
నయీంకు నేను ఫోన్ చేయలేదు: ఉమా మాధవరెడ్డి
► నా కాల్ లిస్ట్ బయటపెడితే విషయాలన్నీ తెలుస్తాయి
► తప్పుచేస్తే జైల్లో కూర్చోడానికి సిద్ధం
► ఈ వ్యవహారంపై సిట్ విచారణ మీద నమ్మకం లేదు
► జ్యుడీషియల్ విచారణ జరిపించాలి
► ప్రభుత్వ పెద్దలను కాపాడుకోడానికే మాపై బురద జల్లుతున్నారు
► అర్థం పర్థం లేని లీకులు ఎందుకిస్తున్నారో సీఎం చెప్పాలి
► నయీం మా ఇంట్లో ఆశ్రయం పొందాడో లేదో గన్‌మెన్‌ను అడగండి
► మాజీ మంత్రి ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి
► పేర్లు బయటకు వచ్చిన వాళ్లంతా టీఆర్ఎస్ మనుషులే: సందీప్ రెడ్డి
హైదరాబాద్
నయీం వ్యవహారంతో తమకు ఏమాత్రం సంబంధం లేదని, అధికార పార్టీలో ఉన్నవాళ్లు, కొందరు పెద్దలను కాపాడుకోడానికే తమ మీద బురద జల్లుతున్నారని మాజీ మంత్రి ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి ఆరోపించారు. నయీం వ్యవహారంపై సిట్ విచారణ మీద తమకు నమ్మకం లేదని.. జ్యుడీషియల్ విచారణకు ఆదేశించాలని ఆమె డిమాండ్ చేశారు. నిజంగా తాను తప్పుచేసినట్లు తేలితే జైల్లో కూర్చోవడానికి కూడా సిద్ధమన్నారు. నయీం ఫోన్ నుంచి తనకు గానీ, తన ఫోన్ నుంచి నయీంకు గానీ ఎలాంటి కాల్స్ వెళ్లలేదని, కావాలంటే కాల్ రికార్డులు మొత్తాన్ని బయటపెట్టి ఆరోపణలు రుజువు చేయాలని ఆమె అన్నారు. ముఖ్యమంత్రికి తెలియకుండా ఈ లీకులు రావని, వీటిపై ముఖ్యమంత్రి.. ప్రభుత్వమే సమాధానం చెప్పాలని కోరారు. కేవలం తమకు సంబంధించిన వాళ్లను ఈ కేసు నుంచి బయట పడేసుకోడానికే తమను టార్గెట్ చేశారని ఆమె ఆరోపించారు. నయీం వ్యవహారంలో టీడీపీకి చెందిన ఒక మాజీమంత్రి హస్తం ఉందని, ఆ మంత్రి ఫోన్ నుంచి వందలాది కాల్స్ నయీంకు వెళ్లాయని కథనాలు వచ్చిన నేపథ్యంలో ఆమె తన కుమారుడు సందీప్‌రెడ్డితో కలిసి గురువారం నాడు మీడియాతో మాట్లాడారు. నక్సలైట్లు మాధవరెడ్డిని హతమార్చారు కాబట్టి వాళ్ల మీద పగ తీర్చుకోడానికి వాళ్ల కుటుంబం నయీంను చేరదీసినట్లు కొన్ని కథనాలు వచ్చాయి.
మాధవరెడ్డి పేరు చెడగొట్టడానికి, ఒక సామాజికవర్గాన్ని టార్గెట్ చేయడానికే ప్రభుత్వం కక్షపూరితమైన చర్యలు చేపట్టిందని ఉమా మాధవరెడ్డి ఆరోపించారు. తమకు నేరపూరిత రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. తమది సౌమ్యమైన కుటుంబమని, ఇలాంటివాటిని ఎంటర్‌టైన్ చేయమని అన్నారు. మాధవరెడ్డి ఉన్నప్పటి నుంచి ఇదే నెంబరు వాడుతున్నానని, దీని కాల్ డేటాను ప్రభుత్వం బయటపెట్టి దాన్ని పరిశీలించుకోవాలి తప్ప లేనిపోని లీకులు ఇచ్చి తమ పేరు చెడగొట్టడం సరికాదని ఆమె చెప్పారు. తాను ఎలా రాజకీయాలు చేశానో తెలంగాణలోనే కాదని... ఆంధ్రప్రదేశ్‌లో కూడా తెలుసని అన్నారు. నక్సలైట్ల వల్ల తమ కుటుంబం చాలా బాధపడిందని, లీకులు చేసినవాళ్లు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు.
నయీం వ్యవహారంతో సంబంధం ఉన్న కొంతమంది పెద్దలను తప్పించడం కోసం సిట్ వేసి, వేరేవాళ్లను టార్గెట్ చేయడం సరికాదని ఉమా మాధవరెడ్డి అన్నారు. ఆ వ్యక్తి తనకు ఫోన్ చేయలేదు, తానూ అతడికి ఫోన్ చయలేదని స్పష్టం చేశారు. అయినా పత్రికలలో ఒక మాజీమంత్రి అంటూ పరోక్షంగా తనను ప్రస్తావించారని, జాతీయ మీడియాలో అయితే ఏకంగా ఉమా మాధవరెడ్డి అనే పేరు కూడా వచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాము మాఫియాను ప్రోత్సహిస్తున్నామా, అప్పులిచ్చి గుంజుకుంటున్నామా, రియల్ఎస్టేట్ వ్యాపారం ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. ప్రభుత్వం తమ కుటుంబానికి మచ్చ తెచ్చేలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సిట్ ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తుంది కాబట్టి దానివల్ల న్యాయం జరుగుతుందన్న నమ్మకం తమకు లేదని, అందుకే జ్యుడీషియల్ విచారణ వేయాలని డిమాండ్ చేశారు.
తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా సెక్యూరిటీ ఉందని, నయీం తమ ఇంట్లో ఆశ్రయం పొందాడా, వైద్యసేవలు పొందాడా అన్న విషయం అప్పటి గన్ మన్లను అడిగితే సరిపోతుందని చెప్పారు. మాధవరెడ్డి హోం మంత్రిగా ఉండటంతో.. నక్సలైట్లను లొంగిపోవాలని, జనజీవన స్రవంతిలో కలవాలని కోరిన విషయం వాస్తవమేనని.. అయినా, అలా లొంగిపోయిన వాళ్లతో లింకులు పెట్టుకోవాల్సిన అవసరం ఆయనకు, తమకు ఏముందని ప్రశ్నించారు. ప్రస్తుత ఎమ్మెల్యేలను చంపించాలని తాను టార్గెట్ చేసినట్లు కూడా కొన్ని కథనాలు వచ్చాయని, అలా చంపించి రాజకీయాలు చేసేంత నీచ ప్రవృత్తి ఉందా అని అడిగారు. ఎన్నికల్లో ప్రజలు తమకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారని.. దాంతో ఐదేళ్ల తర్వాత మళ్లీ జనంలోకి వెళ్లి చూసుకుందామని ఊరుకున్నామని.. అలాంటప్పుడు తమమీద బురద జల్లడం ఎందుకని అడిఆరు. ఇందులో ప్రభుత్వ పాత్ర, పోలీసు పెద్దల పాత్ర కూడా ఉందని ఆరోపించారు. నయీం విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ తర్వాత వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం చూసుకోవాలని, దాంతో తమకేం సంబంధమని ప్రశ్నించారు. భువనగిరిలో ఉన్నవాళ్లలో చాలామంది నయీం అనుచరులు ఉంటారని... తమ దగ్గరకు జనం వచ్చినప్పుడు వాళ్లలో ఎవరు నయీం మనుషులో, ఎవరు కాదో చూసుకుని పనులు చేయడం ఎలా కుదురుతుందని అడిగారు.
వాళ్లంతా ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్లే
నయీమ్ కేసులో బయటికొస్తున్న పేర్లన్నీ ప్రస్తుతం టీఆర్ఎస్‌లో ఉన్నవాళ్లవేనని మాధవరెడ్డి కుమారుడు సందీప్‌రెడ్డి అన్నారు. ఒకప్పుడు టీడీపీ, కాంగ్రెస్ పార్టీలలో ఉన్నవాళ్లు ఈమధ్య మంత్రి జగదీశ్వర్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారని గుర్తుచేశారు. అసలు టీడీపీ అధికారంలో ఉన్న 2004 వరకు భూదందాలు, సెటిల్మెంట్లు ఎక్కడా లేవని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే అవన్నీ మొదలయ్యాయని ఆయన ఆరోపించారు. నయీం రాశాడని చెబుతున్న డైరీ బయటపెడితే మొత్తం విషయాలన్నీ బయటకు వస్తాయని అన్నారు. టీడీపీకి గానీ, తమ కుటుంబానికి గానీ దీంతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తమ కుటుంబం ఇప్పటికే ఇబ్బందుల్లో ఉందని, ఇంకా ఇబ్బంది పెట్టడం సరికాదని అన్నారు. నయీం నక్సలైటుగా ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన విషయాలన్నింటిపైనా జ్యుడీషియల్ విచారణ జరపాలని తెలిపారు. పాశం శ్రీనుకు ఒకప్పుడు టీడీపీ బీ-ఫారం ఇచ్చాము గానీ అతడు ఓడిపోయాడని.. అది పదేళ్ల క్రితం నాటి మాట అని ఆయన అన్నారు. ఇప్పుడు అతడితో తమకు సంబంధం లేదని తెలిపారు.