శ్రీశైలంలో శాస్త్రోక్త సామూహిక అభిషేకాలు
– ప్రారంభించిన జగద్గురు పీఠాధిపతి
శ్రీశైలం: శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల ఆలయ ప్రాంగణంలో ఆదివారం శాస్త్రోక్త సామూహిక అభిషేకాలకు శ్రీకారం చుట్టారు. గతంలో స్వామివారిని జలంతో అభిషేకించి స్పర్శదర్శనం చేసుకునేవారు. ప్రస్తుతం అభిషేక జలాన్ని మంత్రపూర్వకంగా చేసి ..దానిని స్వామివార్లకు అభిషేకించుకునే అవకాశం కల్పించారు. జగద్గురు పీఠాధిపతి చెన్న సిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామి శాస్త్రోక్త పూజలను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామీజీ అనుగ్రహ భాషణం చేశారు. వేదపండితులు, అర్చకులు వేద మంత్రాలను పఠిస్తుండగా.. వాటిని వింటూ పరమేశ్వరుని ధ్యానిస్తూ ఆ జల కళశాలను స్మశించి అభిషేక కార్యక్రమాన్ని మనసావాచా నిర్వహించాలని సేవాకర్తలకు సూచించారు. ఈ అభిషేకం వల్ల భక్తులు సంపూర్ణమైన ఫలితం పొందుతారన్నారు. ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఐదు విడతలగా జరిగిన సామూహిక అభిషేకంలో మొత్తం 700పైగా టికెట్లను విక్రయించినట్లు ఈవో నారాయణ భరత్ గుప్త తెలిపారు. ఒక్కొక్క విడతలో మొత్తం 120 టికెట్ల చొప్పున విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30గంటల వరకు, సాయంత్రం 6.30గంటల నుంచి 7.30గంటల వరకు అభిషేకం టికెట్లను ఇస్తామని పేర్కొన్నారు.