రాజీనామా..హైడ్రామా!
- నందికొట్కూరు జెడ్పీటీసీ సభ్యురాలి అలక
- ఇన్‌చార్జ్ బుజ్జగింపుతో నిర్ణయం వాయిదా
కర్నూలు(అర్బన్): జిల్లాలోని అధికార పార్టీకి చెందిన నందికొట్కూరు జెడ్పీటీసీ సభ్యురాలు చింతకుంట లక్ష్మి రాజీనామా వ్యవహారంలో హైడ్రామా నడిచింది. వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ సభ్యురాలుగా గెలుపొందిన ఈమె కొంత కాలం క్రితం టీడీపీలో చేరారు. టీడీపీలోకి చేరిన తనకు మండలంలో కనీస గౌరవం ఇవ్వడం లేదని, తాను పదవిలో ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అనే భావనతో రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. శనివారం ఆమె తన భర్త వెంకటరాముడుతో కలిసి జిల్లా పరిషత్ సీఈఓకు రాజీనామా అందించేందుకు వచ్చారు. ఏపీ పంచాయతీరాజ్ యాక్ట్ 1994 ప్రకారం జెడ్పీటీసీ సభ్యుల రాజీనామాలు స్వీకరించే అధికారం తనకు లేదని, జిల్లా కలెక్టర్‌కు రాజీనామా పత్రాన్ని అందించాలని సీఈఓ తిప్పి పంపారు. ఈ నేపథ్యంలోనే నందికొట్కూరు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ శివానందరెడ్డి జోక్యం చేసుకొని సమస్యలు ఏవైనా ఉంటే సానుకూలంగా పరిష్కరించుకుందాం, రాజీనామా నిర్ణయాన్ని విరమించుకోవాలని బుజ్జగించారు. దీంతో వారు రాజీనామా లేఖలను తీసుకొని వెనుదిరిగారు.