vanabhojanam
-
Karthika Masam Special Photos: కార్తీక వన మహోత్సవ సందడి (ఫొటోలు)
-
ఆత్మీయత చాటిన బొందిలి సమ్మేళనం
కర్నూలు (ఓల్డ్‌సిటీ): జిల్లా రాజ్‌పుత్ బొందిలి సంఘం నిర్వహించిన 'సమ్మేళనం' వారి మధ్య ఆత్మీయతను చాటింది. రాష్ట్ర, అంతర్రాష్ట్ర బొందిలి సమాజాన్ని ఒకే వేదికపైకి తెచ్చింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని రాజ్‌పుత్ బొందిలి సంఘం జిల్లా అధ్యక్షుడు కె.నారాయణ సింగ్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక టీటీడీ కల్యాణ మండపంలో వనభోజనాల కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు శంకర్‌సింగ్, ప్రధాన కార్యదర్శి మహేందర్‌సింగ్, రాష్ట్ర మాజీ మహిళా అధ్యక్షురాలు లక్ష్మీబాయి, శ్రీశైలం పాలక మండలి మాజీ సభ్యురాలు సంపత్ సుభాంగిని రాజ్‌పుత్, రాజపోషకులు బి.కె.సింగ్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అఖిల కర్ణాటక రాజ్‌పుత్ మహాసభ వైఎస్ ప్రెసిడెంట్, బెంగుళూరు రిటైర్డు ఏసీపీ సంగ్రామ్ సింగ్ మాట్లాడుతూ.. రాజ్‌పుత్‌లుగా జన్మించడం గర్వకారణమన్నారు. కలిసికట్టుగా ఉండి అసెంబ్లీలో ప్రతినిధ్యం సంపాదించాలని సూచించారు. తమ సామాజిక వర్గం ప్రజలు ఇళ్లు నిర్మించుకునేందుకు వీలుగా ప్రభుత్వం ఒక కాలనీ కేటాయించాలని కోరారు. శ్రీశైల దేవస్థానంలో వసతిగృహం, అన్నదాన సత్రం ఏర్పాటు కోసం ప్రభుత్వం 0.50 సెంట్ల స్థలం కేటాయించాలన్నారు. రాజ్‌పుత్‌లను ఓబీసీలో చేర్చాలని, సొంత ఇళ్లు కట్టించి ఇవ్వాలని కోరారు. అంతకు ముందు స్థానిక సత్యనారాయణ స్వామి ఆలయం నుంచి కళాబృందాలు, బీరప్ప డోళ్లతో నిర్వహించిన ఊరేగింపు అందర్ని ఆకట్టుకుంది. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మహేశ్‌సింగ్, కోశాధికారి కిరణ్‌కుమార్ సింగ్, అడ్వయిజర్ సత్యనారాయణసింగ్, చెన్నై, రాయచూరు, మైసూర్, తమిళనాడు వంటి దక్షిణాది సంఘాల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. -
ఆహ్లాదం..ఆనందం..ఆత్మీయం
- జిల్లా అధికారుల వనభోజనం – ఉత్సాహంగా పాల్గొన్న కలెక్టర్, ఆయన సతీమణి కర్నూలు(అగ్రికల్చర్): ఒకవైపు తుంగభద్ర నది... మరోవైపు నీటితో తొణికిసలాడుతున్న చెరువు.. మధ్యలో పచ్చని చెట్లు.. ఆహ్లాదకరమైన వాతవరణంలో జిల్లా అధికారుల కార్తీకవనమహోత్సవం కనుల పండువగా జరిగింది. ఆటాపాటా, విందువినోదాలతో ఈ కార్యక్రమం ఆహ్లాదకరంగా జరిగింది. శుక్రవారం కర్నూలు మండలంలోని గర్గేయపురం నగరవనంలో జిల్లా అధికారుల కార్తీకవన మహోత్సవం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు సాగింది. జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆదేశాల మేరకు రెవెన్యూ, అటవీ, పర్యాటక శాఖఅ అధికారులు కార్తీకవనమహోత్సవానికి ఏర్పాట్లు చేశారు. జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఉద్యోగులను నగరవనానికి తీరలించేందుకు ప్రత్యేకంగా రెండు సూపర్ లగ్జరీ బస్సులను ఏర్పాటు చేవారు. నగర వనం అందాలను చూసి అందనూ మురిసిపోయారు. వనం చుట్ట రింగ్ రోడ్డు తరహాలో రోడ్డు వేశారు. ఉసిరి చెట్టుకు పూజలు.. కలెక్టర్ సతీమణి సత్యరేఖ తొలుత ఉసిరి చెట్టుకు పూజచేసి కార్తీకవనమహోత్సవాన్ని ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ సహా పలువురు జిల్లా అధికారులు సతీమణులతో సహా పాల్గొన్నారు. దాండియా ఆట ఆడి సందడి చేశారు. జిల్లా అధికారుల కూతుళ్ల నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్తీక వనభోజనం ముగిసిన తర్వాత నిర్వహించిన వివిధ కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. మహిళలకు, జిల్లా అధికారులకు వేరువేరుగా తాడులాగడం, వాల్‌బాల్ పోటీలు నిర్వహించారు. మహిళలల్లో కలెక్టర్ సతీమణి ఒక జట్టుగా, డీఆర్ఓ సతీమణి మరో జట్టుగా పోటీలు జరిగాయి.వాలీబాల్ పోటీల్లో కలెక్టర్ సతీమణి జట్టు విజయం సాధించగా, తాడులాగే పోటీల్లో కలెక్టర్ జట్టు విజయం సాధించింది. జిల్లా అధికారుల పిల్లలకు ప్రత్యేకంగా ఆటలపోటీలు నిర్వహించారు. మ్యూజికల్ చైర్స్, అంత్యాక్షరి వంటి కార్యక్రమాలు ఆహ్లాదకరంగా జరిగాయి. ఎంత హాయిలే ఇలా.. గార్గేయపురం చెరువులో అధికారులు, వారి సతీమణులు బోటు షికారు చేశారు. ఇందుకోసం జిల్లా పర్యాటక సంస్థ అధికారులు ప్రత్యేకంగా సంగమేశ్వరం నుంచి బోట్లు తెప్పించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... ఆహ్లాదకరమైన వాతవరణంలో కార్తీక వనమహోత్సవాన్ని నిర్వహించడం పట్ల ఆనందంగా ఉందని తెలిపారు. నగరవనాన్ని మరింత అద్భుతంగా తీర్చిదిద్దనున్నట్లు స్పష్టం చేశారు. కర్నూలు నగర ప్రజలు వారాంతంలో ఇక్కడకు వచ్చి సంతోషంగా గడిపే విధంగా అబివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో జేసీ–2 రామస్వామి, డీఆర్ఓ గంగాధర్‌గౌడు,జడ్సీ సీఇఓ ఈశ్వర్, సీపీఓ ఆనంద్‌నాయక్, ఇరిగేషన్ ఎస్ఇ చంద్రశేఖర్‌రావు, డ్వామా పీడీ పుల్లారెడ్డి, జేడీఏ ఉమామహేశ్వరమ్మ, ప్రత్యేకకలెక్టర్ వెంకటసుబ్బారెడ్డి, డీఎస్ఓ తిప్పేనాయక్ , కర్నూలు ఆర్డీఓ రఘుబాబు దాదాపు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. -
భక్తులతో పోటెత్తిన శ్రీశైలం
· 900లకు పైగా అభిషేకాలు · క్యూలలో ఉచిత ఫలహారం, పాలు, మజ్జిగ వితరణ · ఆలయపూజావేళల్లో మార్పులు శ్రీశైలం: శ్రీశైలమహాక్షేత్రం భక్తజనంతో పోటెత్తింది. కార్తీక పౌర్ణమి పర్వదినం, మూడో సోమవారం కలిసి రావడంతో ఆదివారం సాయంత్రానికి లక్షకు పైగా భక్తులు క్షేత్రానికి చేరుకున్నారు. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని వేకువజామున 3.30గంటల నుంచే దర్శన ఆర్జితసేవలు ప్రారంభమయ్యేలా అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. ఆలయపూజావేళల్లో మార్పు కారణంగా వేకువజామున సాధారణ స్థాయిలో ప్రారంభమై ఉదయం 7గంటల సమయానికి అన్ని క్యూకాంప్లెక్స్‌లలోని క్యూ కంపార్టుమెంట్లు పూర్తిగా నిండిపోయాయి. మల్లన్న దర్శనం కోసం వేచి ఉండే భక్తులు ఇబ్బంది పడకుండా ఉచితంగా పులిహోర ప్రసాదంతో పాటు సమయానుకూలంగా వృద్ధులు, పిల్లలకు పాలు, మజ్జిగ, మంచినీరు పంపిణీ చేశారు. ఓ వైపు విడతల వారీగా అభిషేకాల నిర్వహణ, మరోవైపు సాధారణ భక్తులకు సర్వదర్శనం కలిగేలా చర్యలు తీసుకున్నారు. గత వారంలో జరిగిన పరిస్థితులు పునరావృతం కాకుండా ఎప్పటికప్పుడు ఈఓ స్వీయ పర్యవేక్షణ చేశారు. 900 పైగా సామూహిక అభిషేకాలు: మన రాష్ట్రం నుంచేగాకుండా తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ తదితర రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు శ్రీశైలానికి వచ్చారు. వీరు స్వామివార్లను అభిషేక జలాలు సమర్పించడానికి ఆన్లైన్, కరెంట్ బుకింగ్, ఒక్క రోజు ముందస్తు టికెట్ల విక్రయంతో సుమారు 900 పైగా అభిషేకాలు జరిగాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అక్కమహాదేవి అలంకారమండపంలో విడతల వారీగా 5సార్లుగా అభిషేకాల నిర్వహణ కొనసాగింది. అభిషేకానంతరం భక్తులు మల్లన్నను స్పర్శదర్శనం చేసుకోవడానికి ఆలయ ప్రాంగణంలో బారులు తీరారు. గంగాధర మండపం వద్ద కార్తీక దీపారాధన: ప్రధాన రథ వీధిలోని గంగాధర మండపం వద్ద కార్తీకశుద్ధ చతుర్దశిని పురస్కరించుకుని వందల సంఖ్యలో భక్తులు కార్తీక దీపారాధనలు నిర్వహించుకున్నారు. పవిత్ర పాతాళగంగలో స్నానాలు, మల్లన్నదర్శనం, కార్తీక దీపారాధనలు చేసుకుని ఆదివారం భక్తులు ఉపవాసదీక్షలను విరమించుకున్నారు. భక్తులకు దేవస్థానం తరఫున కార్తీక వనభోజనాలు: శ్రీశైలం వంటి మహా పుణ్యక్షేత్రంలో భక్తులకు వనభోజనాలను ఏర్పాటు చేయాలని ఈఓ సంకల్పించారు. అందులో భాగంగా కార్తీక మాసారంభం నుంచే శివదీక్ష శిబిరాలవద్ద వనభోజన కార్యక్రమాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఉదయం ఫలహారం, మధ్యాహ్నం వనభోజనాలు, సాయంత్రం అల్పాహారం అందిస్తున్నారు. సోమవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా హైదరాబాద్‌కు చెందిన మహేందర్‌రెడ్డి, అవంతి దంపతులు దేవస్థానం నిర్వహిస్తున్న వన భోజన కార్యక్రమానికి 10వేల స్వీట్లు, 10వేల అరటి పండ్లను భక్తులకు ఉచితంగా అందజేస్తున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. -
6న ఆర్.కృష్ణయ్య రాక
కర్నూలు(అర్బన్): బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఈ నెల 6వ తేదీన కర్నూలుకు రానున్నట్లు బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.రాంబాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అదే రోజు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నగర శివారులోని వెంగన్నబావి వద్ద ఉదయం 11 గంటలకు కార్తీక మాస వసభోజన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. కార్యక్రమానికి జిల్లాలోని బీసీ వర్గాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులందరినీ ఆహ్వానించామన్నారు. కార్తీక మాసంలో వివిధ కులాలకు చెందిన వనభోజనాలు జరగడం సాంప్రదాయమని, బీసీల్లోని అన్ని కులాలకు చెందిన నేతలను ఒకే వేదిక మీదకు తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగానే తొలి సారి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వనభోజన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు.