సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలలో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో తెలంగాణ రాష్ట్ర సమితి అప్రమత్తమైంది. ఉపఎన్నికలు జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. వరంగల్, నల్లగొండ, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ నెల 31న పోలింగ్ జరగనుంది. మూడు స్థానాల్లోనూ టీఆర్‌ఎస్‌కు, కాంగ్రెస్‌కు మధ్య పోటీ నెలకొంది. గతంలో నల్లగొండ స్థానంలో కాంగ్రెస్, మిగిలిన రెండుస్థానా ల్లో టీఆర్‌ఎస్ విజయం సాధించాయి. లోక్‌సభ ఎన్నికల వరకు మూడు స్థానాల్లో కచ్చితంగా గెలుపు తమదే అనే ధీమా అధికార పార్టీలో ఉండింది.
లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రెండు స్థానాలను టీఆర్‌ఎస్ గెలుచుకుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రెండు స్థానాలను, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలోని మల్కాజ్‌గిరి స్థానాన్ని కాంగ్రెస్ గెలుచుకుంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల ప్రభావం ఎమ్మెల్సీ ఎన్నికలలో పడకుండా అధికారపార్టీ అన్నిరకాలుగా అప్రమత్తమైంది. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించారు. 3 ఉమ్మడి జిల్లాల్లోని మంత్రులు, ముఖ్యనేతలతో సమీక్షించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలిచి తీరాలని దిశానిర్దేశం చేశారు.
మూడు జిల్లాల ఓటర్లు అయిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, జెడ్పీటీసీలతో ఢిల్లీ, బెంగళూరులోని పలు ప్రైవేటు హోటళ్లలో టీఆర్‌ఎస్ క్యాంపులు నిర్వహిస్తోంది. క్యాంపులలో ఉన్న ఓటర్లను మంత్రులు కలిసి చర్చించారు. కాంగ్రెస్ అభ్యర్థుల నుంచి ఓటర్లకు ఎలాంటి రాయబారాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. వరంగల్‌లో పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, నల్లగొండలో తేరా చిన్నపరెడ్డి, రంగారెడ్డిలో పట్నం మహేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్ అభ్యర్థులుగా ఉన్నారు. జూన్ 3న ఈ మూడు స్థానాల ఫలితాలు వెల్లడికానున్నాయి.
సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నేడు ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రకటన
అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన మైనంపల్లి హనుమంతరావు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఖాళీ అయిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. మంగళవారం నామినేషన్ల గడువు ముగియనుంది. అసెంబ్లీలో టీఆర్‌ఎస్‌కు భారీ ఆధిక్యత ఉన్న నేపథ్యంలో ఈ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. అయితే, టీఆర్‌ఎస్ ఈ స్థానానికి ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. సీఎం కేసీఆర్ ఆదివారం తిరుపతి పర్యటనకు వెళ్లారు. సోమవారం మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్‌కు చేరుకుంటారు. సీఎం కేసీఆర్ ఇక్కడికి వచ్చిన తర్వాతే టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది.
టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి తక్కళ్లపల్లి రవీందర్‌రావు, మాజీ ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, అజ్మీరా సీతారాంనాయక్, మాజీ స్పీకర్ ఎస్.మధుసూదనాచారి, మల్కాజ్‌గిరికి చెందిన కె.నవీన్‌రావు పేర్లను పరిశీలిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల జాబితా వెల్లడి సందర్భంగా సుఖేందర్‌రెడ్డి, నవీన్‌రావులకు ఎమ్మెల్సీ పదవులను ఇవ్వనున్నట్లు టీఆర్‌ఎస్ అధిష్టానం ప్రకటించింది. అయితే, స్థానిక సంస్థల ఎన్నికల్లో ముగ్గురు అభ్యర్థులు రెడ్డి సామాజికవర్గం వారే కావడంతో ఇప్పుడు వేరే వర్గంవారికి అవకాశం ఉంటుందని టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నల్లగొండ ఎంపీగా గెలిచారు.
ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న హుజూర్‌నగర్ స్థానానికి త్వరలోనే ఉప ఎన్నిక జరగనుంది. ఈ స్థానాన్ని కచ్చితంగా గెలుచుకోవాలని భావిస్తున్న టీఆర్‌ఎస్ మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డిని ఇక్కడ అభ్యర్థిగా నిలిపితే ఎలా ఉంటుందనే కోణంలో ఆలోచిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు కె.యాదవరెడ్డి(ఎమ్మెల్యే కోటా), రాములునాయక్(గవర్నర్ కోటా), ఆర్.భూపతిరెడ్డి(నిజామాబాద్ స్థానిక కోటా)లు పార్టీ ఫిరాయించారనే కారణాలతో వీరిపై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం వీటికి ఎన్నికలు జరగనున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాన్ని అభ్యర్థిని ఖరారు చేయాలని టీఆర్‌ఎస్ అధిష్టానం నిర్ణయించింది. సోమవారం సాయంత్రానికి ఈ అభ్యర్థిత్వంపై ఉత్కంఠ వీడనుంది.
Comments
Please login to add a commentAdd a comment