సాక్షి, యాదాద్రి : ఉమ్మడి నల్లగొం డ జిల్లా టీడీపీలో విభేదాలు మరో సారి బట్టబయలయ్యాయి. టీడీపీ సీనియర్ నేతలు, పొలిట్‌బ్యూరో సభ్యులైన మోత్కుపల్లి నర్సింహులు, ఎలిమినేటి ఉమామాధవరెడ్డి వర్గాలు రెండుగా చీలిపోయాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న టీడీపీ వర్గ పోరులో చెరోవైపు నాయకత్వం వహిస్తున్నారు. తాజాగా సోమవారం నల్లగొండ కలెక్టరేట్ ఎదుట ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చేపట్టిన రైతు దీక్షకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రమణతోపాటు మోత్కుపల్లి నర్సింహులు మాత్రమే హాజరయ్యారు. మరో సీనియర్ నేత ఉమామాధవరెడ్డి రాలేదు. దీంతో ఇటీవల ఆమె టీఆర్‌ఎస్‌లో చేరుతారని వచ్చిన ఊహగానాలకు మరింత బలం చేకూర్చినట్లయింది.
మొదటి నుంచి గ్రూపులే...
టీడీపీలో ముందు నుంచి జిల్లాలో రెండు గ్రూపులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఎలిమినేటి మాధవరెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు ఇరుగుపొరుగు నియోజకవర్గాల్లో నేతలైనప్పటికీ ఎప్పుడు రెండు గ్రూపులుగా ఉమ్మడి జిల్లా రాజకీయాలను శాసించారు. మాధవరెడ్డి మరణానంతరం ఆయన సతీమణి ఎలిమినేటి ఉమామాధవరెడ్డి, అప్పటి నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డిలు ఒకవర్గంగా, మోత్కుపల్లి నర్సింహులు మరో వర్గంగా కొనసాగుతూ వచ్చారు. మారుతూ వచ్చిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో చివరికి ఉమ్మడి జిల్లా టీడీపీలో మోత్కుపల్లి, ఉమామాధవరెడ్డి ఇద్దరు సీనియర్ నేతలు మిగిలారు. ఈనేపథ్యంలో తాజా రాజకీయ పరిస్థితులు టీడీపీని కోలుకోలేని విధంగా దెబ్బతీశాయి. రేవంత్‌రెడ్డి పార్టీని వీడిన నేపథ్యంలో జిల్లా టీడీపీ చెల్లాచెదురైంది. అందరూ రేవంత్‌రెడ్డి వెనుక కాంగ్రెస్‌లోనే చేరుతారని అనుకున్నప్పటికీ కొందరు టీఆర్‌ఎస్‌లో చేరారు.
ఉమ్మడి జిల్లాకు చెందిన బిల్యానాయక్, పటేల్ రమేశ్‌రెడ్డిలు కాంగ్రెస్‌లో చేరగా, కంచర్ల భూపాల్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరితోపాటు పలువురు ముఖ్యనేతలు కూడా టీడీపీకి గుడ్‌బై చెప్పారు. తాజాగా ఉమామాధవరెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరుతారని ప్రచారం బలంగా సాగుతుంది. ఇటీవల సీఎం క్యాంప్ కార్యాలయంలో కేసీఆర్‌ను వ్యక్తిగత పనులపై కలిశారు. ఈ నేపథ్యంలోనే ఆమె టీఆర్‌ఎస్‌లో చేరుతారని ప్రచారం జోరుగా సాగుతుంది. వచ్చే నెల మొదటివారంలో టీఆర్‌ఎస్‌లో చేరడం దాదాపు ఖరారైందని తెలుస్తోంది. మరోవైపు సోమవారం ఆమె సీఎం క్యాంప్ కార్యాలయానికి మరోసారి వెళ్లినట్లు సమాచారం సాగుతోంది. ఈవిషయంపై ఎలిమినేటి ఉమామాధవరెడ్డిని ‘సాక్షి’ సంప్రదించగా తాను సీఎం క్యాంప్ కార్యాలయానికి ఈరోజు వెళ్లలేదని, కావాలని కొందరు మాపార్టీలో ఉన్నవారే నాపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment