శ్రీశైలంలో ఘనంగా శమీపూజ
విజయదశమి పర్వదినాన మంగళవారం శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల ఆలయప్రాంగణంలో వైభవంగా శమీపూజలు నిర్వహించారు
- నందివాహనంపై కైలాసనాథుడు
- నిజాలంకరణలో భ్రమరాంబాదేవి
- పూర్ణాహుతితో ముగిసిన రుద్ర, చండీ యాగాలు
శ్రీశైలం: విజయదశమి పర్వదినాన మంగళవారం శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల ఆలయప్రాంగణంలో వైభవంగా శమీపూజలు నిర్వహించారు. అలంకార మండపంలో శ్రీభ్రమరాంబాదేవిని నిజాలంకరణలో అలంకరించి, స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను నందివాహనంపై అధిష్టింపజేసి ఈఓ నారాయణభరత్‌గుప్త, జెఈఓ హరినాథ్‌రెడ్డి, అర్చకులు విశేష వాహన పూజలను చేశారు. నందివాహనాధీశులైన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల ఉత్సవమూర్తులను ఊరేగిస్తూ ఆలయప్రాంగణంలోని శమీ(జమ్మి) వృక్షం వద్దకు చేర్చారు. జమ్మిచెట్టుకు వేదపండితులు, అర్చకులు పూజలను చేశారు. పండుగ కావడంతో రాష్ట్రం నలమూలల నుంచి వచ్చిన భక్తులతో పాటు శ్రీౖశైలం, ప్రాజెక్టుకాలనీ, లింగాలగట్టు, బ్రహ్మగిరి, విష్ణుగిరి ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది స్థానిక భక్తులతో ఆలయప్రాంగణం కిక్కిరిసిపోయింది.
పూర్ణాహుతితో ముగిసిన శ్రీదేవీశరన్నవరాత్రోత్సవాలు
ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలమహాక్షేత్రంలో ఈ నెల1 నుంచి ప్రారంభమైన శరన్నవరాత్రోత్సవాలు మంగళవారం ఉదయం 8.30 గంటలకు చండీ, రుద్రయాగాల పూర్ణాహుతితో ముగిశాయి. శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల ఆలయప్రాంగణంలో తొమ్మిదిరోజులపాటు శాస్త్రోక్తంగా జరిగిన ఈ యాగాలకు పూర్ణాహుతి ద్రవ్యాలను ఈఓ నారాయణ భరత్ గుప్త, జెఈఓ హరినాథ్‌రెడ్డి ,అర్చకులు, వేదపండితులు విశేష పూజలు చేసి హోమగుండానికి సమర్పించారు. ఉపముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి, దేవస్థానం అధికార, సిబ్బంది పాల్గొన్నారు.