మీడియా సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్‌ఆర్‌సీపీ నేత ప్రసాదరెడ్డి
పెదవాల్తేరు(విశాఖ తూర్పు):ప్రత్యేక హోదా మంజూరు చేసేలా, విభజన హామీలు అమలు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి టీడీపీ ఎంపీలంతా తక్షణమే రాజీనామాలు చేయాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి డిమాండ్ చేశారు. మద్దిలపాలెంలో గల పార్టీ కార్యాలయంలో ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఓటుకునోటు, అమరావతి, విశాఖలో భూ కుంభకోణాలు, పోలవరం ప్రాజెక్టులో అవకతవకలు వున్నందునే టీడీపీ భయపడుతోందని ఆరోపించారు. పైకి మాత్రం కేంద్రంతో పోరాడుతున్నట్టు తెలుగుదేశం నటిస్తోందని ఆయన దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి నాలుగేళ్ల పాటు నిద్రపోయి ఇప్పుడేమో హోదా, విభజన హామీలపై డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు.
ప్రధాని మోదీకి తమ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి నమస్కారం చేయడాన్ని కూడా టీడీపీ నాయకులు తప్పుగా ప్రచారం చేసి కుసంస్కారులుగా వ్యవహరించారన్నారు. విశాఖలో వందల కోట్ల విలువ చేసే 40 ఎకరాల భూములను ఐటీ కంపెనీల పేరిట మంత్రి లోకేష్ బినామీలకు అప్పగిస్తున్నారని ఆరోపించారు. వెయ్యి కోట్ల విలువ చేసే జీవీఎంసీ స్టాఫ్ క్వార్టర్ల స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడం అన్యాయమన్నారు. విశాఖలో భూ కుంభకోణాలు జరుగుతున్నా ఎంపీ హరిబాబు నోరు మెదపడం లేదని విమర్శించారు. పలు ప్రాజెక్టులలో అవినీతికి పాల్పడిన ఎంపీ సీఎంరమేష్ విజయసాయిరెడ్డిపై విమర్శలు చేయడం దారుణమన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు సత్తి రామకృష్ణా రెడ్డి, పి.ఉషాకిరణ్, పీతల మూర్తి యాదవ్, ఆర్.జగన్నాథం, యువశ్రీ, ఎన్.కాళిదాసురెడ్డి, రాధ, కె.చంద్రశేఖర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment