సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు మరో 12 రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయా స్థానాల పరిధిలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. రాష్ట్రంలోని 77 అసెంబ్లీ స్థానాల పరిధిలో జరగనున్న ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు గాను పట్టభద్రులను ప్రసన్నం చేసుకునే పనిలో అభ్యర్థులు బిజీబిజీ అయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగియడం, ఎన్నికల బరిలో నిలిచిన వారు ఎంతమందో తేలడంతో ఎవరికి వారే గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు. అటు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, న్యాయవాదులతో పాటు డిగ్రీ పూర్తయిన నిరుద్యోగులను సైతం కలసి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ప్రచారానికి మరో 10 రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఈలోగా వీలున్నంత మందిని కలిసేలా కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. ప్రచారం ఊపందుకోవడంతో ఎన్నికల కోలాహలం స్పష్టంగా కనిపిస్తుంది.
పోటా పోటీగా ప్రధాన పార్టీలు
రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పక్షాలైన టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలు రెండు స్థానాల్లోనూ తమ అభ్యర్థులను బరిలో నిలిపి ప్రచారంలో పోటీ పడుతున్నాయి. అధికార టీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపు బాధ్యతలను పార్టీకి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీసుకోగా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ప్రచార సరళిని నిత్యం పరిశీలిస్తూ తగిన విధంగా దిశానిర్దేశం చేస్తున్నారు. అటు ‘నల్లగొండ’నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఇటు ‘రంగారెడ్డి’స్థానం నుంచి సురభి వాణీదేవిల గెలుపే ధ్యేయంగా అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా టీఆర్‌ఎస్ సమావేశాలు నిర్వహిస్తోంది.
రంగారెడ్డి స్థానంలో అభ్యర్థిని కొంత ఆలస్యంగా ప్రకటించిన నేపథ్యంలో ఈ స్థానం పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసింది. ఇక ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ కూడా ప్రచారంలో దూసుకెళుతోంది. పార్టీ అభ్యర్థులు రాములు నాయక్, చిన్నారెడ్డిల గెలుపు కోసం ఇప్పటికే పార్లమెంటు నియోజకవర్గాల వారీగా రెండు స్థానాల పరిధిలో సమావేశాలు నిర్వహించిన ఆ పార్టీ.. ఇప్పుడు అభ్యర్థులను గెలిపించేందుకు ఇన్‌చార్జులను నియమించింది. నల్లగొండ బాధ్యత సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కకు, రంగారెడ్డి బాధ్యత మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డికి అప్పజెప్పింది. ఈ రెండు స్థానాల్లో అసెంబ్లీ
నియోజకవర్గాలు, మండలాల వారీగా ఓటరు జాబితాలను దగ్గర పెట్టుకుని, ఆ మేరకు పట్టభద్రులను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు వంశీచందర్ రెడ్డి, సంపత్ తదితరులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీ కూడా 25 మంది ఓటర్లకు ఒక ఇన్‌చార్జిని నియమించి ప్రచారంలో ముందుకు వెళుతోంది. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సాధించిన విజయాలతో మంచి ఊపు మీదున్న కమలనాథులు తమ సిట్టింగ్ స్థానమైన రంగారెడ్డితో పాటు ఈసారి నల్లగొండను కూడా కైవసం చేసుకుని సత్తా చాటాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ మేరకు రంగారెడ్డి నుంచి రాంచందర్‌రావు, నల్లగొండ నుంచి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డిలు ప్రచారం జోరు పెంచారు.
దీటుగా స్వతంత్రులు..
మరోవైపు స్వతంత్రులు, ఇతర రాజకీయ పార్టీల అభ్యర్థులు కూడా ప్రధాన పార్టీలకు దీటుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. నల్లగొండ నుంచి టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అందరికంటే ముందు నుంచే ప్రచారం చేపట్టారు. రంగారెడ్డి నుంచి మరో ప్రొఫెసర్, మాజీ ఎమ్మెల్సీ, స్వతంత్ర అభ్యర్థి కె.నాగేశ్వర్ ఉద్యోగ సంఘాల మద్దతు కూడగట్టుకోవడమే లక్ష్యంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. నల్లగొండ స్థానం నుంచి లెఫ్ట్ అభ్యర్థిగా బరిలో ఉన్న జయసారథి రెడ్డి సీపీఐ, సీపీఎం పార్టీల కేడర్‌తో పాటు అనుబంధ సంఘాల నేతల సాయంతో ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు.
తెలంగాణ ఇంటి పార్టీ నుంచి బరిలో ఉన్న తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్.చెరుకు సుధాకర్ తన ప్రత్యర్థులతో పోటీ పడుతూ అన్ని వర్గాల మద్దతు కూడగట్టుకునే పనిలో ఉన్నారు. వీరితో పాటు పలువురు స్వతంత్రులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. నామినేషన్ల దాఖలు సమయంలోనే ఉత్సాహంగా, ప్రధాన పార్టీలకు పోటీగా కార్యక్రమాలు నిర్వహించిన వీరంతా గురుకులాలు, కళాశాలలు, పాఠశాలలు, కోర్టులు, ప్రభుత్వ కార్యాలయాలు... ఇలా పట్టభద్రుల ఓట్లు ఎక్కడున్నా వారి వద్దకు వెళ్లి అభ్యర్థిస్తున్నారు. ఉద్యోగ సంఘాల నేతలతో మంతనాలు జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment