గర్భాలయంలో మల్లన్న అభిషేకం రూ.5 వేలు
గర్భాలయంలో మల్లన్న అభిషేకం రూ.5 వేలు
Published Mon, Sep 19 2016 11:28 PM | Last Updated on Mon, Oct 8 2018 9:10 PM
– నేటి నుంచి అమలు
– కల్యాణమండపంలో సామూహిక అభిషేకాలు యథాతథం
– స్పర్శదర్శనానికి రూ. 500
–సాధారణ భక్తులకు మల్లన్న అలంకార దర్శనం
శ్రీశైలం: శ్రీమల్లికార్జునస్వామివార్ల గర్భాలయంలో జరిగే అభిషేకం టికెట్ ధరను నేటి నుంచి రూ. 5వేలకు పెంపుదల చేస్తూ ఈఓ నారాయణభరత్ గుప్త సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. నిర్ధారిత కమిటీ ఆదేశాల మేరకు గర్భాలయంలో అభిషేకాలు చేసుకునే సేవాకర్తలకు పూజాసామాగ్రిగా ఒక కొబ్బరికాయతో పాటు 250 గ్రాముల లడ్డూప్రసాదం, విభూధిపాకెట్, కైలాస కంకణ బాక్స్, శ్రీశైలప్రభను ఉచితంగా అందజేస్తున్నట్లు ఈఓ తెలిపారు. అభిషేక సేవాకర్తలతో పాటు వచ్చిన వారికి రూ. 500 టికెట్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్, కరెంట్ బుకింగ్ టికెట్ల సమయాలు ఉదయం 6.30 గంటల నుంచి 7.30గంటల వరకు , 8.30 నుంచి 9.30 గంటల వరకు, 10.30 నుంచి 11.30 గంటల వరకు, సాయంత్రం 6.30గంటల నుంచి 7.30గంటల వరకు 6 టికెట్ల చొప్పున విడతల వారీగా నిర్వహిస్తారు. మొత్తం మీద గర్భాలయంలో అభిషేకాలకు 24 టికెట్లకు మాత్రమే అనుమతి ఉంటుంది. అలాగే కల్యాణమండపంలో సామూహిక అభిషేకాలు నిర్వహించే సమయంలో గర్భాలయంలోని అభిషేకాలు కొనసాగుతాయి.
రూ.500కే సుప్రభాత, మహామంగళహారతి సేవలు
శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్లకు ఉదయం జరిగే సుప్రభాత, మహామంగళహారతి సేవలో నిర్ధారిత కమిటీ కొద్దిగా మినహాయింపు ఇచ్చింది. శని,ఆది,సోమవారాల్లో సుప్రభాత సేవకు రూ. 1,000 టికెట్ ఉండేది. మహామంగళహారతి టికెట్ రూ. 600 ఉండేది కాగా వీటన్నింటిని ఒకే గాటికి తెచ్చింది. సుప్రభాతం, మహామంగళహారతి, అభిషేకానంతరం దర్శనానికి రూ. 500 చొప్పున టికెట్లు, శీఘ్ర దర్శనానికి రూ. 100 టికెట్‌ను నిర్ధారిత కమిటీ పెట్టింది.
Advertisement