శ్రీశైలంలో అభిషేకాలపై నియంత్రణ
· సుప్రభాత, మహామంగళహారతిసేవా టికెట్లు రద్దు
శ్రీశైలం: శివునికి అత్యంత ప్రీతికరమైన సోమవారం రోజే కార్తీకమాసంలో ప్రముఖ పర్వదినంగా పేర్కొనే పౌర్ణమి కలిసి రావడంతో ఆదివారం భక్తులరద్దీని దృష్టిలో ఉంచుకుని శ్రీశైలంలో సామూహిక అభిషేకం టికెట్లపై నియంత్రణ విధించినట్లు ఈఓ భరత్ గుప్త పేర్కొన్నారు. అలాగే గర్భాలయంలో జరిగే రూ. 5వేల ప్రత్యేక అభిషేకం టికెట్లను సోమవారం రద్దు చేసినట్లు ప్రకటించారు. వేకువజామున జరిగే స్వామి అమ్మవార్ల సుప్రభాత మహామంగళహారతిసేవా టికెట్లను కూడా నిలుపుదల చేశామన్నారు. సోమవారం వేకువజామున 3.30గంటల నుంచే దర్శన ఆర్జితసేవలు ప్రారంభమయ్యేలా ఏర్పాట్లు చేశారు. అదేరోజు రాత్రి పవిత్ర పాతాళగంగ నదీ ఒడ్డున కృష్ణమ్మకు వాయనాలు సమర్పించి, ఏకాదశ(11) హారతులను ఉభయ దేవాలయాల అర్చకులు కృష్ణవేణిమాతకు సమర్పిస్తారని చెప్పారు. సాయంత్రం 4 గంటల నుంచి నదీ తీరం వద్ద ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, రాత్రి 7గంటలకు గంగాధర మండపం వద్ద జ్వాలా తోరణ దర్శనం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.