uma madhava reddy
-
టీడీపీకి ఉమా మాధవరెడ్డి రాజీనామా
సాక్షి, హైదరాబాద్: సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఉమామాధవ రెడ్డితో పాటు ఆమె కుమారుడు సందీప్ రెడ్డి బుధవారం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి.. ఈ మేరకు లేఖను టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు పంపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో గత్యంతరం లేకే పార్టీని వీడినట్టు తెలిపారు. తమ పరిస్థితి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నామన్నారు. పార్టీలో, ప్రభుత్వంలో పదవులిచ్చి ఎంతో గౌరవించారన్నారు. దశాబ్ధాలుగా టీడీపీతో తమ కుటుంబానికి అనుబందం ఉందని పేర్కొన్నారు. కాగా ఉమా మాధవ్ రెడ్డి, ఆమె కుమారుడు సందీప్‌రెడ్డితో పాటు తమ అనుచరులతో కలిసి ఈ నెల 14 (గురువారం)న తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. గత కొన్నాళ్లుగా ఆమె టీఆర్ఎస్లో చేరుతారనే ప్రచారం జరిగింది. ఈ క్రమంలో మంగళవారం ఆమె సీఎం కేసీఆర్‌ను ప్రగతి భవన్లో కలిసి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే 2014 ఎన్నికల సమయంలోనే టీఆర్ఎస్ ఆహ్వానించినా ఉమ మాధవ రెడ్డి టీడీపీని వీడలేదు. ఆ ఎన్నికల్లో భువనగిరి నుంచి పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి పైళ్ల శేఖర్‌రెడ్డి చేతిలో ఆమె ఓడిపోయారు. మరో ఏడాదిన్నరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తన తనయుడి రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అధికార పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు పలువురు విశ్లేషిస్తున్నారు. అయితే భువనగిరిలో టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నందున ఆమెకు, ఆమె కుమారుడికి ఏ హామీ ఇస్తారన్నది తేలాల్సి ఉంది. ఉమ్మడి రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వంలో ఉమామాధవరెడ్డి మంత్రిగా పని చేశారు. ఆమె భర్త, మాజీ హోంశాఖ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డిని నక్సలైట్లు హత్యచేసిన తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచి భూగర్భ జలవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భువనగిరి నుంచి విజయం సాధించి మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి గా పనిచేశారు. మాధవరెడ్డి హత్య అనంతరం ఉమ్మడి నల్గొండ జిల్లా తెలుగుదేశం పార్టీ బాధ్యతలను ఆమె నిర్వర్తించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆమె భువనగిరి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. ఉమ్మడి నల్లగొండలో టీడీపీ ఖాళీ ఉమా మాధవరెడ్డి టీఆర్ఎస్లో చేరనుండటంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టీడీపీ ఖాళీ కానుంది. ఈ పరిణామం టీడీపీ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేయనుంది. దశాబ్ధ కాలం నుంచి ఎలిమినేటి కుటంబం టీడీపీలో ఉంది. పార్టీలో, ప్రభుత్వంలో వారు కీలక పదువులు నిర్వహించించారు. దీంతో ముఖ్యనేతలతో ఆ కుటుంబానికి సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ బాటలో మరికొంతమంది నేతలు గులాబీ కండువా కప్పుకోనున్నట్టు సమాచారం. ఉమ్మడి జిల్లాలో టీడీపీ నుంచి మోత్కుపల్లి, ఉమామాధవరెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, పటేల్ రమేష్‌రెడ్డి, బీల్యానాయక్, పాల్వాయి రజినీ కుమారి, బండ్రు శోభారాణిలు బలమైన నేతలుగా ఉన్నారు. వారిలో సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న పటేల్ రమేష్‌రెడ్డి, నల్లగొండ జిల్లా అధ్యక్షునిగా ఉన్న గిరిజన నేత బీల్యానాయక్ రేవంత్‌రెడ్డి వెంట కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. -
గులాబీ గూటికి ఉమా మాధవరెడ్డి
సాక్షి, హైదరాబాద్: టీటీడీపీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి గులాబీ గూటికి చేరనున్నారు. గత కొన్నాళ్లుగా ఆమె టీఆర్ఎస్లో చేరుతారని ప్రచారం జరుగుతోంది. మంగళవారం ఉమా మాధవరెడ్డి, ఆమె కుమారుడు, భువనగిరి జిల్లా టీటీడీపీ అధ్యక్షుడు సందీప్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ను ప్రగతి భవన్లో కలిశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ నాయకత్వంలో పనిచేయాలనే తమ మనోగతాన్ని వెల్లడించారు. ఈ నెల 14న మధ్యాహ్నం 12 గంటలకు తమ అనుచరులతో కలసి తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. గత నెలలోనే ఆమె సీఎం కేసీఆర్‌ను అసెంబ్లీలో కలిశారు. మావోయిస్టుల చేతుల్లో హత్యకు గురైన తన భర్త, మాజీ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డికి ప్రభుత్వం ఇంటి స్థలం కేటాయించినా, అప్పజెప్పలేదని వినతి పత్రం ఇచ్చేందుకే వచ్చినట్లు అప్పట్లో చెప్పారు. టీఆర్ఎస్లో చేరాలనే ఎలాంటి ఆహ్వానం లేదని, ఆహ్వానిస్తే ఆలోచిస్తానని పేర్కొన్నారు. ఇది జరిగి నెల గడవక ముందే టీఆర్ఎస్లో చేరడం ఖరారైంది. రాష్ట్రంలో టీడీపీ పనైపోయిందన్న అభిప్రాయంతో ఆమె ఉన్నట్లు తెలుస్తోంది. 2014 ఎన్నికల సమయంలోనే టీఆర్ఎస్ ఆహ్వానించినా టీడీపీ నుంచి రాలేదు. ఆ ఎన్నికల్లో భువనగిరి నుంచి పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి పైళ్ల శేఖర్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. మరో ఏడాదిన్నరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తన తనయుడి రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అధికార పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు పలువురు విశ్లేషిస్తున్నారు. అయితే భువనగిరిలో టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నందున ఆమెకు, ఆమె కుమారుడికి ఏ హామీ ఇస్తారన్నది తేలాల్సి ఉంది. కాగా, గురువారం తెలంగాణ భవన్లో భారీ సంఖ్యలో తమ అనుచరులతో కలసి పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. -
టీఆర్ఎస్లో చేరికకు రంగం సిద్ధమైందా?
సాక్షి, యాదాద్రి : ఉమ్మడి నల్లగొం డ జిల్లా టీడీపీలో విభేదాలు మరో సారి బట్టబయలయ్యాయి. టీడీపీ సీనియర్ నేతలు, పొలిట్‌బ్యూరో సభ్యులైన మోత్కుపల్లి నర్సింహులు, ఎలిమినేటి ఉమామాధవరెడ్డి వర్గాలు రెండుగా చీలిపోయాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న టీడీపీ వర్గ పోరులో చెరోవైపు నాయకత్వం వహిస్తున్నారు. తాజాగా సోమవారం నల్లగొండ కలెక్టరేట్ ఎదుట ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చేపట్టిన రైతు దీక్షకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రమణతోపాటు మోత్కుపల్లి నర్సింహులు మాత్రమే హాజరయ్యారు. మరో సీనియర్ నేత ఉమామాధవరెడ్డి రాలేదు. దీంతో ఇటీవల ఆమె టీఆర్ఎస్లో చేరుతారని వచ్చిన ఊహగానాలకు మరింత బలం చేకూర్చినట్లయింది. మొదటి నుంచి గ్రూపులే... టీడీపీలో ముందు నుంచి జిల్లాలో రెండు గ్రూపులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఎలిమినేటి మాధవరెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు ఇరుగుపొరుగు నియోజకవర్గాల్లో నేతలైనప్పటికీ ఎప్పుడు రెండు గ్రూపులుగా ఉమ్మడి జిల్లా రాజకీయాలను శాసించారు. మాధవరెడ్డి మరణానంతరం ఆయన సతీమణి ఎలిమినేటి ఉమామాధవరెడ్డి, అప్పటి నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డిలు ఒకవర్గంగా, మోత్కుపల్లి నర్సింహులు మరో వర్గంగా కొనసాగుతూ వచ్చారు. మారుతూ వచ్చిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో చివరికి ఉమ్మడి జిల్లా టీడీపీలో మోత్కుపల్లి, ఉమామాధవరెడ్డి ఇద్దరు సీనియర్ నేతలు మిగిలారు. ఈనేపథ్యంలో తాజా రాజకీయ పరిస్థితులు టీడీపీని కోలుకోలేని విధంగా దెబ్బతీశాయి. రేవంత్‌రెడ్డి పార్టీని వీడిన నేపథ్యంలో జిల్లా టీడీపీ చెల్లాచెదురైంది. అందరూ రేవంత్‌రెడ్డి వెనుక కాంగ్రెస్‌లోనే చేరుతారని అనుకున్నప్పటికీ కొందరు టీఆర్ఎస్లో చేరారు. ఉమ్మడి జిల్లాకు చెందిన బిల్యానాయక్, పటేల్ రమేశ్‌రెడ్డిలు కాంగ్రెస్‌లో చేరగా, కంచర్ల భూపాల్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరారు. వీరితోపాటు పలువురు ముఖ్యనేతలు కూడా టీడీపీకి గుడ్‌బై చెప్పారు. తాజాగా ఉమామాధవరెడ్డి టీఆర్ఎస్లో చేరుతారని ప్రచారం బలంగా సాగుతుంది. ఇటీవల సీఎం క్యాంప్ కార్యాలయంలో కేసీఆర్‌ను వ్యక్తిగత పనులపై కలిశారు. ఈ నేపథ్యంలోనే ఆమె టీఆర్ఎస్లో చేరుతారని ప్రచారం జోరుగా సాగుతుంది. వచ్చే నెల మొదటివారంలో టీఆర్ఎస్లో చేరడం దాదాపు ఖరారైందని తెలుస్తోంది. మరోవైపు సోమవారం ఆమె సీఎం క్యాంప్ కార్యాలయానికి మరోసారి వెళ్లినట్లు సమాచారం సాగుతోంది. ఈవిషయంపై ఎలిమినేటి ఉమామాధవరెడ్డిని ‘సాక్షి’ సంప్రదించగా తాను సీఎం క్యాంప్ కార్యాలయానికి ఈరోజు వెళ్లలేదని, కావాలని కొందరు మాపార్టీలో ఉన్నవారే నాపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. -
చేరమని అడగలేదు.. అడిగితే ఆలోచిస్తా
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్లో చేరాలని తనను ఎవరూ అడగలేదని, ఒకవేళ అడిగితే ఆలోచిస్తానని టీడీపీ నేత ఉమా మాధవరెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలో టీడీపీ పని అయిపోయిందన్న విషయం అందరికీ తెలిసిందేనని పేర్కొన్నారు. శుక్రవారం ఆమె అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ను కలిశారు. అనంతరం లాబీలో విలేకరులతో మాట్లాడారు. ‘‘నక్సల్స్ చేతిలో చనిపోయిన నేతలకు ఇచ్చే ఇంటి ప్లాట్ గురించి సీఎంను కలవడానికి వచ్చా. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు ప్లాట్ కేటాయించారు. ఇప్పటికీ చేతికి రాలేదు. సీఎంను ఒంటరిగా కలిస్తే పార్టీలో చేరుతున్నారని ప్రచారం జరుగుతుందనే.. సండ్ర వెంకటవీరయ్యతో కలసి వెళ్లా. అందరూ ఉండగానే సీఎంకు వినతిపత్రం అందజేశా’’అని చెప్పారు. కాంగ్రెస్‌లో చేరతారా అని విలేకరులు ప్రశ్నించగా.. ‘‘ఎలాంటి హామీ లేకుండా ఆ పార్టీలో చేరేందుకు నేనేమన్నా పిచ్చి దాన్నా? రేవంత్‌కు పదవులపై çహామీ ఇచ్చి ఉండవచ్చు. నాతో ఏమీ మాట్లాడకుండా ఎలా చేరతాను? హామీ ఇచ్చి ఉంటే రేవంత్‌తోనే ఢిల్లీ ఫ్లైట్ ఎక్కేదాన్ని కదా?’’అని అన్నారు. టీఆర్ఎస్లో చేరే అవకాశాలపై అడగ్గా.. ‘‘పార్టీలో చేరాలని గత ఎన్నికల ముందు ఆహ్వానించారు. అప్పుడు నేను చేరలేదు. ప్రస్తుతం నన్ను టీఆర్ఎస్లోకి రమ్మని ఎవరూ అడగలేదు. చేరమని అడిగితే అప్పుడు ఆలోచిస్తా. ఏ పార్టీలో చేరినా, నా కుమారుడి వెంట ఉంటా’’అని అన్నారు. -
‘అలా అయితే రేవంత్‌తోనే ఫ్లయిట్ ఎక్కేదాన్ని’
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో టీడీపీ పని అయిపోయిందని అందరికీ తెలుసునని మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత ఉమ మాధవరెడ్డి వ్యాఖ్యానించారు. ఆమె శుక్రవారం ఇక్కడ మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా ఉమ మాధవరెడ్డి...‘ కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డికి స్పష్టమైన హామీ లభించి ఉండవచ్చు. నాతో ఎవరు మాట్లాడకుండానే కాంగ్రెస్‌లో ఎలా చేరతా. హామీ ఇచ్చి ఉంటే రేవంత్‌తోనే ఫ్లైట్ ఎక్కేదాన్ని. టీఆర్ఎస్లో చేరాలని గతంలో ఆహ్వానించారు. మళ్లీ ఆలోచిస్తే పునరాలోచిస్తా.’ అని తెలిపారు. కాగా ఉమ మాధవరెడ్డి టీడీపీని వీడనున్నట్టు గత కొంతకాలంగా మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే రేవంత్ రెడ్డి టీడీపీకి గుడ్‌బై చెప్పి, కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలో మరోసారి ఆమె హస్తం చేయి అందుకుంటారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే ఆ వార్తలను ఉమ మాధవరెడ్డి ఖండించారు కూడా. అయితే అధికారంలో ఉన్న టీఆర్ఎస్ను కాదని కాంగ్రెస్‌లో చేరతారని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఆ పార్టీ శాసనసభా పక్ష నేత జానారెడ్డితో ఆమె చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో టీడీపీపై ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. -
ఆమెపై ఆరోపణలు నిరాధారం: మోత్కుపల్లి
నయీం ఎన్కౌంటర్ అనంతరం మాజీ మంత్రి ఉమామాధవరెడ్డిపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ఆరోపణలు కేవలం ప్రభుత్వ పరమైన లీకులేనని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. గురువారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. రాజకీయంగా దెబ్బతీయడానికే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. మహిళపై ఆరోపణలు చేయడం సరికాదని, రాజకీయ జీవితాలతో ఆడుకోవద్దని సూచించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. -
నయీంకు నేను ఫోన్ చేయలేదు
-
నయీంకు నేను ఫోన్ చేయలేదు: ఉమా మాధవరెడ్డి
► నా కాల్ లిస్ట్ బయటపెడితే విషయాలన్నీ తెలుస్తాయి ► తప్పుచేస్తే జైల్లో కూర్చోడానికి సిద్ధం ► ఈ వ్యవహారంపై సిట్ విచారణ మీద నమ్మకం లేదు ► జ్యుడీషియల్ విచారణ జరిపించాలి ► ప్రభుత్వ పెద్దలను కాపాడుకోడానికే మాపై బురద జల్లుతున్నారు ► అర్థం పర్థం లేని లీకులు ఎందుకిస్తున్నారో సీఎం చెప్పాలి ► నయీం మా ఇంట్లో ఆశ్రయం పొందాడో లేదో గన్‌మెన్‌ను అడగండి ► మాజీ మంత్రి ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి ► పేర్లు బయటకు వచ్చిన వాళ్లంతా టీఆర్ఎస్ మనుషులే: సందీప్ రెడ్డి హైదరాబాద్ నయీం వ్యవహారంతో తమకు ఏమాత్రం సంబంధం లేదని, అధికార పార్టీలో ఉన్నవాళ్లు, కొందరు పెద్దలను కాపాడుకోడానికే తమ మీద బురద జల్లుతున్నారని మాజీ మంత్రి ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి ఆరోపించారు. నయీం వ్యవహారంపై సిట్ విచారణ మీద తమకు నమ్మకం లేదని.. జ్యుడీషియల్ విచారణకు ఆదేశించాలని ఆమె డిమాండ్ చేశారు. నిజంగా తాను తప్పుచేసినట్లు తేలితే జైల్లో కూర్చోవడానికి కూడా సిద్ధమన్నారు. నయీం ఫోన్ నుంచి తనకు గానీ, తన ఫోన్ నుంచి నయీంకు గానీ ఎలాంటి కాల్స్ వెళ్లలేదని, కావాలంటే కాల్ రికార్డులు మొత్తాన్ని బయటపెట్టి ఆరోపణలు రుజువు చేయాలని ఆమె అన్నారు. ముఖ్యమంత్రికి తెలియకుండా ఈ లీకులు రావని, వీటిపై ముఖ్యమంత్రి.. ప్రభుత్వమే సమాధానం చెప్పాలని కోరారు. కేవలం తమకు సంబంధించిన వాళ్లను ఈ కేసు నుంచి బయట పడేసుకోడానికే తమను టార్గెట్ చేశారని ఆమె ఆరోపించారు. నయీం వ్యవహారంలో టీడీపీకి చెందిన ఒక మాజీమంత్రి హస్తం ఉందని, ఆ మంత్రి ఫోన్ నుంచి వందలాది కాల్స్ నయీంకు వెళ్లాయని కథనాలు వచ్చిన నేపథ్యంలో ఆమె తన కుమారుడు సందీప్‌రెడ్డితో కలిసి గురువారం నాడు మీడియాతో మాట్లాడారు. నక్సలైట్లు మాధవరెడ్డిని హతమార్చారు కాబట్టి వాళ్ల మీద పగ తీర్చుకోడానికి వాళ్ల కుటుంబం నయీంను చేరదీసినట్లు కొన్ని కథనాలు వచ్చాయి. మాధవరెడ్డి పేరు చెడగొట్టడానికి, ఒక సామాజికవర్గాన్ని టార్గెట్ చేయడానికే ప్రభుత్వం కక్షపూరితమైన చర్యలు చేపట్టిందని ఉమా మాధవరెడ్డి ఆరోపించారు. తమకు నేరపూరిత రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. తమది సౌమ్యమైన కుటుంబమని, ఇలాంటివాటిని ఎంటర్టైన్ చేయమని అన్నారు. మాధవరెడ్డి ఉన్నప్పటి నుంచి ఇదే నెంబరు వాడుతున్నానని, దీని కాల్ డేటాను ప్రభుత్వం బయటపెట్టి దాన్ని పరిశీలించుకోవాలి తప్ప లేనిపోని లీకులు ఇచ్చి తమ పేరు చెడగొట్టడం సరికాదని ఆమె చెప్పారు. తాను ఎలా రాజకీయాలు చేశానో తెలంగాణలోనే కాదని... ఆంధ్రప్రదేశ్‌లో కూడా తెలుసని అన్నారు. నక్సలైట్ల వల్ల తమ కుటుంబం చాలా బాధపడిందని, లీకులు చేసినవాళ్లు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. నయీం వ్యవహారంతో సంబంధం ఉన్న కొంతమంది పెద్దలను తప్పించడం కోసం సిట్ వేసి, వేరేవాళ్లను టార్గెట్ చేయడం సరికాదని ఉమా మాధవరెడ్డి అన్నారు. ఆ వ్యక్తి తనకు ఫోన్ చేయలేదు, తానూ అతడికి ఫోన్ చయలేదని స్పష్టం చేశారు. అయినా పత్రికలలో ఒక మాజీమంత్రి అంటూ పరోక్షంగా తనను ప్రస్తావించారని, జాతీయ మీడియాలో అయితే ఏకంగా ఉమా మాధవరెడ్డి అనే పేరు కూడా వచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాము మాఫియాను ప్రోత్సహిస్తున్నామా, అప్పులిచ్చి గుంజుకుంటున్నామా, రియల్ఎస్టేట్ వ్యాపారం ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. ప్రభుత్వం తమ కుటుంబానికి మచ్చ తెచ్చేలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సిట్ ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తుంది కాబట్టి దానివల్ల న్యాయం జరుగుతుందన్న నమ్మకం తమకు లేదని, అందుకే జ్యుడీషియల్ విచారణ వేయాలని డిమాండ్ చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా సెక్యూరిటీ ఉందని, నయీం తమ ఇంట్లో ఆశ్రయం పొందాడా, వైద్యసేవలు పొందాడా అన్న విషయం అప్పటి గన్ మన్లను అడిగితే సరిపోతుందని చెప్పారు. మాధవరెడ్డి హోం మంత్రిగా ఉండటంతో.. నక్సలైట్లను లొంగిపోవాలని, జనజీవన స్రవంతిలో కలవాలని కోరిన విషయం వాస్తవమేనని.. అయినా, అలా లొంగిపోయిన వాళ్లతో లింకులు పెట్టుకోవాల్సిన అవసరం ఆయనకు, తమకు ఏముందని ప్రశ్నించారు. ప్రస్తుత ఎమ్మెల్యేలను చంపించాలని తాను టార్గెట్ చేసినట్లు కూడా కొన్ని కథనాలు వచ్చాయని, అలా చంపించి రాజకీయాలు చేసేంత నీచ ప్రవృత్తి ఉందా అని అడిగారు. ఎన్నికల్లో ప్రజలు తమకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారని.. దాంతో ఐదేళ్ల తర్వాత మళ్లీ జనంలోకి వెళ్లి చూసుకుందామని ఊరుకున్నామని.. అలాంటప్పుడు తమమీద బురద జల్లడం ఎందుకని అడిఆరు. ఇందులో ప్రభుత్వ పాత్ర, పోలీసు పెద్దల పాత్ర కూడా ఉందని ఆరోపించారు. నయీం విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ తర్వాత వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం చూసుకోవాలని, దాంతో తమకేం సంబంధమని ప్రశ్నించారు. భువనగిరిలో ఉన్నవాళ్లలో చాలామంది నయీం అనుచరులు ఉంటారని... తమ దగ్గరకు జనం వచ్చినప్పుడు వాళ్లలో ఎవరు నయీం మనుషులో, ఎవరు కాదో చూసుకుని పనులు చేయడం ఎలా కుదురుతుందని అడిగారు. వాళ్లంతా ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్లే నయీమ్ కేసులో బయటికొస్తున్న పేర్లన్నీ ప్రస్తుతం టీఆర్ఎస్లో ఉన్నవాళ్లవేనని మాధవరెడ్డి కుమారుడు సందీప్‌రెడ్డి అన్నారు. ఒకప్పుడు టీడీపీ, కాంగ్రెస్ పార్టీలలో ఉన్నవాళ్లు ఈమధ్య మంత్రి జగదీశ్వర్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారని గుర్తుచేశారు. అసలు టీడీపీ అధికారంలో ఉన్న 2004 వరకు భూదందాలు, సెటిల్మెంట్లు ఎక్కడా లేవని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే అవన్నీ మొదలయ్యాయని ఆయన ఆరోపించారు. నయీం రాశాడని చెబుతున్న డైరీ బయటపెడితే మొత్తం విషయాలన్నీ బయటకు వస్తాయని అన్నారు. టీడీపీకి గానీ, తమ కుటుంబానికి గానీ దీంతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తమ కుటుంబం ఇప్పటికే ఇబ్బందుల్లో ఉందని, ఇంకా ఇబ్బంది పెట్టడం సరికాదని అన్నారు. నయీం నక్సలైటుగా ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన విషయాలన్నింటిపైనా జ్యుడీషియల్ విచారణ జరపాలని తెలిపారు. పాశం శ్రీనుకు ఒకప్పుడు టీడీపీ బీ-ఫారం ఇచ్చాము గానీ అతడు ఓడిపోయాడని.. అది పదేళ్ల క్రితం నాటి మాట అని ఆయన అన్నారు. ఇప్పుడు అతడితో తమకు సంబంధం లేదని తెలిపారు. -
కాంగ్రెస్ గూటికి ఉమామాధవరెడ్డి?
సాక్షి, హైదరాబాద్ : మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత ఉమా మాధవరెడ్డి కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖరారైంది. టీడీపీ విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు.. ఆమె కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత కె.జానారెడ్డితో మంతనాలు జరిపారు. గతంలో భువనగిరి నుంచి ప్రాతినిధ్యం వహించిన ఆమె 2014 ఎన్నికల్లో ఓడిపోయారు. ఈ నియోజకవర్గంలో సీనియర్ నేత అవసరం ఉండటం.. మరోవైపు తెలంగాణలో టీడీపీకి భవిష్యత్తు ఉండదని భావించిన ఆమె పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ అధిష్టానం నుంచి గ్రీన్‌సిగ్నల్ రాగానే ఆమె చేరికకు ముహూర్తం ఖరారు అవుతుందంటున్నారు. -
మాజీ మంత్రి కాన్వాయి ఢీ కొని ... ఇద్దరికి గాయాలు
నల్గొండ : నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఐటీ పాముల జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మాజీ మంత్రి, టీడీపీ నేత ఉమామాధవరెడ్డి ప్రయాణిస్తున్న కాన్వాయి... ఎదురుగా వస్తున్న కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఉమామాధవరెడ్డి కాన్వాయి సిబ్బంది వెంటనే స్పందించి... క్షతగాత్రులను నల్గొండలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
'చంద్రబాబు సీఎం కావడంలో ఆయనదే కీలకపాత్ర'
నల్లగొండ రూరల్: తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు వచ్చిన సమయంలో చంద్రబాబునాయుడుకు అండగా నిలిచి ఆయన ముఖ్యమంత్రి కావడంలో దివంగత నేత ఎలిమినేటి మాధవరెడ్డి కీలకపాత్ర పోషించారని మాధవరెడ్డి సతీమణి, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు ఉమా మాధవరెడ్డి అన్నారు. నల్లగొండలో నిర్వహించిన జిల్లా టీడీపీ అధ్యక్ష ఎన్నిక సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. తమ కుటుంబం మొదటి నుంచీ చంద్రబాబుకు అండగా ఉందన్నారు. మాధవరెడ్డి సహకారంతోనే చంద్రబాబు సీఎం అయ్యారని ఆమె తెలిపారు. తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా తమ కుటుంబం కార్యకర్తల్లో ధైర్యం నింపేందుకు పని చేసిందని చెప్పారు. -
మనం గెలవలేం...కానీ టీఆర్ఎస్ ఓడిపోవాలి
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికపై టీడీపీ ముఖ్య నేతల చర్చ సమావేశంలో కుదరని ఏకాభిప్రాయం - నిర్ణయం వాయిదా అధికార పార్టీని విమర్శించడమే ధ్యేయంగా టీడీపీ జిల్లా జనరల్‌బాడీ సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ‘స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎలాగూ మనం గెలిచే పరిస్థితి లేదు. కానీ టీఆర్ఎస్ మాత్రం ఓడిపోవాలి. ఇందుకు మనం ఏం చేయాలో ఆలోచించాలి....’ ఇదీ జిల్లా తెలుగుదేశం పార్టీ ముఖ్యుల సమావేశంలో జరిగిన చర్చ. ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయడంపై చేతులెత్తేసిన ఆ పార్టీ నేతలు ఇప్పుడు అధికార పక్షాన్ని ఎలా ఓడించాలన్న దానిపై దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. అయితే, గురువారం జరిగిన పార్టీ ముఖ్యుల సమావేశంలో దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో ప్రస్తుతానికి తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. గురువారం తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా జనరల్‌బాడీ సమావేశం జరిగింది. సమావేశానికి పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు ఉమా మాధవరెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంగాల స్వామిగౌడ్‌తోపాటు జిల్లాకు చెందిన ముఖ్య నేతలు హాజరయ్యారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కె.బిల్యానాయక్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం అనంతరం ముఖ్య నాయకులు మరోసారి సమావేశమై ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించారు. పట్టభద్రుల స్థానానికి సంబంధించి రాష్ట్రస్థాయిలో బీజేపీతో వెళ్లాలని నిర్ణయం తీసుకున్నందున ఏప్రిల్‌లో జరగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికపై ఏం చేయాలని చర్చించారు. ఈ చర్చలో కొందరు నేతలు మాట్లాడుతూ మనం గెలవలేం కానీ... టీఆర్ఎస్ మాత్రం ఓడిపోవాలి.. ఇందుకు ఏం చేయాలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ప్రతిపాదించారు. అయితే, ఈ ప్రతిపాదనను కొందరు నేతలు వ్యతిరేకించారు. టీఆర్ఎస్ ఓడిపోవాలంటే కాంగ్రెస్ గెలవాల్సి ఉంటుంది. మనం కాంగ్రెస్‌కు ఎలా మద్దతిస్తాం. టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా ఎదగాల్సిన మనం కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఏం సాధించినట్టు అని ప్రశ్నించారు. దీంతో ఇప్పటి కిప్పుడే ఈ చర్చ అవసరం లేదని, మరోసారి సమావేశమై దీనిపై నిర్ణయం తీసుకుందామని వాయిదా వేశారు. అన్నీ పరనిందలే.. తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ కోసం ఏర్పాటు చేసిన జిల్లా జనరల్ బాడీ సమావేశం ఆద్యంతం అధికార టీఆర్ఎస్ను టార్గెట్ చేసుకునే నడిచింది. సమావేశంలో మాట్లాడిన ప్రతి నాయకుడు టీఆర్ఎస్ను, కేసీఆర్ పాలనను విమర్శిస్తూ మాట్లాడారే కానీ... పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయడంపై దృష్టి పెట్టలేదు. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు మోత్కుపల్లి, ఉమామాధవరెడ్డితో పాటు వంగాల స్వామిగౌడ్, రాష్ట్ర అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి, పార్టీ నేతలు చిలువేరు కాశీనాథ్, బండ్రు శోభారాణి... ఇలా దాదాపు అందరూ కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకునే మాట్లాడారు. అధికార పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే విషయాన్ని ఒకరిద్దరు నేతలే చెప్పినా... విమర్శలు మాత్రం అందరు నేతలూ చేశారు. కేసీఆర్‌ను పిచ్చితుగ్లక్అని, కౌన్కిస్కా అని ఎద్దేవా చేసిన టీడీపీ నేతలు టీడీపీ గంగానది అని, టీఆర్ఎస్ బురదగుంటలాంటిదని అన్నారు. పాలించే సత్తా లేక, పార్టీ కేడర్ లేక టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తమ పార్టీకి చెందిన నేతలను టీఆర్ఎస్లో చేర్చుకుని పదవులిస్తున్నారని అన్నారు. ఇక, చివర్లో మాట్లాడిన మోత్కుపల్లి, ఉమామాధవరెడ్డిలు మాత్రం కొంతమేర పార్టీ శ్రేణులకు సూచనలిచ్చారు. పార్టీ కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉందని, పార్టీని నమ్ముకుని ఉన్న వారంతా, పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యతను తీసుకోవాలని, ఇందుకోసం అందరం అన్నదమ్ముల్లా కలిసి పనిచేద్దామని మోత్కుపల్లి అంటే.... నేనే నాయకుడినని, అందరూ నా మాటే వినాలని అనుకోకుండా, అహం తీసేసుకుని పనిచేస్తే పార్టీ బాగుపడుతుందని ఉమామాధవరెడ్డి వ్యాఖ్యానించారు. మిగిలిన నేతల్లో కొందరు మాట్లాడుతూ పార్టీ అభివద్ధి కోసం పనిచేయాల్సిన బాధ్యత మోత్కుపల్లి, ఉమామాధవరెడ్డిలపై ఉందన్నారు. అయితే, ఆ ఇద్దరు మాత్రం కనీసం ఒకరినొకరు పలకరించుకున్నట్టు కూడా కనిపించకపోవడం గమనార్హం. జిల్లాలో ఇప్పటికే పార్టీ నేతలంతా మోత్కుపల్లికి వ్యతిరేకంగా ఉమామాధవరెడ్డి పక్షాన చేరుతున్న తరుణంలో జరిగిన పార్టీ సమావేశంలో ఐక్యతే ప్రధాన ఎజెండాగా చర్చ జరిగితే బాగుండేదని, పైకి మాటలు చెప్పిన నేతలు కనీసం మాట్లాడుకోకపోవడం బట్టి చూస్తే జిల్లా టీడీపీ నేతల మధ్య సఖ్యత వట్టిమాటేనని సమావేశానికి వచ్చిన వారే వ్యాఖ్యానించడం గమనార్హం. మార్చిలో చంద్రబాబు జిల్లా పర్యటన తెలంగాణలో చంద్రబాబు పర్యటనలో భాగంగా మార్చి నెలలో ఆయనను జిల్లాకు తీసుకురావాలని పార్టీ నేతలు ప్రాథమికంగా నిర్ణయించారు. ఈనెల 12న వరంగల్, 19న కరీంనగర్ జిల్లాల్లో పర్యటన తర్వాత జిల్లాకు చంద్రబాబును తీసుకువచ్చే దానిపై పార్టీ నేతలు చర్చించినా, కొందరు నేతలు మార్చిలోనే చంద్రబాబు టూర్ పెట్టుకుందామని చెప్పడంతో దాన్నే ఖరారు చేద్దామని పార్టీ నేతలు నిర్ణయించారు. జనరల్‌బాడీ సమావేశంలో పార్టీ జిల్లా నేతలు కంచర్ల భూపాల్‌రెడ్డి, చిలువేరు కాశీనాథ్, బండ్రు శోభారాణి, బంటు వెంకటేశ్వర్లు, బొల్లం మల్లయ్యయాదవ్, పటేల్ రమేశ్‌రెడ్డి, కడారి అంజయ్య యాదవ్, బడుగుల లింగయ్య యాదవ్, నన్నూరి నర్సిరెడ్డి, నెల్లూరి దుర్గాప్రసాద్, జక్కిలి అయిలయ్య యాదవ్, మాదగోని శ్రీనివాస్‌గౌడ్, కాజాగౌడ్, యూసుఫ్‌అలీ, సాదినేని శ్రీనివాసరావు, చావా కిరణ్మయి తది తరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు పర్యటనకు ఎమ్మెల్యే ఉమ దూరం
భువనగిరి, న్యూస్‌లైన్, టీడీపీ అధినేత చంద్రబాబు బుధవారం వరంగల్ వెళ్తూ భువనగిరి బైపాస్ టీచర్స్ కాలనీ వద్ద మధ్యాహ్నం 3.45 గంటలకు ఆగారు. అయితే భువనగిరి ఎమ్మెల్యే ఉమామాధవరెడ్డి ఇక్కడకు రాలే దు. వలిగొండ మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఆమె చంద్రబాబు వస్తున్న విషయం తెలిసి కూడా ఆయనకు స్వాగతం చెప్పడానికి రాలేదు. ఆమెకు తాను వస్తున్న సమాచారం చంద్రబాబు ఇవ్వలేదా లేకుంటే ఉద్దేశపూర్వకంగా రాలేదా అన్నది కార్యకర్తల్లో చర్చ నీయాంశంగా మారింది. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే బాబు పర్యటనకు దూ రంగా ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. కార్యకర్తలు కూడా పెద్దగా హాజరుకాలేదు. కార్యకర్తల్లో నిరాశ చంద్రబాబు కోసం ఎదురు చూసిన ఆపార్టీ కార్యకర్తలకు భువనగిరిలో నిరాశే మిగిలింది. ఆయన స్వాగతం పలకడానికి నాయకులు కార్యకర్తలు ఏర్పాట్లు చేసుకున్నారు. మధ్యాహ్నం 3.45 గంటలకు చంద్రబాబు కాన్వాయ్ కార్యకర్తల వద్దక చేరుకోగానే వారు నినాదాలు చేస్తూ ఆయన కారువద్దకు వెళ్లారు. పూలమాలలు వేసి నినాదాలు చేశారు. తమను ఉద్దేశించి మాట్లాడుతాడని ఊహించిన కార్యకర్తలు ఆయన మాట్లాడకుండా వెళ్లడంతో నిరాశచెందారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఎదురు చూసిన కార్యకర్తలకు చంద్రబాబు రెండు నిముషాలు కూడా నిలబడి మాట్లాడకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. దండలు వేయడానికి పోటీపడిన నాయకులు చంద్రబాబు నాయుడుకు దండలు వేయడానికి దేశం నాయకులు, కార్యకర్తలు పోటీపడ్డారు. నినాదాలు చేస్తు వారు దండలు వేశారు. అందరి వద్ద దండలు తీసుకుని కారుపై చంద్రబాబు వేసుకోగా ఆయన వ్యక్తి గత సిబ్బంది వాటిని రోడ్డు పక్కన పడవేసి వేళ్లారు. కార్యక్రమంలో ఎడ్ల సత్తిరెడ్డి, ఎక్బాల్చౌదరి, కృష్ణాచారి, వీరేశం, నాజర్, చంద్రశేఖర్, బచ్చు శ్రీను, మాటూరి శ్రీను, బాలయ్య, పద్మ, రామలక్ష్మయ్య, రజీయా, దొప్పవెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
మోత్కుపల్లికి టిక్కెట్ దక్కేనా?
-
మోత్కుపల్లికి టిక్కెట్ దక్కేనా?
హైదరాబాద్ : టీడీపీలో నేతల మధ్య రాజ్యసభ ఎన్నికల పోరు కొనసాగుతోంది. ఆశావహులు తమవంతు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. పార్టీ అధినేతపై ఒత్తిడి పెంచుతున్నారు. రాష్ట్రం నుంచి టిడిపికి దక్కనున్న రెండు సీట్లలో ఒక సీటును తెలంగాణకు ఇవ్వాలన్న డిమాండ్ ప్రధానంగా వినిపిస్తుండగా ఆ సీటును ఆశిస్తున్న తెలంగాణ టీడీపీ నేతల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. టిడిఎల్పీ ఉప నేత, మాజీ మంత్రి, జిల్లాకు చెందిన తుంగతుర్తి ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు తెలంగాణ నుండి సీనియర్ నేతగా తనకు ఈ దఫా రాజ్యసభకు ఎంపిక చేయాలని ఇప్పటికే పార్టీ చంద్రబాబునాయుడును గట్టిగా కోరడం జరిగింది. అయితే దీనిపై బాబునుంచి సరైన హామీ రాకపోవటంతో మోత్కుపల్లికి రాజ్యసభ టిక్కెట్ దక్కడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దాంతో బాబు వైఖరిపై అసంతృప్తిగా ఉన్న ఆయన రెండు రోజుల నుంచి అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టారు. కాగా తాజాగా జిల్లాకు చెందిన పోలిట్ బ్యూరో సభ్యురాలు, మాజీ మంత్రి, భువనగిరి ఎమ్మెల్యే ఉమా మాధవరెడ్డి సైతం రాజ్యసభ సీటు కోరుతు ఇటీవలే చంద్రబాబు ఇంటికి వెళ్లి మరి అభ్యర్థించారు. పార్టీ ఆవిర్భావం నుండి నేటి వరకు అన్ని ఎన్నికల్లోనూ భువనగిరి అసెంబ్లీ సీటు నుండి దివంగత మాధవరెడ్డి, తదుపరి తాను పార్టీని గెలిపించి ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించామని తమ కుటుంబం పార్టీకి చేసిన సేవలు, త్యాగంను గుర్తించి రాజ్యసభకు తనకు అవకాశం కల్పించాలని ఉమా విన్నవించుకోవడం విశేషం. పార్టీలో మహిళలకు తగిన గౌరవం కల్పించే దిశగా సైతం సీనియర్ నేతగా తనకు రాజ్యసభకు అవకాశం కల్పించాలని ఉమామాధవరెడ్డి అభ్యర్ధించారు. ఇక జిల్లా టిడిపిలో మోత్కుపల్లి నర్సింహులు, ఎలిమినేటి ఉమామాధవరెడ్డికి మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు రాజ్యసభ సీటు పంచాయతీతో మరోసారి బహిర్గతమైంది. మధ్యలో టిడిపిని వదిలి కాంగ్రెస్‌లోకి వెళ్లి తిరిగి సొంతగూటికి చేరిన మోత్కుపల్లి కంటే టిడిపి ఆవిర్భావం నుండి పార్టీ కోసం పనిచేసి ప్రాణాలు కోల్పోయిన భర్త మాధవరెడ్డితో పాటు తాను చేసిన సేవలే మిన్నయని తనకే రాజ్యసభ సీటు ఇవ్వాలని ఉమా కోరుతు పార్టీలో మోత్కుపల్లి ఆధిపత్యానికి మరోసారి ఆమె సవాల్ విసిరారు. ఉమా, మోత్కుపల్లిలతో పాటు తెలంగాణ ప్రాంతం నుండి రాజ్యసభ సీటును ఆశిస్తున్న వారిలో గరికపాటి రాంమోహన్‌రావు కూడా ఉన్నారు. మరి తెలంగాణ నుంచి వీరిలో ఎవరికి రాజ్యసభ టిక్కెట్ వరిస్తుందో వేచి చూడాలి.