ఎక్సైజ్ కార్యాలయం ముట్టడి
ఎక్సైజ్ కార్యాలయం ముట్టడి
Published Wed, Jul 12 2017 9:53 PM | Last Updated on Tue, Sep 5 2017 3:52 PM
మద్యం దుకాణాలు తొలగించాలంటూ ధర్నా
కర్నూలు : కల్లూరు వక్కెరవాగు ఎదురెదురుగా ఏర్పాటు చేసిన రెండు మద్యం దుకాణాలను అక్కడినుంచి తొలగించాలని మహిళలు పెద్ద ఎత్తున ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయాన్ని ముట్టడించారు. సీపీఎం, ఐద్వా ఆధ్వర్యంలో మహిళలు పెద్ద ఎత్తున ఎక్సైజ్ కార్యాలయాన్ని చేరుకుని ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందిగా ఉన్న మద్యం దుకాణాలను మరో ప్రాంతానికి తరలించాలని నినాదాలు చేస్తూ సుమారు రెండు గంటల పాటు ధర్నా చేపట్టారు. ఐద్వా నాయకురాలు ధనలక్ష్మి, సీపీఎం పాణ్యం డివిజన్ కార్యదర్శి రామకృష్ణ, కల్లూరు నాయకులు రమణమూర్తి, ఐద్వా పాణ్యం డివిజన్ నాయకురాలు ప్రమీలమ్మ, శ్యామలమ్మ తదితరులు ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించారు.
ఈ సందర్భంగా ధనలక్ష్మి మాట్లాడుతూ.. రెండు మద్యం దుకాణాలు ఒకేచోట ఏర్పాటు చేయడం వల్ల మద్యం బాబులు తమ వాహనాలను రోడ్డుపైనే పార్కింగ్ చేస్తున్నారని, దీనివల్ల ప్రజలకు తీవ్ర అసౌకర్యంగా ఉందని డిప్యుటీ కమిషనర్ శ్రీరాములుకు ఫిర్యాదు చేశారు. మద్యం షాపులకు ఇరువైపులా ఉన్న వ్యాపార దుకాణాల వద్ద కూడా మందుబాబులు తిష్ట వేసి మద్యం సేవిస్తుండటంతో రాత్రివేళల్లో ఆ దారి గుండా వెళ్లడానికి మహిళలు ఇబ్బందులు పడుతున్నారని, తాగుబోతులు ఎలాంటి ఆకృత్యాలకు, అఘాయిత్యాలకు పాల్పడతారోనని భయపడుతున్నారని ఫిర్యాదు చేశారు. వక్కెరవాగు వద్ద నుంచి మూడు రోజుల్లో దుకాణాలను మరో ప్రాంతానికి తరలించేందుకు చర్యలు తీసుకుంటామని డిప్యుటీ కమిషనర్ హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళన విరమించారు.
Advertisement