సింగాటంలో దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తున్న అధికారులు
వ్యవసాయశాఖ డిప్యూటీ డైరెక్టర్ రాములు
గజ్వేల్ మండలంలో వర్షాలకు దెబ్బతిన్న పంటల పరిశీలన
గజ్వేల్: అధిక వర్షాలతో నష్టపోయిన పంటల వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తామని వ్యవసాయశాఖ డిప్యూటీ డైరెక్టర్ రాములు పేర్కొన్నారు. సోమవారం గజ్వేల్ మండలం సింగాటం, అహ్మదీపూర్, పిడిచెడ్, ప్రజ్ఞాపూర్ గ్రామాల్లో భారీ వర్షాల కారణంగా నీట మునిగిన పత్తి, మొక్కజొన్న, వరి, కంది పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెరిపిలేకుండా కురిసిన వర్షాలు ప్రధానంగా పత్తి, మొక్కజొన్నకు అపారనష్టం కలిగించాయని తెలిపారు.
ఇప్పటికైనా వర్షాలు తెరిపి ఇచ్చి ఎండలు వస్తే పత్తి పంట తిరిగి కోలుకునే అవకాశముందన్నారు. రైతులు వర్షపునీరు బయటకు వెళ్లేలా కాలువలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అంతేగాకుండా తెగుళ్ల బారిన పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై రైతులకు వివరించారు. పలు చేలల్లో మొక్కజొన్న వాలిపోవడం, అధిక తేమ కారణంగా మొలకలు రావడం గమనించిన డిప్యూటీ డైరెక్టర్ మొక్కజొన్నకు నష్టం వాటిల్లిందని స్పష్టం చేశారు. కంది, వరి పంటలకు పెద్దగా నష్టం కలగలేదని తెలిపారు. జిల్లాలోని పరిస్థితిపై సమగ్ర నివేదిక రూపొందించి ప్రభుత్వానికి నివేదిస్తామని వెల్లడించారు.
సంగారెడ్డి ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ అధిక వర్షాలు కురుస్తున్న ప్రస్తుత సమయంలో రైతులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ప్రధానంగా చేలల్లో వర్షపునీరు నిల్వ ఉండకుండా చూసుకుంటే నష్టాలను తగ్గించుకోవచ్చని చెప్పారు. తెగుళ్లు సంక్రమిస్తే స్థానిక వ్యవసాయ అధికారులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు పాటించాలన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ కమీషనరేట్ కార్యాలయ ఏడీఏ పుణ్యవతి, గజ్వేల్ ఏడీఏ శ్రావణ్‌కుమార్, గజ్వేల్ వ్యవసాయాధికారి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.