exise office
-
మందు.. మేమే అందిస్తాం..!
సాక్షి, ములుగు: జిల్లాలో మద్యం వాప్యారం యధేచ్ఛగా కొనసాగుతోంది. ఉన్నత అధికారులతో సంబంధం లేకుండా ప్రతి రోజూ విచ్ఛలవిడిగా అమ్మకాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ నిబంధనల మేరకు నియమాలను అమలు చేయాల్సిన సంబంధిత శాఖ అధికారులు నిద్రమత్తులో చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నూతనంగా ఏర్పాటైన వైన్స్ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా మద్యం అమ్మకాలు జరుపుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. గ్రామాల్లో బెల్టు షాపులు యధేచ్ఛగా కొనసాగుతున్నాయి. స్పందించాలి్సన అధికారులు తూతూ మంత్రంగా దాడులు నిర్వహిస్తూ కేసులు నమోదు చేస్తున్నారు. ఎక్సైజ్ అధికారులతో పోలిస్తే పోలీసు శాఖ జరిపే దాడుల్లోనే అధికంగా కేసులు నమోదు అవుతుండడం విశేషం. ప్రత్యేక వాహనాల్లో బెల్టు షాపులకు మద్యం..! గతంలో జిల్లాలోని వివిధ గ్రామాల బెల్టు షాపుల వ్యాపారులు మండల కేంద్రాల్లోని వైన్స్ నుంచి మద్యం కొనుగోలు చేసి గ్రామాల్లో అమ్మకాలు జరిపేవారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి తారుమారయింది. ఉన్నత అధికారుల నిఘా లోపించడంతో వ్యాపారులు ఒకడుగు ముందుకు వేసి ఆయా మండలాల వారీగా సిండికేట్‌గా మారి ప్రత్యేక వాహనంలో గ్రామాలకు మద్యం తరలిస్తూ బహిరంగంగా వ్యాపారాన్ని కొనసాగిస్తూ లక్షల రూపాయలు గడిస్తున్నారని తెలుస్తుంది. ఈ దందాను నిలవరించే వారే లేకపోవడంతో వైన్స్ వ్యాపారులు రోజు వారీగా బహిరంగ వ్యాపారాలు జరుపుకుంటూ మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందాన దందాను విస్తరిస్తున్నారు. ములుగు, వెంకటాపురం(ఎం), ఏటూరునాగారం, వెంకటాపురం(కే), వాజేడు, మంగపేట, ఎస్ఎస్ తాడ్వాయి మండలాల్లోని వైన్స్ వ్యాపారులు నిత్యం బెల్టు షాపుల నిర్వాహకులకు ఏదో ఒక సమయంలో గుట్టుచప్పుడు కాకుండా మద్యం సరఫరా చేస్తూ దందా కొనసాగిస్తున్నారు. మంగపేటలో ఇతర ప్రాంతాల నుంచి.. మంగపేట మండలంలోని రాజుపేట, చుంచుపల్లిలో 1/70 చట్టంలో భాగంగా వైన్స్ నిర్వహణ లేదు. ఈ పరిణామాన్ని ఆసరాగా తీసుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పినపాక మండలం జానంపేట, ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని కాటాపురం, ఏటూరునాగారం మండలకేంద్రం నుంచి ఆటోల ద్వారా బెల్టు షాపులకు మద్యం సరఫరా చేస్తున్నారని తెలుస్తుంది. కొంత మంది నేరుగా ద్విచక్ర వాహనాల ద్వారా బెల్టు షాపులకు మద్యం విక్రయిస్తున్నట్లు సమాచారం. ఒక్కో బాటిల్‌పై రూ.30 అధికం గ్రామాల్లోని »బెల్టు షాపులకు వైన్స్ వ్యాపారులు ఒక్కో బీరు, క్వార్టర్ బాటిల్‌ను రూ. 10 చొప్పున ఎక్కువకు సరఫరా చేస్తున్నారు. దీంతో బెల్టు షాపుల వ్యాపారులు అదే బాటిల్‌పై రూ. 30 అధికంగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని మద్యం ప్రియులు తమ జేబులను గుళ్ల చేసుకోవాలి్సన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంలో పలుమార్లు ఫిర్యాదులు అందినా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలున్నాయి. ఈ విషయంలో ఉన్నత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి్సన అవసరం ఉంది. -
నిలువు దోపిడీ!
దశలవారీ మద్యపాన నిషేధంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో మద్యం అమ్మకాలు తగ్గడంతో రెస్టారెంట్స్ అండ్ బార్లకు వరంగా మారింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బార్ల యజమానులు నిబంధనలు తుంగల్లో తొక్కి దోపిడీకి తెరతీశారు. సాక్షి, విజయనగరం : నవరత్నాల హామీల్లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాలుగు నెలల పాలనలోనే దశలవారీ మద్య నిషేధానికి తెరతీశారు. జిల్లాలో విచ్చలవిడిగా ఉన్న బెల్టు దుకాణాలపై ఉక్కుపాదం మోపడంతో బెల్టు దుకాణాలు మూతపడ్డాయి. ప్రైవేటు మద్యం వ్యాపారుల చేతిలో ఉన్న మద్యం దుకాణాలను ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తుంది. నూతన మద్యం విధానంతో జిల్లాలో 210 మద్యం దుకాణాలను 20 శాతం తగ్గించి 168కి పరిమితం చేశారు. దీంతో పాటు గతంలో ఉదయం 10 గంటలకు తెరిచి రాత్రి 10 గంటల వరకు అమ్మకాలు సాగించి రెండు చేతులా సంపాదించేవారు. మద్యం అమ్మకాలు నియంత్రించడానికి ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మద్యం దుకాణాల నిర్వహణ మూడు గంటల సమయం తగ్గించారు. దీంతో రెస్టారెంట్ అండ్ బార్లుకు వరంగా మారింది. దీంతో నూతన మద్యం విధానం అమలుకాక ముందు రోజుకు ఒక్కో బార్లలో రూ.2 లక్షల వరకు విక్రయాలు జరిగితే ప్రస్తుతం రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు విక్రయాలు పెరగడం విశేషం. మందుబాబులకు ధరల ‘కిక్కు’ నూతన మద్యం విధానంతో జిల్లాలో మద్యం దుకాణాలు తగ్గడమే కాకుండా సమయానికే మూతపడటంతో మందుబాబులకు మద్యం దొరకడం కష్టమవుతుంది. దీంతోపాటు గతం లో మద్యం దుకాణాల పక్కనే పర్మిట్ రూమ్‌లు ఉండటంతో మందుబాబులు అక్కడే మద్యం కొనుగోలు చేసి పర్మిట్ రూమ్‌ల్లో తాఫీగా తాగి వెళ్లేవారు. ప్రస్తుతం పర్మిట్ రూమ్‌లు తొలగించడంతో మందుబాబులకు తాగేందుకు స్థలం లేక బార్లను ఆశ్రయిస్తున్నారు. ఒకరికి మూడు బాటిళ్లు కంటే ఎక్కువ అమ్మకాలు చేయడంగాని, తీసుకువెళ్లడం చేయరాదని ప్రభుత్వం నిబంధనలు విధించింది. దీంతో జిల్లాలోని 28 బార్ అండ్ రెస్టారెంట్లు మందుబాబులకు అనుకూలంగా మారాయి. దీంతో బార్ల యజమానులు దోపిడీకి తెరలేపేశారు. ఉదయం 11 గంటలకు తెరుచుకుంటున్న బార్లు రాత్రి 1 గంట వరకు కొనసాగుతున్నాయి. రాత్రి 11 గంటలకే అమ్మకాలు బంద్ చేయాల్సిన బార్ల యజమానులు 12 వరకు అమ్మకాలు కొనసాగిస్తున్నారు. ఎంఆర్పీపై ప్రభుత్వం పెంచిన ధరను కలిపి విక్రయించాల్సిన మద్యాన్ని విడి విక్రయాలు, మద్యం కల్తీతో పాటు అదనంగా ధర పెంచి సొమ్ము చేసుకుంటున్నారు. ముఖ్యంగా సర్వీసు ట్యాక్స్ పేరిట బార్ల యజమానులు మందుబాబులకు షాకిస్తున్నారు. దీంతో బార్లకు వచ్చిన మందుబాబులకు ధరల బాదుడు చూసి కిక్కు దిగిపోతుంది. నిబంధనలు బేఖాతరు వాస్తవంగా బార్ అండ్ రెస్టారెంట్లలో మద్యం అమ్మకాలతో పాటు మందుబాబులకు తిండి లభ్యమవుతుంది. తిండి పదార్థాలు వండడానికి అన్ని సౌకర్యాలు బార్లలో ఉండాల్సిందే. జిల్లాలో 80 శాతానికి పైగా బార్లలో వంట చేయడానికి కావాల్సిన సౌకర్యాలు లేవు. అనేక బార్లలో బయట తిండి తెచ్చి విక్రయాలు సాగిస్తున్నారు. పర్యవేక్షణేది? నిబంధనలు అతిక్రమిస్తున్న బార్లపై గట్టి నిఘా, పర్యవేక్షించాల్సిన ఎక్సైజ్ అధికారులు బార్ల యజమానులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండటంతో పర్యవేక్షణ గాలికొదిలేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. 80 శాతం పైగా బార్లలో నిబంధనలు అమలుకాకున్నా అధికారులు పట్టించుకోవడం లేదని పలువులు విమర్శలు గుప్పిస్తున్నారు. -
నాలుగు క్వింటాళ్ల గంజాయి పట్టివేత
మల్కన్‌గిరి : మల్కన్‌గిరి సమితి పద్మాగిరి పంచాయతీలో బుధవారం ఉదయం ఎక్సైజ్ అధికారులు తనిఖీ నిర్వహించి ఓ ఇంటిలో నాలుగు క్వింటాల గంజాయిని పట్టుకున్నారు. ముందస్తు సమాచారంతో మల్కన్‌గిరి ఎక్సైజ్ అధికారి అశోక్‌కుమార్‌శెట్టి తన బృందంతో తనిఖీలు నిర్వహించారు. అయితే పతీత్ బిస్వష్, మహాదేవ్ బిస్వష్‌లు ఛత్తీస్‌గఢ్ తరలించేందుకు గంజాయి నిల్వలు ఇంటిలో ఉంచారు. ఎక్సైజ్ అధికారులు దాడి చేసిన సమయంలో తండ్రి పతీత్ బిస్వష్ పరారయ్యాడు. కొడుకు మహదేవ్ బిస్వస్‌ను అరెస్టు చేశారు. మల్కన్‌గిరి ఎక్సైజ్ అధికారి అశోక్‌కుమార్ మాట్లాడుతూ ఈ గంజాయి విలువ 20లక్షలు ఉంటుంటుని తెలిపారు. మంగళవారం కూడా రెండు వలదల క్వింటాళ్ల గంజాయిని పట్టుకున్నామని తెలిపారు. గిరిజన గ్రామాల్లో ఇదే ముఖ్య పంటగా పండిస్తున్నారన్నారు. నెల రోజుల్లో 50 కోట్లు విలువ చేసే గంజాయి పంటను ధ్వంసం చేశామని ఇంకా ప్రతి గ్రామంపై దాడి చేసి ఈ గంజాయి సాగును ధ్వంసం చేస్తామని చెప్పారు. -
ఎక్సైజ్ కార్యాలయం ముట్టడి
మద్యం దుకాణాలు తొలగించాలంటూ ధర్నా కర్నూలు : కల్లూరు వక్కెరవాగు ఎదురెదురుగా ఏర్పాటు చేసిన రెండు మద్యం దుకాణాలను అక్కడినుంచి తొలగించాలని మహిళలు పెద్ద ఎత్తున ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయాన్ని ముట్టడించారు. సీపీఎం, ఐద్వా ఆధ్వర్యంలో మహిళలు పెద్ద ఎత్తున ఎక్సైజ్ కార్యాలయాన్ని చేరుకుని ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందిగా ఉన్న మద్యం దుకాణాలను మరో ప్రాంతానికి తరలించాలని నినాదాలు చేస్తూ సుమారు రెండు గంటల పాటు ధర్నా చేపట్టారు. ఐద్వా నాయకురాలు ధనలక్ష్మి, సీపీఎం పాణ్యం డివిజన్ కార్యదర్శి రామకృష్ణ, కల్లూరు నాయకులు రమణమూర్తి, ఐద్వా పాణ్యం డివిజన్ నాయకురాలు ప్రమీలమ్మ, శ్యామలమ్మ తదితరులు ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ధనలక్ష్మి మాట్లాడుతూ.. రెండు మద్యం దుకాణాలు ఒకేచోట ఏర్పాటు చేయడం వల్ల మద్యం బాబులు తమ వాహనాలను రోడ్డుపైనే పార్కింగ్ చేస్తున్నారని, దీనివల్ల ప్రజలకు తీవ్ర అసౌకర్యంగా ఉందని డిప్యుటీ కమిషనర్ శ్రీరాములుకు ఫిర్యాదు చేశారు. మద్యం షాపులకు ఇరువైపులా ఉన్న వ్యాపార దుకాణాల వద్ద కూడా మందుబాబులు తిష్ట వేసి మద్యం సేవిస్తుండటంతో రాత్రివేళల్లో ఆ దారి గుండా వెళ్లడానికి మహిళలు ఇబ్బందులు పడుతున్నారని, తాగుబోతులు ఎలాంటి ఆకృత్యాలకు, అఘాయిత్యాలకు పాల్పడతారోనని భయపడుతున్నారని ఫిర్యాదు చేశారు. వక్కెరవాగు వద్ద నుంచి మూడు రోజుల్లో దుకాణాలను మరో ప్రాంతానికి తరలించేందుకు చర్యలు తీసుకుంటామని డిప్యుటీ కమిషనర్ హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళన విరమించారు. -
నేడు ఎక్సైజ్ కార్యాలయంలో మెగా హెల్త్ క్యాంపు
కర్నూలు: ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయ ఆవరణలో శనివారం మెగా హెల్త్‌క్యాంపు నిర్వహిస్తున్నారు. ఎక్సైజ్ సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలన్న ఇన్చార్జ్ డిప్యూటీ కమిషనర్ శ్రీరాములు కోరిక మేరకు మై క్యూర్ హాస్పిటల్ వారు ఉచితంగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం వరకు సిబ్బందికి ఉచితంగా వైద్య పరీక్షలు చేస్తారు. ప్రతి ఒక్కరు ఆరోగ్య పరీక్షలు నిర్వహించుకోవాల్సిందిగా ఎక్సైజ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షురాలు పద్మావతి సూచించారు. -
బెల్ట్‌షాపులు ఎత్తివేయాలని ధర్నా
నందిగామ రూరల్ : గ్రామంలో బెల్టు షాపులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఏటూరు గ్రామ మహిళలు నందిగామ ఎక్సైజ్ శాఖ కార్యాలయం ఎదుట శనివారం ధర్నా నిర్వహించారు. అధికారులు చర్యలు తీసుకునే వారుకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. గతంలో ఆందోళన ఫలితంగా మూడు నెలలపాటు బెల్టు షాపులు మూసివేశారని, అయితే, ఇటీవల మళ్లీ బెల్టు షాపులు తిరిగి ఏర్పాటు చేయడంపై మండపడ్డారు. విద్యార్థులు కూడా మద్యానికి బానిసలవుతున్నారని వాపోయారు. మహిళల ఆందోళనకు సీపీఎం నాయకుడు సయ్యద్ ఖాసిం, కటారపు గోపాల్ మద్దతు తెలిపారు. విషయం తెలుసుకున్న అధికారులు మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఎక్సైజ్ సీఐ సాయిస్వరూప్ ఆధ్వర్యంలో సిబ్బంది గ్రామానికి వెళ్లారు. వారు తిరిగి కార్యాలయానికి వచ్చే వరకు మహిళలు ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. గ్రామంలోని బెల్టు షాపులను పూర్తిగా మూసివేయించామని, ఇకపై గ్రామంలో బెల్టు షాపు నడవకుండా చూసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. డ్వాక్రా సంఘాల లీడర్లు శీలం నాగేంద్రం, కామా అరుణకుమారి, నేలపాటి మరియమ్మ, సుజాత, తేరేజమ్మ, దుర్గ, మరియమ్మ పాల్గొన్నారు.