
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్‌లో చేరాలని తనను ఎవరూ అడగలేదని, ఒకవేళ అడిగితే ఆలోచిస్తానని టీడీపీ నేత ఉమా మాధవరెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలో టీడీపీ పని అయిపోయిందన్న విషయం అందరికీ తెలిసిందేనని పేర్కొన్నారు. శుక్రవారం ఆమె అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ను కలిశారు. అనంతరం లాబీలో విలేకరులతో మాట్లాడారు.
‘‘నక్సల్స్ చేతిలో చనిపోయిన నేతలకు ఇచ్చే ఇంటి ప్లాట్ గురించి సీఎంను కలవడానికి వచ్చా. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు ప్లాట్ కేటాయించారు. ఇప్పటికీ చేతికి రాలేదు. సీఎంను ఒంటరిగా కలిస్తే పార్టీలో చేరుతున్నారని ప్రచారం జరుగుతుందనే.. సండ్ర వెంకటవీరయ్యతో కలసి వెళ్లా. అందరూ ఉండగానే సీఎంకు వినతిపత్రం అందజేశా’’అని చెప్పారు.
కాంగ్రెస్‌లో చేరతారా అని విలేకరులు ప్రశ్నించగా.. ‘‘ఎలాంటి హామీ లేకుండా ఆ పార్టీలో చేరేందుకు నేనేమన్నా పిచ్చి దాన్నా? రేవంత్‌కు పదవులపై çహామీ ఇచ్చి ఉండవచ్చు. నాతో ఏమీ మాట్లాడకుండా ఎలా చేరతాను? హామీ ఇచ్చి ఉంటే రేవంత్‌తోనే ఢిల్లీ ఫ్లైట్ ఎక్కేదాన్ని కదా?’’అని అన్నారు. టీఆర్‌ఎస్‌లో చేరే అవకాశాలపై అడగ్గా.. ‘‘పార్టీలో చేరాలని గత ఎన్నికల ముందు ఆహ్వానించారు. అప్పుడు నేను చేరలేదు. ప్రస్తుతం నన్ను టీఆర్‌ఎస్‌లోకి రమ్మని ఎవరూ అడగలేదు. చేరమని అడిగితే అప్పుడు ఆలోచిస్తా. ఏ పార్టీలో చేరినా, నా కుమారుడి వెంట ఉంటా’’అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment