బార్ ఆండ్ రెస్టారెంట్
దశలవారీ మద్యపాన నిషేధంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో మద్యం అమ్మకాలు తగ్గడంతో రెస్టారెంట్స్ అండ్ బార్లకు వరంగా మారింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బార్ల యజమానులు నిబంధనలు తుంగల్లో తొక్కి దోపిడీకి తెరతీశారు.
సాక్షి, విజయనగరం : నవరత్నాల హామీల్లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాలుగు నెలల పాలనలోనే దశలవారీ మద్య నిషేధానికి తెరతీశారు. జిల్లాలో విచ్చలవిడిగా ఉన్న బెల్టు దుకాణాలపై ఉక్కుపాదం మోపడంతో బెల్టు దుకాణాలు మూతపడ్డాయి. ప్రైవేటు మద్యం వ్యాపారుల చేతిలో ఉన్న మద్యం దుకాణాలను ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తుంది. నూతన మద్యం విధానంతో జిల్లాలో 210 మద్యం దుకాణాలను 20 శాతం తగ్గించి 168కి పరిమితం చేశారు. దీంతో పాటు గతంలో ఉదయం 10 గంటలకు తెరిచి రాత్రి 10 గంటల వరకు అమ్మకాలు సాగించి రెండు చేతులా సంపాదించేవారు. మద్యం అమ్మకాలు నియంత్రించడానికి ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మద్యం దుకాణాల నిర్వహణ మూడు గంటల సమయం తగ్గించారు. దీంతో రెస్టారెంట్ అండ్ బార్లుకు వరంగా మారింది. దీంతో నూతన మద్యం విధానం అమలుకాక ముందు రోజుకు ఒక్కో బార్లలో రూ.2 లక్షల వరకు విక్రయాలు జరిగితే ప్రస్తుతం రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు విక్రయాలు పెరగడం విశేషం.
మందుబాబులకు ధరల ‘కిక్కు’
నూతన మద్యం విధానంతో జిల్లాలో మద్యం దుకాణాలు తగ్గడమే కాకుండా సమయానికే మూతపడటంతో మందుబాబులకు మద్యం దొరకడం కష్టమవుతుంది. దీంతోపాటు గతం లో మద్యం దుకాణాల పక్కనే పర్మిట్ రూమ్‌లు ఉండటంతో మందుబాబులు అక్కడే మద్యం కొనుగోలు చేసి పర్మిట్ రూమ్‌ల్లో తాఫీగా తాగి వెళ్లేవారు. ప్రస్తుతం పర్మిట్ రూమ్‌లు తొలగించడంతో మందుబాబులకు తాగేందుకు స్థలం లేక బార్లను ఆశ్రయిస్తున్నారు. ఒకరికి మూడు బాటిళ్లు కంటే ఎక్కువ అమ్మకాలు చేయడంగాని, తీసుకువెళ్లడం చేయరాదని ప్రభుత్వం నిబంధనలు విధించింది. దీంతో జిల్లాలోని 28 బార్ అండ్ రెస్టారెంట్లు మందుబాబులకు అనుకూలంగా మారాయి. దీంతో బార్ల యజమానులు దోపిడీకి తెరలేపేశారు. ఉదయం 11 గంటలకు తెరుచుకుంటున్న బార్లు రాత్రి 1 గంట వరకు కొనసాగుతున్నాయి. రాత్రి 11 గంటలకే అమ్మకాలు బంద్ చేయాల్సిన బార్ల యజమానులు 12 వరకు అమ్మకాలు కొనసాగిస్తున్నారు. ఎంఆర్‌పీపై ప్రభుత్వం పెంచిన ధరను కలిపి విక్రయించాల్సిన మద్యాన్ని విడి విక్రయాలు, మద్యం కల్తీతో పాటు అదనంగా ధర పెంచి సొమ్ము చేసుకుంటున్నారు. ముఖ్యంగా సర్వీసు ట్యాక్స్ పేరిట బార్ల యజమానులు మందుబాబులకు షాకిస్తున్నారు. దీంతో బార్లకు వచ్చిన మందుబాబులకు ధరల బాదుడు చూసి కిక్కు దిగిపోతుంది.
నిబంధనలు బేఖాతరు
వాస్తవంగా బార్ అండ్ రెస్టారెంట్లలో మద్యం అమ్మకాలతో పాటు మందుబాబులకు తిండి లభ్యమవుతుంది. తిండి పదార్థాలు వండడానికి అన్ని సౌకర్యాలు బార్లలో ఉండాల్సిందే. జిల్లాలో 80 శాతానికి పైగా బార్లలో వంట చేయడానికి కావాల్సిన సౌకర్యాలు లేవు. అనేక బార్లలో బయట తిండి తెచ్చి విక్రయాలు సాగిస్తున్నారు.
పర్యవేక్షణేది?
నిబంధనలు అతిక్రమిస్తున్న బార్లపై గట్టి నిఘా, పర్యవేక్షించాల్సిన ఎక్సైజ్ అధికారులు బార్ల యజమానులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండటంతో పర్యవేక్షణ గాలికొదిలేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. 80 శాతం పైగా బార్లలో నిబంధనలు అమలుకాకున్నా అధికారులు పట్టించుకోవడం లేదని పలువులు విమర్శలు గుప్పిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment