
మూడు ముక్కలు!
జిల్లాల పునర్విభజన నేపథ్యంలో వరంగల్ జిల్లా మూడు జిల్లాలుగా ఏర్పడనుంది. కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లోని పలు మండలాలను కలిపి... వరంగల్, ప్రొఫెసర్ జయశంకర్(భూపాలపల్లి), మానుకోట(మహబూబాబాద్) పేర్లతో కొత్త జిల్లాలు ఏర్పడనున్నాయి. మన జిల్లాలోని కొన్ని మండలాలు ఇతర ప్రాంతాల్లో కొత్తగా ఏర్పడే జిల్లాల్లో కలవనున్నాయి.
- పునర్విభజనతో చీలిపోతున్న అసెంబ్లీ నియోజకవర్గాలు
- మూడు జిల్లాల్లో జనగామ, పాలకుర్తి
- రెండు జిల్లాల్లో ములుగు, భూపాలపల్లి
- సమన్వయంపై ప్రజల్లో సందేహాలు
- ప్రభుత్వ ప్రతిపాదనల ప్రకారం జనగామ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఐదు మండలాలు మూడు జిల్లాల్లో ఉండనున్నాయి. జనగామ, బచ్చన్నపేట మండలాలు యాదాద్రి జిల్లాలో... చేర్యాల, మద్దూరు మండలాలు సిద్ధిపేట జిల్లాలో... నర్మెట మండలం వరంగల్ జిల్లాలో ఉంటుందని ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొందించింది. అయితే, జనగామ కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని ఇక్కడ ఉద్యమం సాగుతోంది.
- పాలకుర్తి నియోజకవర్గంలోని ఐదు మండలాల పరిస్థితి ఇలాగే ఉంది. పాలకుర్తి, రాయపర్తి మండలాలు వరంగల్ జిల్లాలో... తొర్రూరు, కొడకండ్ల మండలాలు మానుకోట జిల్లాలో... దేవరుప్పుల మండలం యాదాద్రి జిల్లాలో కలవనున్నాయి.
- స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం సైతం రెండు జిల్లాల్లో ఉండనుంది. ఈ నియోజకవర్గంలోని లింగాలఘణపురం మండలాన్ని యాదాద్రి జిల్లాలో కలిపేలా ప్రతిపాదనలు ఉన్నాయి. రఘునాథపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్, జఫర్‌గఢ్, ధర్మసాగర్ మండలాలు వరంగల్ జిల్లాలోనే కొనసాగనున్నాయి.
- భూపాలపల్లి కేంద్రంగా ఏర్పడే జిల్లాలో ఏ ఒక్క నియోజకవర్గం పూర్తి స్థాయిలో ఉండడం లేదు. భూపాలపల్లి నియోజకవర్గంలోని శాయంపేట మండలం వరంగల్ జిల్లాలోనే కొనసాగనుంది. మిగిలిన భూపాలపల్లి, చిట్యాల, గణపురం, రేగొండ, మొగుళ్లపల్లి మండలాలు భూపాలపల్లిలో ఉండనున్నాయి.
- ములుగు నియోజకవర్గంలో ఏడు మండలాలు ఉన్నాయి. కొత్తగూడ మండలం మానుకోట జిల్లాలో కలపనున్నారు. ములుగు, వెంకటాపురం, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట మండలాలు భూపాలపల్లి జిల్లాలో ఉంటాయి.
- కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాలు వరంగల్‌లో ఉండనున్నాయి. ఇదే జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఉంటే... కమలాపూర్, హుజూరాబాద్, జమ్మికుంట మండలాలు వరంగల్ జిల్లాలో కలిపేలా ప్రతిపాదనలు ఉన్నాయి. మంథని నియోజకవర్గంలో ఏడు మండలాలు ఉంటే... మహాముత్తారం, మల్హర్‌రావు, కాటారం, మహదేవపూర్ మండలాలు భూపాలపల్లి జిల్లాలో ఉండనున్నాయి.
- వరంగల్ జిల్లా : వరంగల్, హన్మకొండ, వర్ధన్నపేట, పర్వతగిరి, హసన్‌పర్తి, సంగెం, గీసుగొండ, ఆత్మకూరు, పరకాల, దుగ్గొండి, నర్సంపేట, చెన్నారావుపేట, నెక్కొండ, ఖానాపురం, నల్లబెల్లి, శాయంపేట, ధర్మసాగర్, స్టేషన్‌ఘన్‌పూర్, జఫర్‌గఢ్, పాలకుర్తి, రాయపర్తి, రఘునాథపల్లి, నర్మెట, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపురం, హుజూరాబాద్, జమ్మికుంట.
- ప్రొఫెసర్ జయశంకర్ జిల్లా : భూపాలపల్లి, గణపురం, చిట్యాల, మొగుళ్లపల్లి, రేగొండ, ములుగు, వెంకటాపురం, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట, మహాముత్తారం, మల్హర్‌రావు, కాటారం, మహదేవపూర్.
- మానుకోట జిల్లా : మహబూబాబాద్, కేసముద్రం, గూడూరు, నెల్లికుదురు, డోర్నకల్, నర్సింహులపేట, మరిపెడ, కురవి, తొర్రూరు, కొడకండ్ల, కొత్తగూడ, గార్ల, బయ్యారం, ఇల్లందు.
- యాదాద్రి జిల్లా : జనగామ, బచ్చన్నపేట, దేవరుప్పులు, లింగాలఘణపురం.
- సిద్దిపేట జిల్లా : చేర్యాల, మద్దూరు.
జిల్లాల వారీగా మండలాలు ఇలా...