టీడీపీ నాయకుల రాజీనామా
►తరతరాలుగా పార్టీకి సేవ చేసినా గుర్తింపు లేదని ఆగ్రహం
►ఎంపీటీసీలు, సర్పంచ్‌లను గెలిపించిన వారిపైనా చిన్నచూపు
►కాపు, మైనార్టీ, బీసీ, ఎస్పీలను అణగదొక్కుతున్నారని ఆరోపణ
►ఐరాల మండల టీడీపీలో ప్రకంపనలు
ఐరాల(పూతలపట్టు): ఐరాల మండల తెలుగుదేశం పార్టీలో పలువురు నాయకులు, కార్యకర్తలు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఐరాల, నాగావాండ్ల పల్లె పంచాయతీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కలిపి దాదాపు 500 మంది టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. టీడీపీ సంస్థాగత ఎన్నికల్లో నిజంగా పార్టీకి సేవ చేసిన వారిని విస్మరించారని ఐరాల, నాగావాండ్లపల్లె పంచాయతీల నాయకులు శనివారం అసంతృప్తికి గురయ్యారు. తమ బాధను అనుచరులతో చర్చించడంతో శనివారం సాయంత్రం రెండు పంచాయతీల నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు బాలాజీ, ప్రసాద్ మాట్లాడుతూ టీడీపీకి దశాబ్దాల తరబడీ సేవ చేసిన వారిని కూడా విస్మరిస్తున్నారని మండిపడ్డారు. ఎంపీటీసీ సభ్యులను, సర్పంచ్‌లను గెలిపించడంలో కీలక పాత్ర పోషించిన వారిని కూడా పట్టించుకోవడం లేదన్నారు.
సంక్షేమ పథకాల్లో కూడా తమకు లబ్ధి చేకూర్చడం లేదన్నారు. కాపు, మైనార్టీ, బడుగు, బలహీన వర్గాలను అణగదొక్కుతూ ఓకే సామాజిక వర్గానికి పదవులూ, పథకాలు అంటగడుతున్నారని మండిపడ్డారు. 1983 నాటి క్రమశిక్షణ నేడు పార్టీలో లేదని కేవలం అధికార ధనదాహంతో సంక్షేమ పథకాలు అనర్హులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. కాపు, మైనార్టీ, బీసీలు, ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం కల్పించే రాయితీ రుణాల్లో సైతం చేతివాటం చూపి అనర్హులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. ఈ పార్టీ తీరుపై విసిగిపోయి రెండు పంచాయతీలకు చెందిన తమ అనుచరులు 500 మందితో పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తక్షణ ప్రణాళిక త్వరలో ప్రకటిస్తామని వారు విలేకర్లకు తెలిపారు.