భక్తులతో పోటెత్తిన శ్రీశైలం
భక్తులతో పోటెత్తిన శ్రీశైలం
Published Sun, Nov 13 2016 10:24 PM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM
· 900లకు పైగా అభిషేకాలు
· క్యూలలో ఉచిత ఫలహారం, పాలు, మజ్జిగ వితరణ
· ఆలయపూజావేళల్లో మార్పులు
శ్రీశైలం: శ్రీశైలమహాక్షేత్రం భక్తజనంతో పోటెత్తింది. కార్తీక పౌర్ణమి పర్వదినం, మూడో సోమవారం కలిసి రావడంతో ఆదివారం సాయంత్రానికి లక్షకు పైగా భక్తులు క్షేత్రానికి చేరుకున్నారు. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని వేకువజామున 3.30గంటల నుంచే దర్శన ఆర్జితసేవలు ప్రారంభమయ్యేలా అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. ఆలయపూజావేళల్లో మార్పు కారణంగా వేకువజామున సాధారణ స్థాయిలో ప్రారంభమై ఉదయం 7గంటల సమయానికి అన్ని క్యూకాంప్లెక్స్‌లలోని క్యూ కంపార్టుమెంట్లు పూర్తిగా నిండిపోయాయి. మల్లన్న దర్శనం కోసం వేచి ఉండే భక్తులు ఇబ్బంది పడకుండా ఉచితంగా పులిహోర ప్రసాదంతో పాటు సమయానుకూలంగా వృద్ధులు, పిల్లలకు పాలు, మజ్జిగ, మంచినీరు పంపిణీ చేశారు. ఓ వైపు విడతల వారీగా అభిషేకాల నిర్వహణ, మరోవైపు సాధారణ భక్తులకు సర్వదర్శనం కలిగేలా చర్యలు తీసుకున్నారు. గత వారంలో జరిగిన పరిస్థితులు పునరావృతం కాకుండా ఎప్పటికప్పుడు ఈఓ స్వీయ పర్యవేక్షణ చేశారు.
900 పైగా సామూహిక అభిషేకాలు:
మన రాష్ట్రం నుంచేగాకుండా తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ తదితర రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు శ్రీశైలానికి వచ్చారు. వీరు స్వామివార్లను అభిషేక జలాలు సమర్పించడానికి ఆన్‌లైన్, కరెంట్ బుకింగ్, ఒక్క రోజు ముందస్తు టికెట్ల విక్రయంతో సుమారు 900 పైగా అభిషేకాలు జరిగాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అక్కమహాదేవి అలంకారమండపంలో విడతల వారీగా 5సార్లుగా అభిషేకాల నిర్వహణ కొనసాగింది. అభిషేకానంతరం భక్తులు మల్లన్నను స్పర్శదర్శనం చేసుకోవడానికి ఆలయ ప్రాంగణంలో బారులు తీరారు.
గంగాధర మండపం వద్ద కార్తీక దీపారాధన:
ప్రధాన రథ వీధిలోని గంగాధర మండపం వద్ద కార్తీకశుద్ధ చతుర్దశిని పురస్కరించుకుని వందల సంఖ్యలో భక్తులు కార్తీక దీపారాధనలు నిర్వహించుకున్నారు. పవిత్ర పాతాళగంగలో స్నానాలు, మల్లన్నదర్శనం, కార్తీక దీపారాధనలు చేసుకుని ఆదివారం భక్తులు ఉపవాసదీక్షలను విరమించుకున్నారు.
భక్తులకు దేవస్థానం తరఫున కార్తీక వనభోజనాలు:
శ్రీశైలం వంటి మహా పుణ్యక్షేత్రంలో భక్తులకు వనభోజనాలను ఏర్పాటు చేయాలని ఈఓ సంకల్పించారు. అందులో భాగంగా కార్తీక మాసారంభం నుంచే శివదీక్ష శిబిరాలవద్ద వనభోజన కార్యక్రమాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఉదయం ఫలహారం, మధ్యాహ్నం వనభోజనాలు, సాయంత్రం అల్పాహారం అందిస్తున్నారు. సోమవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా హైదరాబాద్‌కు చెందిన మహేందర్‌రెడ్డి, అవంతి దంపతులు దేవస్థానం నిర్వహిస్తున్న వన భోజన కార్యక్రమానికి 10వేల స్వీట్లు, 10వేల అరటి పండ్లను భక్తులకు ఉచితంగా అందజేస్తున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు.
Advertisement