మల్లన్న సామూహిక అభిషేకాలకు రంగం సిద్ధం
మల్లన్న సామూహిక అభిషేకాలకు రంగం సిద్ధం
Published Tue, Jul 26 2016 12:19 AM | Last Updated on Mon, Oct 8 2018 9:10 PM
శ్రీశైలం: శ్రీశైల ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా భక్తుల రద్దీ దృష్ట్యా రద్దీని దృష్టిలో ఉంచుకుని మల్లన్నకు సామూహిక అభిషేకాలను నిర్వహించడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఆగస్టు 3వ తేదీ నుంచి శ్రావణమాసం ప్రారంభమవుతున్న సందర్భంగా అభిషేకాల నిర్వహణపై అధికారులు ఏర్పాట్లు చేసేందుకు సమాయత్తమవుతున్నారు. ఇటీవల శ్రీశైల దేవస్థానం ఈఓగా బాధ్యతలను స్వీకరించిన నారాయణ భరత్ గుప్త గతంలో సామూహిక అభిషేకాలు ఎలా నిర్వహించారు, ఆ సమయంలో తలెత్తిన పరిస్థితులు మొదలైన అంశాలపై అధికారులు, అర్చకులు, వేదపండితులతో చర్చించి ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. గతంలో రద్దీగా ఉండే, శని,ఆది,సోమవారాలలో సామూహిక అభిషేకాలను ఆలయప్రాంగణంలోని స్వామిఅమ్మవార్ల నిత్య కల్యాణమండపంలో నిర్వహించేవారు. మిగిలిన రోజుల్లో స్వామివార్ల గర్భాలయంలోనే ఈప్రక్రియ జరిగేది.
త్వరలో ఉత్తర్వులు జారీ:
ఈ ఏడాది ఆగస్టు 12 నుంచి కష్ణా పుష్కరాలు కూడా ప్రారంభమవుతున్న సందర్భంగా భక్తులరద్దీ అధికంగా ఉంటుందనే భావనతో సామూహిక అభిషేకాలను నిర్వహించాలనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. శ్రీశైల దేవస్థానం సామూహిక అభిషేకాలను నిర్వహించడం పట్ల విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆ సమయంలో తీవ్రంగా ఆక్షేపణ వ్యక్తం చేశారు. దేవాదాయ దర్మదాయ శాఖ ఆధీనంలోని అన్ని దేవస్థానాలు వ్యాపార కేంద్రాలుగా మారాయని విమర్శించారు. పీఠాధిపతుల విమర్శలను, భక్తుల అభిప్రాయాలను దష్టిలో ఉంచుకుని కల్యాణమండపంలో సామూహిక అభిషేకాలు నిర్వహించుకున్న తరువాత సేవా కర్తలకు శుద్ధ జలంతో స్వామివార్లను దర్శన సమయంలో అభిషేకించుకునే అవకాశాన్ని కల్పించాలని భావిస్తున్నారు. ఏదేమైనా సామూహిక అభిషేకాల నిర్వహణపై విధి విధానాలను రూపొందించిన తరువాత శ్రావణమాసంలో జరిగే అభిషేకాల నిర్వహణపై త్వరలో ఈఓ ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది.
Advertisement