ఏకగ్రీవానికి నో.. బరిలోనే తేల్చుకుందాం!
హైదరాబాద్: ప్రధాన ప్రతిపక్షం స్థానంలో ఉన్న తాము ఏ విధంగానైనా అధికార టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవాలని, ఆ పార్టీ వైఫల్యాలను ఎండగట్టాలని వీలయినంతమంది తమ ప్రతినిధులను చట్టసభలోకి పంపించాలని కాంగ్రెస్ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. ఇందులో భాగంగా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై తర్జనభర్జన పడుతోంది. ఈ విషయంపైనే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరగా ఆ పార్టీ సీనియర్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ కూడా మరికాసేపట్లో బయలుదేరనున్నారు. జిల్లాల వారిగా ఎమ్మెల్సీ టికెట్ ఆశిస్తున్న నేతల జాబితాను ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకొని ఢిల్లీ వెళ్లారు. ఈ జాబితాను ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కు అందిస్తారు.
ఆ వెంటనే అభ్యర్థుల ఎంపికపై టీ కాంగ్రెస్ దిగ్విజయ్ తో కసరత్తు మొదలుపెడుతుంది. ఇప్పటికే జిల్లాల వారిగా కాంగ్రెస్ బలబలాలను, ఆశావాహుల జాబితాను పీసీసీకి తొమ్మిది జిల్లాల డీసీసీ అధ్యక్షులు సమర్పించగా రంగారెడ్డి జిల్లాలో టీడీపీతో కాంగ్రెస్ సయోద్య కుదుర్చుకుంది. అక్కడ చేరో సీటులో పోటీ చేయాలని ప్రాథమిక నిర్ణయానికి వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పేరును నేతలు ఖరారు చేశారు. ఇక ఖమ్మంలో అటు వామపక్షాలు, టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించుకున్న కాంగ్రెస్ సీపీఐ తరుపున పువ్వాడ నాగేశ్వరరావు పోటీ చేస్తుంగా ఆయనకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకుంది.
మరోపక్క, ఈ ఎన్నికలను ఏకగ్రీవం చేయాలని టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కు ప్రతిపాదించింది. అయితే, ఏక గ్రీవంపై టీఆర్ఎస్తో చర్చలు సరికావని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు పెదవి విరిచినట్లు సమాచారం. దీంతో తప్పకుండా పోటీ చేయాలే తప్ప ఏకగ్రీవానికి రాకూడదనే నిర్ణయానికి కాంగ్రెస్ వచ్చినట్లు సమాచారం.