టీడీపీకి ఉమా మాధవరెడ్డి రాజీనామా | Uma Madhava Reddy Quits TDP | Sakshi
Sakshi News home page

టీడీపీకి ఉమా మాధవరెడ్డి రాజీనామా

Published Wed, Dec 13 2017 1:36 PM | Last Updated on Fri, Aug 10 2018 8:35 PM

 Uma Madhava Reddy Quits TDP - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సీనియర్‌ నాయకురాలు, మాజీ మంత్రి ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఉమామాధవ రెడ్డితో పాటు ఆమె కుమారుడు సందీప్‌ రెడ్డి బుధవారం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి.. ఈ మేరకు లేఖను టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు పంపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో గత్యంతరం లేకే పార్టీని వీడినట్టు తెలిపారు. తమ పరిస్థితి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నామన్నారు. పార్టీలో, ప్రభుత్వంలో పదవులిచ్చి ఎంతో గౌరవించారన్నారు. దశాబ్ధాలుగా టీడీపీతో తమ కుటుంబానికి అనుబందం ఉందని పేర్కొన్నారు.

కాగా ఉమా మాధవ్‌ రెడ్డి, ఆమె కుమారుడు సందీప్‌రెడ్డితో పాటు తమ అనుచరులతో కలిసి ఈ నెల 14 (గురువారం)న తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకోనున్నారు. గత కొన్నాళ్లుగా ఆమె టీఆర్‌ఎస్‌లో చేరుతారనే ప్రచారం జరిగింది. ఈ క్రమంలో మంగళవారం ఆమె సీఎం కేసీఆర్‌ను ప్రగతి భవన్‌లో కలిసి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే 2014 ఎన్నికల సమయంలోనే టీఆర్‌ఎస్‌ ఆహ్వానించినా ఉమ మాధవ రెడ్డి టీడీపీని వీడలేదు. ఆ ఎన్నికల్లో భువనగిరి నుంచి పోటీ చేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పైళ్ల శేఖర్‌రెడ్డి చేతిలో ఆమె ఓడిపోయారు. మరో ఏడాదిన్నరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తన తనయుడి రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అధికార పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు పలువురు విశ్లేషిస్తున్నారు. అయితే భువనగిరిలో టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఉన్నందున ఆమెకు, ఆమె కుమారుడికి ఏ హామీ ఇస్తారన్నది తేలాల్సి ఉంది.

ఉమ్మడి రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వంలో ఉమామాధవరెడ్డి మంత్రిగా పని చేశారు. ఆమె భర్త, మాజీ హోంశాఖ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డిని నక్సలైట్లు హత్యచేసిన తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచి భూగర్భ జలవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భువనగిరి నుంచి విజయం సాధించి మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి గా పనిచేశారు. మాధవరెడ్డి హత్య అనంతరం ఉమ్మడి నల్గొండ జిల్లా తెలుగుదేశం పార్టీ బాధ్యతలను ఆమె నిర్వర్తించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆమె భువనగిరి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు.

ఉమ్మడి నల్లగొండలో టీడీపీ ఖాళీ
ఉమా మాధవరెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరనుండటంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టీడీపీ ఖాళీ కానుంది. ఈ పరిణామం టీడీపీ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేయనుంది. దశాబ్ధ కాలం నుంచి ఎలిమినేటి కుటంబం టీడీపీలో ఉంది. పార్టీలో, ప్రభుత్వంలో వారు కీలక పదువులు నిర్వహించించారు. దీంతో ముఖ్యనేతలతో ఆ కుటుంబానికి సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ బాటలో మరికొంతమంది నేతలు గులాబీ కండువా కప్పుకోనున్నట్టు సమాచారం. ఉమ్మడి జిల్లాలో టీడీపీ నుంచి మోత్కుపల్లి, ఉమామాధవరెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్‌, పటేల్‌ రమేష్‌రెడ్డి, బీల్యానాయక్‌, పాల్వాయి రజినీ కుమారి, బండ్రు శోభారాణిలు బలమైన నేతలుగా ఉన్నారు. వారిలో సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న పటేల్‌ రమేష్‌రెడ్డి, నల్లగొండ జిల్లా  అధ్యక్షునిగా ఉన్న గిరిజన నేత బీల్యానాయక్‌ రేవంత్‌రెడ్డి వెంట కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement