మోత్కుపల్లికి టిక్కెట్ దక్కేనా?
హైదరాబాద్ : టీడీపీలో నేతల మధ్య రాజ్యసభ ఎన్నికల పోరు కొనసాగుతోంది. ఆశావహులు తమవంతు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. పార్టీ అధినేతపై ఒత్తిడి పెంచుతున్నారు. రాష్ట్రం నుంచి టిడిపికి దక్కనున్న రెండు సీట్లలో ఒక సీటును తెలంగాణకు ఇవ్వాలన్న డిమాండ్ ప్రధానంగా వినిపిస్తుండగా ఆ సీటును ఆశిస్తున్న తెలంగాణ టీడీపీ నేతల సంఖ్య క్రమంగా పెరుగుతుంది.
టిడిఎల్పీ ఉప నేత, మాజీ మంత్రి, జిల్లాకు చెందిన తుంగతుర్తి ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు తెలంగాణ నుండి సీనియర్ నేతగా తనకు ఈ దఫా రాజ్యసభకు ఎంపిక చేయాలని ఇప్పటికే పార్టీ చంద్రబాబునాయుడును గట్టిగా కోరడం జరిగింది. అయితే దీనిపై బాబునుంచి సరైన హామీ రాకపోవటంతో మోత్కుపల్లికి రాజ్యసభ టిక్కెట్ దక్కడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దాంతో బాబు వైఖరిపై అసంతృప్తిగా ఉన్న ఆయన రెండు రోజుల నుంచి అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టారు.
కాగా తాజాగా జిల్లాకు చెందిన పోలిట్ బ్యూరో సభ్యురాలు, మాజీ మంత్రి, భువనగిరి ఎమ్మెల్యే ఉమా మాధవరెడ్డి సైతం రాజ్యసభ సీటు కోరుతు ఇటీవలే చంద్రబాబు ఇంటికి వెళ్లి మరి అభ్యర్థించారు. పార్టీ ఆవిర్భావం నుండి నేటి వరకు అన్ని ఎన్నికల్లోనూ భువనగిరి అసెంబ్లీ సీటు నుండి దివంగత మాధవరెడ్డి, తదుపరి తాను పార్టీని గెలిపించి ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించామని తమ కుటుంబం పార్టీకి చేసిన సేవలు, త్యాగంను గుర్తించి రాజ్యసభకు తనకు అవకాశం కల్పించాలని ఉమా విన్నవించుకోవడం విశేషం.
పార్టీలో మహిళలకు తగిన గౌరవం కల్పించే దిశగా సైతం సీనియర్ నేతగా తనకు రాజ్యసభకు అవకాశం కల్పించాలని ఉమామాధవరెడ్డి అభ్యర్ధించారు. ఇక జిల్లా టిడిపిలో మోత్కుపల్లి నర్సింహులు, ఎలిమినేటి ఉమామాధవరెడ్డికి మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు రాజ్యసభ సీటు పంచాయతీతో మరోసారి బహిర్గతమైంది.
మధ్యలో టిడిపిని వదిలి కాంగ్రెస్‌లోకి వెళ్లి తిరిగి సొంతగూటికి చేరిన మోత్కుపల్లి కంటే టిడిపి ఆవిర్భావం నుండి పార్టీ కోసం పనిచేసి ప్రాణాలు కోల్పోయిన భర్త మాధవరెడ్డితో పాటు తాను చేసిన సేవలే మిన్నయని తనకే రాజ్యసభ సీటు ఇవ్వాలని ఉమా కోరుతు పార్టీలో మోత్కుపల్లి ఆధిపత్యానికి మరోసారి ఆమె సవాల్ విసిరారు. ఉమా, మోత్కుపల్లిలతో పాటు తెలంగాణ ప్రాంతం నుండి రాజ్యసభ సీటును ఆశిస్తున్న వారిలో గరికపాటి రాంమోహన్‌రావు కూడా ఉన్నారు. మరి తెలంగాణ నుంచి వీరిలో ఎవరికి రాజ్యసభ టిక్కెట్ వరిస్తుందో వేచి చూడాలి.