అద్దె బకాయిలు రూ.4 కోట్లపైనే..
అద్దె బకాయిలు రూ.4 కోట్లపైనే..
Published Sun, Jul 24 2016 11:27 PM | Last Updated on Tue, Oct 16 2018 6:35 PM
నీలగిరి మున్సిపాలిటీకి చెందిన దుకాణాల అద్దె బకాయిల కోట్లలో పేరుకుపోయినా పట్టించుకునే నాథుడే లేడు. కొంత మంది అధికారులు దుకాణాల నిర్వాహకులతో లాలూచీపడి ఆ విషయాన్నే మరుగున పడేశారనే ఆరోపణలు లేకపోలేదు. మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు నిధుల కొరత ఏర్పడుతున్నా సంబంధిత అధికారులు బకాయిల వసూళ్లకు చర్యలు తీసుకోకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది.
నల్లగొండ టూటౌన్ : పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో మున్సిపాలిటీకి చెందిన 238 దుకాణాలు ఉన్నాయి. వాటి లీజ్‌కు సంబంధించి రూ.3 కోట్లకు పైగా బకాయి ఉన్నట్లు గతంలోనే ఆడిట్ బృందం తేల్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మరో కోటి రూపాయలు బకాయి పెరిగినట్లు అధికారులే చెబుతున్నారు. మొత్తానికి రూ.4కోట్లకు పైగానే బకాయిలు రావాల్సి ఉన్నట్లు తెలుస్తోంది
లెక్క తేలేదెలా..?
మున్సిపాలిటీకి కోట్ల రూపాయలు బకాయిలు పేరుకుపోవడంతో అభివృద్ధి పనులకు నిధుల కొరత ఏర్పడుతుంది. అయినా సంబంధిత అధికారులు బాకియలపై దృష్టి సారించడం లేదు. లీజు దారులు నేరుగా మున్సిపల్ కార్యాలయంలో అద్దె డబ్బులు చెల్లించే ఏర్పాట్లు చేయయకపోవడమూ దీనికి అనుమానాలకు తావిస్తోంది. కొంత మంది వ్యాపారులు అద్దె కట్టినప్పటికీ వారు ఎంత చెల్లించింది కనుక్కోవడం మున్సిపాలిటీ అధికారులకు ఇబ్బందిగా మారింది. చలాన్ ద్వారా బ్యాంకుల్లో అద్దె చెల్లించాలని పదేళ్ల క్రితం అప్పటి మున్సిపల్ అధికారులు చెప్పారని వ్యాపారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా 2010 నుంచి వ్యాపారులు అద్దె చెల్లించడం చాలా వరకు మానేశారు. ప్రతి సంవత్సరం లీజు షాపుల అద్దె చెల్లింపులపై రెవెన్యూ విభాగం అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ బకాయిలు పేరుకుపోయాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మున్సిపాలిటీలో అకౌంట్, రెవెన్యూ విభాగాల మధ్య సమన్వయం లోపించినట్లు తెలుస్తోంది. మున్సిపాలిటీ ఆదాయం కోల్పోవడానికి సంబంధిత రెవెన్యూ విభాగం నిర్లక్ష్యం కూడా కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. మున్సిపల్ ఉ్నతాధికారులు జోక్యం చేసుకుంటే తప్ప బకాయిలు వసూలయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
వసూలు చేస్తాం
– సత్యనారాయణ, మున్సిపల్ ఇన్‌చార్జి కమిషనర్
మున్సిపాలిటీకి చెందిన లీజు షాపుల అద్దె వివరాలను పరిశీలించాల్సి ఉంది. దీనికి సంబంధించిన దస్త్రాలను తీసుకురావాలని రెవెన్యూ విభాగం ఉద్యోగులకు చెప్పాను. ప్రతి షాపు నుంచి అద్దె వసూలు చేస్తాం.
Advertisement