాటి మరియమ్మ, సుజాత, తేరేజమ్మ, దుర్గ, మరియమ్మ పాల్గొన్నారు.