
మనం గెలవలేం...కానీ టీఆర్‌ఎస్ ఓడిపోవాలి
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికపై టీడీపీ ముఖ్య నేతల చర్చ
సమావేశంలో కుదరని ఏకాభిప్రాయం - నిర్ణయం వాయిదా
అధికార పార్టీని విమర్శించడమే ధ్యేయంగా టీడీపీ జిల్లా జనరల్‌బాడీ
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ‘స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎలాగూ మనం గెలిచే పరిస్థితి లేదు. కానీ టీఆర్‌ఎస్ మాత్రం ఓడిపోవాలి. ఇందుకు మనం ఏం చేయాలో ఆలోచించాలి....’ ఇదీ జిల్లా తెలుగుదేశం పార్టీ ముఖ్యుల సమావేశంలో జరిగిన చర్చ. ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయడంపై చేతులెత్తేసిన ఆ పార్టీ నేతలు ఇప్పుడు అధికార పక్షాన్ని ఎలా ఓడించాలన్న దానిపై దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. అయితే, గురువారం జరిగిన పార్టీ ముఖ్యుల సమావేశంలో దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో ప్రస్తుతానికి తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. గురువారం తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా జనరల్‌బాడీ సమావేశం జరిగింది.
సమావేశానికి పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు ఉమా మాధవరెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంగాల స్వామిగౌడ్‌తోపాటు జిల్లాకు చెందిన ముఖ్య నేతలు హాజరయ్యారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కె.బిల్యానాయక్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం అనంతరం ముఖ్య నాయకులు మరోసారి సమావేశమై ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించారు. పట్టభద్రుల స్థానానికి సంబంధించి రాష్ట్రస్థాయిలో బీజేపీతో వెళ్లాలని నిర్ణయం తీసుకున్నందున ఏప్రిల్‌లో జరగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికపై ఏం చేయాలని చర్చించారు. ఈ చర్చలో కొందరు నేతలు మాట్లాడుతూ మనం గెలవలేం కానీ... టీఆర్‌ఎస్ మాత్రం ఓడిపోవాలి.. ఇందుకు ఏం చేయాలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ప్రతిపాదించారు. అయితే, ఈ ప్రతిపాదనను కొందరు నేతలు వ్యతిరేకించారు. టీఆర్‌ఎస్ ఓడిపోవాలంటే కాంగ్రెస్ గెలవాల్సి ఉంటుంది. మనం కాంగ్రెస్‌కు ఎలా మద్దతిస్తాం. టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదగాల్సిన మనం కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఏం సాధించినట్టు అని ప్రశ్నించారు. దీంతో ఇప్పటి కిప్పుడే ఈ చర్చ అవసరం లేదని, మరోసారి సమావేశమై దీనిపై నిర్ణయం తీసుకుందామని వాయిదా వేశారు.
అన్నీ పరనిందలే..
తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ కోసం ఏర్పాటు చేసిన జిల్లా జనరల్ బాడీ సమావేశం ఆద్యంతం అధికార టీఆర్‌ఎస్‌ను టార్గెట్ చేసుకునే నడిచింది. సమావేశంలో మాట్లాడిన ప్రతి నాయకుడు టీఆర్‌ఎస్‌ను, కేసీఆర్ పాలనను విమర్శిస్తూ మాట్లాడారే కానీ... పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయడంపై దృష్టి పెట్టలేదు. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు మోత్కుపల్లి, ఉమామాధవరెడ్డితో పాటు వంగాల స్వామిగౌడ్, రాష్ట్ర అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి, పార్టీ నేతలు చిలువేరు కాశీనాథ్, బండ్రు శోభారాణి... ఇలా దాదాపు అందరూ కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకునే మాట్లాడారు. అధికార పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే విషయాన్ని ఒకరిద్దరు నేతలే చెప్పినా... విమర్శలు మాత్రం అందరు నేతలూ చేశారు.
కేసీఆర్‌ను పిచ్చితుగ్లక్‌అని, కౌన్‌కిస్కా అని ఎద్దేవా చేసిన టీడీపీ నేతలు టీడీపీ గంగానది అని, టీఆర్‌ఎస్ బురదగుంటలాంటిదని అన్నారు. పాలించే సత్తా లేక, పార్టీ కేడర్ లేక టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తమ పార్టీకి చెందిన నేతలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకుని పదవులిస్తున్నారని అన్నారు. ఇక, చివర్లో మాట్లాడిన మోత్కుపల్లి, ఉమామాధవరెడ్డిలు మాత్రం కొంతమేర పార్టీ శ్రేణులకు సూచనలిచ్చారు. పార్టీ కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉందని, పార్టీని నమ్ముకుని ఉన్న వారంతా, పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యతను తీసుకోవాలని, ఇందుకోసం అందరం అన్నదమ్ముల్లా కలిసి పనిచేద్దామని మోత్కుపల్లి అంటే.... నేనే నాయకుడినని, అందరూ నా మాటే వినాలని అనుకోకుండా, అహం తీసేసుకుని పనిచేస్తే పార్టీ బాగుపడుతుందని ఉమామాధవరెడ్డి వ్యాఖ్యానించారు.
మిగిలిన నేతల్లో కొందరు మాట్లాడుతూ పార్టీ అభివద్ధి కోసం పనిచేయాల్సిన బాధ్యత మోత్కుపల్లి, ఉమామాధవరెడ్డిలపై ఉందన్నారు. అయితే, ఆ ఇద్దరు మాత్రం కనీసం ఒకరినొకరు పలకరించుకున్నట్టు కూడా కనిపించకపోవడం గమనార్హం. జిల్లాలో ఇప్పటికే పార్టీ నేతలంతా మోత్కుపల్లికి వ్యతిరేకంగా ఉమామాధవరెడ్డి పక్షాన చేరుతున్న తరుణంలో జరిగిన పార్టీ సమావేశంలో ఐక్యతే ప్రధాన ఎజెండాగా చర్చ జరిగితే బాగుండేదని, పైకి మాటలు చెప్పిన నేతలు కనీసం మాట్లాడుకోకపోవడం బట్టి చూస్తే జిల్లా టీడీపీ నేతల మధ్య సఖ్యత వట్టిమాటేనని సమావేశానికి వచ్చిన వారే వ్యాఖ్యానించడం గమనార్హం.
మార్చిలో చంద్రబాబు జిల్లా పర్యటన
తెలంగాణలో చంద్రబాబు పర్యటనలో భాగంగా మార్చి నెలలో ఆయనను జిల్లాకు తీసుకురావాలని పార్టీ నేతలు ప్రాథమికంగా నిర్ణయించారు. ఈనెల 12న వరంగల్, 19న కరీంనగర్ జిల్లాల్లో పర్యటన తర్వాత జిల్లాకు చంద్రబాబును తీసుకువచ్చే దానిపై పార్టీ నేతలు చర్చించినా, కొందరు నేతలు మార్చిలోనే చంద్రబాబు టూర్ పెట్టుకుందామని చెప్పడంతో దాన్నే ఖరారు చేద్దామని పార్టీ నేతలు నిర్ణయించారు. జనరల్‌బాడీ సమావేశంలో పార్టీ జిల్లా నేతలు కంచర్ల భూపాల్‌రెడ్డి, చిలువేరు కాశీనాథ్, బండ్రు శోభారాణి, బంటు వెంకటేశ్వర్లు, బొల్లం మల్లయ్యయాదవ్, పటేల్ రమేశ్‌రెడ్డి, కడారి అంజయ్య యాదవ్, బడుగుల లింగయ్య యాదవ్, నన్నూరి నర్సిరెడ్డి, నెల్లూరి దుర్గాప్రసాద్, జక్కిలి అయిలయ్య యాదవ్, మాదగోని శ్రీనివాస్‌గౌడ్, కాజాగౌడ్, యూసుఫ్‌అలీ, సాదినేని శ్రీనివాసరావు, చావా కిరణ్మయి తది తరులు పాల్గొన్నారు.