
టీడీపీలో తీర్మానం లడాయి
ఎందుకు ఆమోదించలేదని ఫోన్లో బొండా విసుర్లు
హాట్‌టాపిక్‌గా పాలక గ్రూపుల గోల
విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థ టీడీపీలో తీర్మానం చిచ్చు రగులుకుంది. తన ప్రతిపాదనను ఆమోదించకపోవడంపై సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మె ల్యే బొండా ఉమామహేశ్వరరావు గుర్రుగా ఉన్నట్లు ఆ పార్టీ శ్రేణుల ద్వారా తెలుస్తోంది. శుక్రవారం రాత్రి మేయర్ కోనేరు శ్రీధర్, టీడీపీ ఫ్లోర్‌లీడర్ జి.హరిబాబుతో బొండా కొంచెం కటువుగా మాట్లాడినట్లు సమాచారం.
డిప్యూటీ మేయర్ వైఖరి వల్లే తాము తీర్మానాన్ని వాయిదా వేయాల్సి వచ్చిందని చెప్పినప్పటికీ ఎమ్మెల్యే శాంతించలేదని తెలుస్తోంది. 53వ డివిజన్‌లో నిర్మాణం చేస్తున్న కమ్యూనిటీ హాలుకు గొట్టెముక్కల వెంకట రామారావు పేరు పెట్టాలన్న ఎమ్మెల్యే ప్రతిపాదనపై డిప్యూటీ మేయర్ గోగుల వెంకటరమణారావు అడ్డుపడిన విషయం తెలిసిందే. తన వార్డులో నిర్మాణానికి ఫలానా పేరుపెట్టాలనే ప్రతిపాదనకు స్టాండింగ్ కమిటీ సిఫార్సు చేయడంపై డిప్యూటీ మేయర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తాజా పరిణామాల నేపథ్యం లో ఎమ్మెల్యే, డిప్యూటీ మేయర్‌ల మధ్య దూరం పెరిగినట్లైందని ఆ పార్టీ కార్పొరేటర్లే వ్యాఖ్యానిస్తున్నారు.
డివిజన్ రాజకీయాలే కారణమా?
ఎమ్మెల్యే బొండా ఆశీస్సులతోనే గోగుల డిప్యూటీ మేయర్ అయ్యారు. ఇదే విషయాన్ని ఆయన కౌన్సిల్‌లోనూ స్పష్టం చేశారు. ఎమ్మెల్యే చేసిన ప్రతిపాదనను నిర్ధ్వందంగా తిరస్కరించడంతో కథ అడ్డం తిరిగింది. మేయర్‌తో సహా పలువురు సభ్యులు ప్రతిపాదనను ఆమోదిద్దామని చెప్పినప్పటికీ గోగుల వెనక్కు తగ్గలేదు. ఇందుకు డివిజన్ రాజకీయాలే కారణమంటున్నారు. 54వ డివిజన్‌కు చెందిన గోగుల రమణ బీసీ రిజర్వేషన్ ప్రకారం 53వ డివిజన్ నుంచి పోటీ చేసి గెలుపొందారు.
కొంతకాలంగా విజయకృష్ణా సూపర్‌బజార్ చైర్మన్ గొట్టెముక్కల రఘురామరాజుతో గోగులకు పొసగడం లేదని భోగట్టా. ఈక్రమంలోనే రఘురామరాజు కమ్యూనిటీ హాలుకు పేరుపెట్టే ప్రతిపాదనను ఎమ్మెల్యేతో చేయించినట్లు తెలుస్తోంది. స్టాండింగ్ కమిటీ సభ్యుడు కాకు మల్లికార్జునయాదవ్‌కు ప్రతిపాదనను ఈనెల 28న రఘురామరాజు పంపారు. విషయం తెలుసుకున్న డిప్యూటీ మేయర్ వచ్చే కౌన్సిల్‌లో తానే ప్రతిపాదన పెడతానని చెప్పారు. అయినప్పటికీ 88కె ప్రకారం మొండిగా కౌన్సిల్ ముందుకు ప్రతిపాదన తేవడంతో డిప్యూటీ మేయర్ అడ్డం తిరిగారు.
డిప్యూటీ మేయర్ చైర్‌కు ఎసరు
తాజా పరిణామాల నేపథ్యంలో డిప్యూటీ మేయర్ చైర్ కదలడం ఖాయమని ఆ పార్టీ కార్పొరేటర్లే బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నారు. మార్చి నెలలోకార్పొరేషన్ పదవుల్లో మార్పులు, చేర్పులుంటాయనే ప్రచారం టీడీపీలో సాగుతోంది. డిప్యూటీ మేయర్, ఫ్లోర్‌లీడర్ పదవుల కోసం ఆశావహులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. డిప్యూటీ మేయర్ పదవి కోసం సెంట్రల్ నియోజక వర్గం నుంచి 44వ డివిజన్ కార్పొరేటర్ కాకు మల్లిఖార్జున, 45వ డివిజన్ కార్పొరేటర్ ఆతుకూరి రవికుమార్‌లు ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు.
కాకు యాదవ్‌కు ఇటీవలే స్టాండింగ్ కమిటీలో స్థానం కల్పించారు కాబట్టి, బీసీ వర్గానికి చెందిన రవికుమార్‌కు డిప్యూటీ మేయర్ పోస్టు వరిస్తోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. శనివారం హైదరాబాద్‌లో ఎమ్మెల్యే బొండా జన్మదిన వేడుకల్లో పలువురు కార్పొరేటర్లు పాల్గొన్న సందర్భంలోనూ ఈ విషయమై వాడివేడి చర్చ నడిచినట్లు సమాచారం.