సాక్షి, హైదరాబాద్: శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల సంఖ్యపై స్పష్టత వచ్చింది. నామినేషన్ల పరిశీలన అనంతరం 5 స్థానాలకు ఆరుగురు అభ్యర్థులు బరిలో ఉన్నట్లు ఎన్నికల అధికారి వి.నరసింహాచార్యులు ప్రకటించా రు. శుక్రవారం నామినేషన్ల పరిశీలన ప్రక్రియలో స్వతంత్ర అభ్యర్థిగా జాజుల భాస్కర్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేయాలంటే 10 మంది ఎమ్మెల్యేలు బలపరుస్తూ సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఒక్క సంతకమూ లేకపోవడంతో ఈ నామినేషన్‌ను తిరస్కరించినట్లు పేర్కొన్నారు. నామినేషన్ల పరిశీలన అనంతరం 5 స్థానాలకు ఆరుగురు బరిలో ఉన్నట్లు తెలిపారు. నామినేషన్ల పరిశీలన ప్రక్రియకు సత్యవతి రాథోడ్, ఎగ్గె మల్లేశం, శేరి సుభాష్‌రెడ్డి, మీర్జా రియాజ్ ఉల్ హసన్, గూడూరు నారాయణరెడ్డి స్వయంగా హాజరయ్యారు. హోంమంత్రి మహమ్మద్ మహమూద్‌అలీ తరఫున ఆయన ప్రతినిధి హాజరయ్యారు.
ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 4, ఎంఐఎం ఒక స్థానంలో పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీలో ప్రస్తుత బలం ఆధారంగా కాంగ్రెస్ గూడూరు నారాయణ రెడ్డి ఒక్కరినే బరిలో దింపింది. టీఆర్‌ఎస్ తరఫున హోంమంత్రి మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, ఎగ్గె మల్లేశం, శేరి సుభాష్‌రెడ్డి, ఎంఐఎం అభ్యర్థిగా మీర్జా రియాజ్ ఉల్ హసన్ పోటీలో ఉన్నారు. ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఆరుగురు పోటీ చేస్తుండటంతో ఎన్నిక రసవత్తరంగా మారుతోంది. ఈ ఎన్నికల్లో తమ ఐదుగురు అభ్యర్థులను గెలిపించుకునేందుకు టీఆర్‌ఎస్ వ్యూహాలు రచిస్తోంది. ఓటువేసే విషయంలో కన్‌ఫ్యూజన్ లేకుండా మాక్‌పోలింగ్‌ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పర్యవేక్షణలో వ్యూహరచన జరుగుతోంది. శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, శాసనమండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ఎన్నికల వ్యూహం అమలు చేసే బాధ్యతలను అప్పగించారని సమాచారం.
హైదరాబాద్‌కు ఎమ్మెస్
ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న హైదరాబాద్ స్థానిక సంస్థల శాసనమండలి స్థానానికి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఎమ్మెస్ ప్రభాకర్‌రావు పేరును టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఎస్సీ (మాల) సామాజిక వర్గానికి చెందిన ప్రభాకర్‌రావు ప్రస్తుతం ఈ స్థానం నుంచే ఎమ్మెల్సీగా ఉన్నారు. మార్చి 29తో ఆయన పదవీకాలం ముగుస్తోంది. దీంతో ఈ స్థానానికి మళ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రభాకర్‌రావు హైదరాబాద్ స్థానిక సంస్థ ల ఎమ్మెల్సీగా పోటీ చేయడం ఇది మూడోసారి. శాసనమండలి ఏర్పాటైన తర్వాత 2010లో ఈ స్థానానికి తొలిసారి ఎన్నిక జరిగింది. అప్పుడు ఎమ్మెస్ కాంగ్రెస్ తరఫున గెలిచారు. లాటరీలో పదవీకాలం మూడేళ్లే వచ్చింది. 2013లో మళ్లీ ఎన్నికలు జరిగాయి. అప్పుడూ మజ్లిస్ మద్దతు తో ఆయన మరోసారి కాంగ్రెస్ సభ్యుడిగా సభలో అడుగుపెట్టారు.
2015లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ముందు టీఆర్‌ఎస్‌లో చేరారు. అయినా సాంకేతికంగా శాసనమండలిలో కాంగ్రెస్ సభ్యుడిగానే ఉన్నారు. శాసనమండలిలో కాంగ్రెస్ శాసనసభాపక్షం ఇటీవల టీఆర్‌ఎస్‌లో విలీనమైంది. ఈ ప్రక్రియలో ప్రభా కర్‌రావు కీలకంగా వ్యవహరించారు. దీంతో కేసీఆర్ మరోసారి ప్రభాకర్‌రావుకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థలలో టీఆర్‌ఎస్ మెజారిటీ ఉంది. మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎంతో కలిపి తిరుగులేని ఆధిక్యత ఉంది. దీంతో ఎమ్మెస్ ఎన్నిక ఏకగ్రీవమవడం దాదాపు ఖాయమే. తనకు మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడంపై కేసీఆర్‌కు ప్రభాకర్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయబోనన్నారు.
Comments
Please login to add a commentAdd a comment