సీనియర్ నేతలకు అందని ఎమ్మెల్సీ సీటు
నామినేటెడ్ పదవుల్లోనూ దక్కని ప్రాధాన్యం
నిరాశలో టీఆర్‌ఎస్ నాయకులు
వరంగల్ వరంగల్ ఉమ్మడి జిల్లా టీఆర్‌ఎస్ నేతల ఆశలు మరోసారి అడియాసలయ్యాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం వస్తుందని ఆశించిన పలువురు ముఖ్య నేతలు నిరాశకు గురయ్యారు. సాధారణ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన ప్రతీసారి అవకాశం వస్తుందని ఆశిస్తున్న పలువురు సీనియర్ నేతలకు ఇప్పుడు కూడా అసంతృప్తే మిగిలింది. తెలంగాణ ఉద్యమంలో, టీఆర్‌ఎస్ ప్రస్థానంలో కీలకంగా వ్యవహరించిన పలువురు వరంగల్ ఉమ్మడి జిల్లా నేతలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం వస్తుందని ఆశించారు. టీఆర్‌ఎస్ అధిష్టానం తాజాగా ప్రకటించిన ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో ఇక్కడి నేతల్లో ఒక్కరికి కూడా అవకాశం దక్కలేదు. దీంతో టీఆర్‌ఎస్ కీలక నేతల్లో నైరాశ్యం నెలకొంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే కోటా, గవర్నర్ కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి. ఈ కోటాల్లో అవకాశం కోసం వరంగల్ ఉమ్మడి జిల్లాలోని టీఆర్‌ఎస్ సీనియర్ నేతలు గుడిమల్ల రవికుమార్, తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, నాగుర్ల వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీ గుండు సుధారాణి, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య ప్రయత్నించారు.
⇒ టీఆర్‌ఎస్‌లో మొదటి నుంచి పనిచేస్తున్న గుడిమల్ల రవికుమార్ వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల సమయంలోనే అభ్యర్థిగా దాదాపుగా ఖరయ్యారు. చివరి నిమిషయంలో రవికుమార్‌కు అభ్యర్థిత్వం దక్కకుండాపోయింది. ఆ ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ రవికుమార్ ఇంటికి వెళ్లి భవిష్యత్తులో అవకాశం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. అప్పటి నుంచి ఎమ్మెల్సీ ఎన్నికలు, కీలకమైన కార్పొరేషన్ చైర్మన్ల నియామకం జరిగిన సందర్భాల్లో రవికుమార్ పేరు వినిపిస్తోంది. చివరికి అవకాశం చేజారిపోతోంది.
⇒టీఆర్‌ఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు విషయంలోనూ ఇదే జరుగుతోంది. టీఆర్‌ఎస్‌కు కీలకంగా ఉన్న 2014 ఎన్నికల సమయంలో పార్టీ జిల్లా అధ్యక్షులుగా వ్యవహరించిన అందరికీ ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కాయి. రవీందర్‌రావుకు మాత్రం ఇప్పటికీ అధిష్టానం అవకాశం కల్పించలేదు. సీనియర్ నేత నాగుర్ల వెంకటేశ్వర్లు సైతం అవకాశం కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. 2009, 2014 సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం రాలేదు. పరకాల ఉప ఎన్నికల సమయంలోనూ అధిష్టానం అవకాశం ఇవ్వలేదు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో అప్పటి నుంచి ఎమ్మెల్సీ లేదా కీలకమైన కార్పొరేషన్ చైర్మన్ పదవి వస్తుందని ఆశిస్తున్నారు. అధిష్టానం మాత్రం నాగుర్ల వెంకటేశ్వర్లుకు అవకాశం విషయంలో ఇంకా తేల్చడం లేదు.
⇒టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యురాలుగా ఎన్నికైన గుండు సుధారాణి వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఎంపీలుగా, ఎమ్మెల్సీలుగా టీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో దాదాపు అందరికీ మళ్లీ అవకాశం కల్పించారు. ఇదే తరహాలో తనకూ అవకాశం వస్తుందని సుధారాణి భావించారు. రాజ్యసభకుగానీ, ఎమ్మెల్సీకిగానీ అవకాశం రాలేదు. గ్రేటర్ వరంగల్ ఎన్నికల సమయంలో బస్వరాజు సారయ్య కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరారు. టీఆర్‌ఎస్ అధిష్టానం ఏదో ఒక అవకాశం కల్పిస్తుందనే ఆశతో ఉన్నారు. తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అవకాశం రాలేదు. ఇలా వరంగల్ ఉమ్మడి జిల్లా నేతలకు తాజా ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అవకాశం ఇవ్వలేదు.
నారాజ్ !
Published Tue, Mar 7 2017 4:15 AM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM
Advertisement
Advertisement