సామూహిక అభిషేకాలను నిర్వహించుకుంటున్న భక్తులు
మల్లన్నకు 700 పైగా సామూహిక అభిషేకాలు
శ్రీశైలం: శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల సన్నిధిలో మాసశివరాత్రి పర్వదిన సందర్భంగా మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం 7.30గంటల వరకు ఆరు విడుతలుగా జరిగిన సామూహిక అభిషేకాలలో 705 టికెట్లకు పైగా విక్రయించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఉదయం నుంచి భక్తులరద్దీ సాధారణంగానే ఉన్న అభిషేకాలు చేయించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో ఆసక్తి చూపించారు. ఆలయ ప్రాంగణంలోని స్వామిఅమ్మవార్ల నిత్య కల్యాణ మండపంలో ఉదయం 6.30గంటలకు మొదట విడత బ్యాచ్ ప్రారంభం కాగా, మధ్యాహ్నం 3.30గంటల వరకు ఐదు విడతల అభిషేకాలను నిర్వహించారు.
సాయంత్రం 6.30 గంటల నుంచి 7.30 గంటల వరకు తక్కువ సంఖ్యలో అభిషేకాలు జరిగాయి. అయితే ఒకవైపు వర్షం కురుస్తుండడంతో అభిషేకం టికెట్లు తీసుకున్న సేవాకర్తలు వేచి ఉండడానికి ఇబ్బంది పడ్డారు. సామూహిక అభిషేక సేవాకర్తలు వేచి ఉండేందుకు వీలుగా దేవస్థానం అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని భక్తులు కోరారు. హరిహరరాయగోపురం పక్కనే ఉన్న దత్తాత్రేయ ఉద్యానవనంలో షెడ్డును ఏర్పాటు చేసి సీసీ కెమెరాలతో పాటు ఆధ్యాత్మిక ప్రసంగాల కోసం ఎల్‌ఈడీ టీవీలను ఏర్పాటు చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని భక్తులు వ్యక్తం చేస్తున్నారు.