abhishakam
-
భక్తులతో పోటెత్తిన శ్రీశైలం
· 900లకు పైగా అభిషేకాలు · క్యూలలో ఉచిత ఫలహారం, పాలు, మజ్జిగ వితరణ · ఆలయపూజావేళల్లో మార్పులు శ్రీశైలం: శ్రీశైలమహాక్షేత్రం భక్తజనంతో పోటెత్తింది. కార్తీక పౌర్ణమి పర్వదినం, మూడో సోమవారం కలిసి రావడంతో ఆదివారం సాయంత్రానికి లక్షకు పైగా భక్తులు క్షేత్రానికి చేరుకున్నారు. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని వేకువజామున 3.30గంటల నుంచే దర్శన ఆర్జితసేవలు ప్రారంభమయ్యేలా అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. ఆలయపూజావేళల్లో మార్పు కారణంగా వేకువజామున సాధారణ స్థాయిలో ప్రారంభమై ఉదయం 7గంటల సమయానికి అన్ని క్యూకాంప్లెక్స్‌లలోని క్యూ కంపార్టుమెంట్లు పూర్తిగా నిండిపోయాయి. మల్లన్న దర్శనం కోసం వేచి ఉండే భక్తులు ఇబ్బంది పడకుండా ఉచితంగా పులిహోర ప్రసాదంతో పాటు సమయానుకూలంగా వృద్ధులు, పిల్లలకు పాలు, మజ్జిగ, మంచినీరు పంపిణీ చేశారు. ఓ వైపు విడతల వారీగా అభిషేకాల నిర్వహణ, మరోవైపు సాధారణ భక్తులకు సర్వదర్శనం కలిగేలా చర్యలు తీసుకున్నారు. గత వారంలో జరిగిన పరిస్థితులు పునరావృతం కాకుండా ఎప్పటికప్పుడు ఈఓ స్వీయ పర్యవేక్షణ చేశారు. 900 పైగా సామూహిక అభిషేకాలు: మన రాష్ట్రం నుంచేగాకుండా తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ తదితర రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు శ్రీశైలానికి వచ్చారు. వీరు స్వామివార్లను అభిషేక జలాలు సమర్పించడానికి ఆన్లైన్, కరెంట్ బుకింగ్, ఒక్క రోజు ముందస్తు టికెట్ల విక్రయంతో సుమారు 900 పైగా అభిషేకాలు జరిగాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అక్కమహాదేవి అలంకారమండపంలో విడతల వారీగా 5సార్లుగా అభిషేకాల నిర్వహణ కొనసాగింది. అభిషేకానంతరం భక్తులు మల్లన్నను స్పర్శదర్శనం చేసుకోవడానికి ఆలయ ప్రాంగణంలో బారులు తీరారు. గంగాధర మండపం వద్ద కార్తీక దీపారాధన: ప్రధాన రథ వీధిలోని గంగాధర మండపం వద్ద కార్తీకశుద్ధ చతుర్దశిని పురస్కరించుకుని వందల సంఖ్యలో భక్తులు కార్తీక దీపారాధనలు నిర్వహించుకున్నారు. పవిత్ర పాతాళగంగలో స్నానాలు, మల్లన్నదర్శనం, కార్తీక దీపారాధనలు చేసుకుని ఆదివారం భక్తులు ఉపవాసదీక్షలను విరమించుకున్నారు. భక్తులకు దేవస్థానం తరఫున కార్తీక వనభోజనాలు: శ్రీశైలం వంటి మహా పుణ్యక్షేత్రంలో భక్తులకు వనభోజనాలను ఏర్పాటు చేయాలని ఈఓ సంకల్పించారు. అందులో భాగంగా కార్తీక మాసారంభం నుంచే శివదీక్ష శిబిరాలవద్ద వనభోజన కార్యక్రమాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఉదయం ఫలహారం, మధ్యాహ్నం వనభోజనాలు, సాయంత్రం అల్పాహారం అందిస్తున్నారు. సోమవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా హైదరాబాద్‌కు చెందిన మహేందర్‌రెడ్డి, అవంతి దంపతులు దేవస్థానం నిర్వహిస్తున్న వన భోజన కార్యక్రమానికి 10వేల స్వీట్లు, 10వేల అరటి పండ్లను భక్తులకు ఉచితంగా అందజేస్తున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. -
శ్రీశైలంలో అభిషేకాలపై నియంత్రణ
· సుప్రభాత, మహామంగళహారతిసేవా టికెట్లు రద్దు శ్రీశైలం: శివునికి అత్యంత ప్రీతికరమైన సోమవారం రోజే కార్తీకమాసంలో ప్రముఖ పర్వదినంగా పేర్కొనే పౌర్ణమి కలిసి రావడంతో ఆదివారం భక్తులరద్దీని దృష్టిలో ఉంచుకుని శ్రీశైలంలో సామూహిక అభిషేకం టికెట్లపై నియంత్రణ విధించినట్లు ఈఓ భరత్ గుప్త పేర్కొన్నారు. అలాగే గర్భాలయంలో జరిగే రూ. 5వేల ప్రత్యేక అభిషేకం టికెట్లను సోమవారం రద్దు చేసినట్లు ప్రకటించారు. వేకువజామున జరిగే స్వామి అమ్మవార్ల సుప్రభాత మహామంగళహారతిసేవా టికెట్లను కూడా నిలుపుదల చేశామన్నారు. సోమవారం వేకువజామున 3.30గంటల నుంచే దర్శన ఆర్జితసేవలు ప్రారంభమయ్యేలా ఏర్పాట్లు చేశారు. అదేరోజు రాత్రి పవిత్ర పాతాళగంగ నదీ ఒడ్డున కృష్ణమ్మకు వాయనాలు సమర్పించి, ఏకాదశ(11) హారతులను ఉభయ దేవాలయాల అర్చకులు కృష్ణవేణిమాతకు సమర్పిస్తారని చెప్పారు. సాయంత్రం 4 గంటల నుంచి నదీ తీరం వద్ద ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, రాత్రి 7గంటలకు గంగాధర మండపం వద్ద జ్వాలా తోరణ దర్శనం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. -
నియమిత వేళల్లో స్పర్శదర్శనం
శ్రీశైలం: భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సాధారణ రోజుల్లో నియమిత వేళల్లో భక్తులందరికీ స్పర్శదర్శన అవకాశం కల్పిస్తున్నట్లు ఈవో నారాయణ భరత్ గుప్త తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సాధారణ భక్తులకు స్పర్శదర్శనం నిలుపుదల చే యలేదని స్పష్టం చేశారు. గతంలో గర్భాలయంలో జరిగే అభిషేకాలను కేవలం 3 నుంచి 5 నిమిషాల్లోపే పూర్తి చేసేవారన్నారు. చాలా మంది భక్తులు అభిషేకాల నిర్వహణపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని, వీటన్నింటిని దష్టిలో పెట్టుకుని సామూహిక అర్జిత అభిషేకాలను ప్రవేశ పెట్టామన్నారు. రూ.5వేలు నిర్ణయించిన ఈ అభిషేక సేవలో రోజుకు కేవలం 24 టికెట్లను మాత్రమే అందుబాటులో ఉంచామని, 20 నిమిషాల పాటు శాస్త్రోక్తంగా అభిషేకాన్ని సేవాకర్తలు నిర్వహించుకోవచ్చునన్నారు. గతంలో శ్రీ స్వామివార్ల బిల్వార్చన రుసుం రూ. 3,116 ఉండగా.. నేడు బిల్వార్చన టికెట్‌ను రూ. 5వేలకు పెంచామన్నారు. గతంలో దంపతులు లేదా ఒక్కరికి కూడా అభిషేక రుసుం రూ. 1500లుగా ఉండగా, ప్రస్తుతం దంపతులకు రూ. 1500లను కొనసాగిస్తూ, ఒక్కరు అభిషేకం చేయాలనుకుంటే రూ. 750లుగా నిర్ణయించినట్లు చెప్పారు. -
గర్భాలయంలో మల్లన్న అభిషేకం రూ.5 వేలు
– నేటి నుంచి అమలు – కల్యాణమండపంలో సామూహిక అభిషేకాలు యథాతథం – స్పర్శదర్శనానికి రూ. 500 –సాధారణ భక్తులకు మల్లన్న అలంకార దర్శనం శ్రీశైలం: శ్రీమల్లికార్జునస్వామివార్ల గర్భాలయంలో జరిగే అభిషేకం టికెట్ ధరను నేటి నుంచి రూ. 5వేలకు పెంపుదల చేస్తూ ఈఓ నారాయణభరత్ గుప్త సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. నిర్ధారిత కమిటీ ఆదేశాల మేరకు గర్భాలయంలో అభిషేకాలు చేసుకునే సేవాకర్తలకు పూజాసామాగ్రిగా ఒక కొబ్బరికాయతో పాటు 250 గ్రాముల లడ్డూప్రసాదం, విభూధిపాకెట్, కైలాస కంకణ బాక్స్, శ్రీశైలప్రభను ఉచితంగా అందజేస్తున్నట్లు ఈఓ తెలిపారు. అభిషేక సేవాకర్తలతో పాటు వచ్చిన వారికి రూ. 500 టికెట్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్, కరెంట్ బుకింగ్ టికెట్ల సమయాలు ఉదయం 6.30 గంటల నుంచి 7.30గంటల వరకు , 8.30 నుంచి 9.30 గంటల వరకు, 10.30 నుంచి 11.30 గంటల వరకు, సాయంత్రం 6.30గంటల నుంచి 7.30గంటల వరకు 6 టికెట్ల చొప్పున విడతల వారీగా నిర్వహిస్తారు. మొత్తం మీద గర్భాలయంలో అభిషేకాలకు 24 టికెట్లకు మాత్రమే అనుమతి ఉంటుంది. అలాగే కల్యాణమండపంలో సామూహిక అభిషేకాలు నిర్వహించే సమయంలో గర్భాలయంలోని అభిషేకాలు కొనసాగుతాయి. రూ.500కే సుప్రభాత, మహామంగళహారతి సేవలు శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్లకు ఉదయం జరిగే సుప్రభాత, మహామంగళహారతి సేవలో నిర్ధారిత కమిటీ కొద్దిగా మినహాయింపు ఇచ్చింది. శని,ఆది,సోమవారాల్లో సుప్రభాత సేవకు రూ. 1,000 టికెట్ ఉండేది. మహామంగళహారతి టికెట్ రూ. 600 ఉండేది కాగా వీటన్నింటిని ఒకే గాటికి తెచ్చింది. సుప్రభాతం, మహామంగళహారతి, అభిషేకానంతరం దర్శనానికి రూ. 500 చొప్పున టికెట్లు, శీఘ్ర దర్శనానికి రూ. 100 టికెట్‌ను నిర్ధారిత కమిటీ పెట్టింది. -
అభిషేకాలకు పోటెత్తారు
మల్లన్నకు 700 పైగా సామూహిక అభిషేకాలు శ్రీశైలం: శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల సన్నిధిలో మాసశివరాత్రి పర్వదిన సందర్భంగా మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం 7.30గంటల వరకు ఆరు విడుతలుగా జరిగిన సామూహిక అభిషేకాలలో 705 టికెట్లకు పైగా విక్రయించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఉదయం నుంచి భక్తులరద్దీ సాధారణంగానే ఉన్న అభిషేకాలు చేయించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో ఆసక్తి చూపించారు. ఆలయ ప్రాంగణంలోని స్వామిఅమ్మవార్ల నిత్య కల్యాణ మండపంలో ఉదయం 6.30గంటలకు మొదట విడత బ్యాచ్ ప్రారంభం కాగా, మధ్యాహ్నం 3.30గంటల వరకు ఐదు విడతల అభిషేకాలను నిర్వహించారు. సాయంత్రం 6.30 గంటల నుంచి 7.30 గంటల వరకు తక్కువ సంఖ్యలో అభిషేకాలు జరిగాయి. అయితే ఒకవైపు వర్షం కురుస్తుండడంతో అభిషేకం టికెట్లు తీసుకున్న సేవాకర్తలు వేచి ఉండడానికి ఇబ్బంది పడ్డారు. సామూహిక అభిషేక సేవాకర్తలు వేచి ఉండేందుకు వీలుగా దేవస్థానం అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని భక్తులు కోరారు. హరిహరరాయగోపురం పక్కనే ఉన్న దత్తాత్రేయ ఉద్యానవనంలో షెడ్డును ఏర్పాటు చేసి సీసీ కెమెరాలతో పాటు ఆధ్యాత్మిక ప్రసంగాల కోసం ఎల్ఈడీ టీవీలను ఏర్పాటు చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని భక్తులు వ్యక్తం చేస్తున్నారు. -
వర్షం కోసం వరుణయాగం
కర్నూలు (న్యూసిటీ) : సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలనిS వరుణయాగాలు చేస్తున్నామని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈఓ సత్యనారాయణ తెలిపారు. ఆదివారం నగరంలోని చిదంబరరావు వీధిలో వెలసిన నగరేశ్వరస్వామి ఆలయంలో వరుణయాగం నిర్వహించారు. స్వామికి అభిషేకం చేసి, మల్లె, మారేడు దళాలతో అలంకరణ చేశారు. అర్చకులు రఘురామశర్మ, చంద్రశేఖరశ్మ, మురళీశర్మ, ధర్మకర్త మండలి సభ్యులు గోవిందరాజు, కష్ణమూర్తి, సత్యనారాయణ సింగ్, శేషుసింగ్, జితేంద్ర, భక్తులు పాల్గొన్నారు. వెంగన్నబావి ప్రాంతంలో ఉన్న శివాలయంలో.. నగర శివారులోని వెంగన్నభావి దగ్గర ఉన్న వేములవెంగన్న శివాలయంలో ఈశ్వరునికి అభిషేకం చేసి, మల్లె పూలతో అలంకరణ చేశారు. అనంతరం వరుణయాగం, రుద్రహోమం నిర్వహించారు. కర్నూలు మండలాధ్యక్షుడు రాజావర్థన్‌రెడ్డి, దిన్నెదేవరపాడు సర్పంచు నాగన్న, దేవాదాయ ధర్మదాయ శాఖ కార్యనిర్వహణాధికారి సత్యనారాయణ, అర్చకులు డీవీ సుబ్బయ్య, భక్తులు పాల్గొన్నారు. -
శ్రీశైలంలో శాస్త్రోక్త సామూహిక అభిషేకాలు
– ప్రారంభించిన జగద్గురు పీఠాధిపతి శ్రీశైలం: శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల ఆలయ ప్రాంగణంలో ఆదివారం శాస్త్రోక్త సామూహిక అభిషేకాలకు శ్రీకారం చుట్టారు. గతంలో స్వామివారిని జలంతో అభిషేకించి స్పర్శదర్శనం చేసుకునేవారు. ప్రస్తుతం అభిషేక జలాన్ని మంత్రపూర్వకంగా చేసి ..దానిని స్వామివార్లకు అభిషేకించుకునే అవకాశం కల్పించారు. జగద్గురు పీఠాధిపతి చెన్న సిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామి శాస్త్రోక్త పూజలను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామీజీ అనుగ్రహ భాషణం చేశారు. వేదపండితులు, అర్చకులు వేద మంత్రాలను పఠిస్తుండగా.. వాటిని వింటూ పరమేశ్వరుని ధ్యానిస్తూ ఆ జల కళశాలను స్మశించి అభిషేక కార్యక్రమాన్ని మనసావాచా నిర్వహించాలని సేవాకర్తలకు సూచించారు. ఈ అభిషేకం వల్ల భక్తులు సంపూర్ణమైన ఫలితం పొందుతారన్నారు. ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఐదు విడతలగా జరిగిన సామూహిక అభిషేకంలో మొత్తం 700పైగా టికెట్లను విక్రయించినట్లు ఈవో నారాయణ భరత్ గుప్త తెలిపారు. ఒక్కొక్క విడతలో మొత్తం 120 టికెట్ల చొప్పున విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30గంటల వరకు, సాయంత్రం 6.30గంటల నుంచి 7.30గంటల వరకు అభిషేకం టికెట్లను ఇస్తామని పేర్కొన్నారు. -
నేడు మల్లన్నకు సహస్ర ఘటాభిషేకం
– ఆర్జిత సేవలు నిలుపుదల – నదీ జలాలతో మల్లన్నకు అభిషేకం – మంగళవారం ఉదయం వరకు జలాధివాసంలో శ్రీశైలేశుడు శ్రీశైలం: రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని, వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా అభివద్ధి చెందాలనే సంకల్పంతో శ్రీమల్లికార్జునస్వామి వారికి సోమవారం సహస్రఘటాభిషేకాన్ని నిర్వహించడానికి దేవస్థానం సన్నాహాలు చేసింది. ఇందులో భాగంగా సోమవారం ఉదయం 5గంటల నుంచి వేదపండితులు, అర్చకులు, ఆలయ అధికారులు ప్రధానాలయం నుంచి పాతాళగంగ వద్దకు చేరుకుని కష్ణవేణి నదీమాతల్లికి విశేషపూజాధికాలను నిర్వహిస్తారు. కృష్ణాజలాలను కలశాలలో సేకరించి నందిమండపం, అంకాలమ్మగుడి, వీరభద్రస్వామివార్లకు కష్ణాజలాలతో అభిషేకం చేసి తిరిగి ప్రధానాలయం చేరుకుంటారు. యాగశాల వద్ద పాతాళగంగ నుంచి తెచ్చిన నదీ కలశాలకు సంప్రదాయబద్దంగా పూజలు చేసి ఆ కలశాలతో ఆలయప్రదక్షిణ చేస్తారు. అనంతరం స్వామివార్లకు పంచామతాభిషేకం, నదీజలాలతో అభిషేకాన్ని నిర్వహిస్తారు. ఉదయం 7.30గంటల నుంచి స్వామివార్ల సహస్రఘటాభిషేకం ప్రారంభమై సాయంత్రం వరకు కొనసాగుతుంది. సాయంత్రం 6గంటల తరువాత స్వామివార్ల ధర్మదర్శనం ఉంటుంది. ఆ మరుసటిరోజు మంగళవారం ఉదయంజరిగే ప్రాతఃకాలపూజల వరకు శ్రీ మల్లికార్జునస్వామి జలవాసమై ఉంటారని అర్చకులు పేర్కొన్నారు. ఆర్జితసేవలు తాత్కాలికంగా నిలుపుదల శ్రీమల్లికార్జునస్వామివార్లకు జరిగే సహస్ర ఘటాభిషేకాన్ని పురస్కరించుకుని సోమవారం స్వామివార్లకు జరిగే ఆర్జిత అభిషేకాలు, గణపతి అభిషేకం, లక్షబిల్వార్చన, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, మొదలైన ఆర్జిత సేవలన్నింటిని తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఈఓ నారాయణ భరత్ గుప్త ఆదివారం తెలిపారు. అదే విధంగా సోమవారం వేకువజామునే జరిగే సుప్రభాత, మహామంగళహారతి సేవాటికెట్లను కూడా నిలుపుదల చేశామని, సాయంత్రం జరిగే స్వామివార్ల కల్యాణోత్సవం, ఏకాంతసేవలు యథావిథిగా జరుగుతుందని పేర్కొన్నారు. మూడవ రోజు కొనసాగిన వరుణహోమ, జపాదులు వర్షాభావ పరిస్థితులు తొలగి వరుణదేవుడు కరుణించి వర్షాలు కురిపించాలని శ్రీశైలమహా„ó త్రంలో చేస్తున్న వరుణజపాలు, హోమాలు ఆదివారం నాటికి మూడో రోజు చేరుకున్నాయి. ప్రతిరోజూ 2పూటలా యజ్ఞాది క్రతువులను, వరుణమంత్రాలతో నిర్వహిస్తున్నారు. రుష్యశంగుడి బొమ్మను పిండితో చేసి ప్రత్యేకపూజలను చేయడంతో కుంభవష్టిగా వర్షాలు పడుతాయని శాస్త్రాలు చెబుతున్నాయని వేదపండితులు తెలిపారు. నిష్ణాతులైన పండితులు వరుణ జపహోమాలను ఎంతో శాస్త్రోక్తంగా నిర్వహిస్తూ రుద్రపారాయణలు, వరుణసూక్తపారాయణ, చతుర్వేద పారాయణ, వరుణజపాలు, రుశ్యశంగజపం, విరాటపర్వ పారాయణ కార్యక్రమాలు ఆలయప్రాంగణంలో నిర్వహిస్తున్నారు. -
మల్లన్న సామూహిక అభిషేకాలకు రంగం సిద్ధం
శ్రీశైలం: శ్రీశైల ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా భక్తుల రద్దీ దృష్ట్యా రద్దీని దృష్టిలో ఉంచుకుని మల్లన్నకు సామూహిక అభిషేకాలను నిర్వహించడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఆగస్టు 3వ తేదీ నుంచి శ్రావణమాసం ప్రారంభమవుతున్న సందర్భంగా అభిషేకాల నిర్వహణపై అధికారులు ఏర్పాట్లు చేసేందుకు సమాయత్తమవుతున్నారు. ఇటీవల శ్రీశైల దేవస్థానం ఈఓగా బాధ్యతలను స్వీకరించిన నారాయణ భరత్ గుప్త గతంలో సామూహిక అభిషేకాలు ఎలా నిర్వహించారు, ఆ సమయంలో తలెత్తిన పరిస్థితులు మొదలైన అంశాలపై అధికారులు, అర్చకులు, వేదపండితులతో చర్చించి ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. గతంలో రద్దీగా ఉండే, శని,ఆది,సోమవారాలలో సామూహిక అభిషేకాలను ఆలయప్రాంగణంలోని స్వామిఅమ్మవార్ల నిత్య కల్యాణమండపంలో నిర్వహించేవారు. మిగిలిన రోజుల్లో స్వామివార్ల గర్భాలయంలోనే ఈప్రక్రియ జరిగేది. త్వరలో ఉత్తర్వులు జారీ: ఈ ఏడాది ఆగస్టు 12 నుంచి కష్ణా పుష్కరాలు కూడా ప్రారంభమవుతున్న సందర్భంగా భక్తులరద్దీ అధికంగా ఉంటుందనే భావనతో సామూహిక అభిషేకాలను నిర్వహించాలనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. శ్రీశైల దేవస్థానం సామూహిక అభిషేకాలను నిర్వహించడం పట్ల విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆ సమయంలో తీవ్రంగా ఆక్షేపణ వ్యక్తం చేశారు. దేవాదాయ దర్మదాయ శాఖ ఆధీనంలోని అన్ని దేవస్థానాలు వ్యాపార కేంద్రాలుగా మారాయని విమర్శించారు. పీఠాధిపతుల విమర్శలను, భక్తుల అభిప్రాయాలను దష్టిలో ఉంచుకుని కల్యాణమండపంలో సామూహిక అభిషేకాలు నిర్వహించుకున్న తరువాత సేవా కర్తలకు శుద్ధ జలంతో స్వామివార్లను దర్శన సమయంలో అభిషేకించుకునే అవకాశాన్ని కల్పించాలని భావిస్తున్నారు. ఏదేమైనా సామూహిక అభిషేకాల నిర్వహణపై విధి విధానాలను రూపొందించిన తరువాత శ్రావణమాసంలో జరిగే అభిషేకాల నిర్వహణపై త్వరలో ఈఓ ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది.