♦ ‘స్థాయీ సంఘా’నికి ప్రవేశంపై నిషేధం
♦ బలవంతంగా వెనక్కి పంపించిన వైనం
♦ జడ్పీ సీఈఓ నిర్ణయం.. సర్వత్రా ఆగ్రహం
సాక్షి, సంగారెడ్డి: జిల్లా పరిషత్‌లో మీడియాపై ఆంక్షలు విధించారు. బుధవారం జరిగిన జెడ్పీ స్థాయీ సంఘం సమావేశం కవరేజ్‌కి వెళ్లిన విలేకరులను జెడ్పీ సీఈఓ వర్షిణి తన సిబ్బంది ద్వారా బయటకు పంపించి వేశారు. ఇదేం పద్ధతంటూ ప్రశ్నించిన వారితో సీఈఓ వాగ్వాదానికి దిగారు. ‘ఇక్కడ మీకేం పని.. ఈ సమావేశానికి మీరు హాజరుకావాల్సిన పనిలేదు..ఇక వెళ్లండి’ అంటూ బలవంతంగా పంపించేశారు. ఈ మేరకు లేఖ ఇవ్వాలని ఇవ్వాలని పత్రికా ప్రతినిధులు పట్టుబట్టగా వెంటనే రాతపూర్వకంగా లేఖ ఇవ్వాలని అక్కడే ఉన్న సిబ్బందిని ఆమె ఆదేశించారు. ఆమె తీరుపై జర్నలిస్టు సంఘాలు మండిపడ్డాయి. దీంతో విషయాన్ని టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు విష్ణువర్థన్‌రెడ్డి, ఏపీయూడబ్ల్యూజే నేత ఫైసల్, జర్నలిస్టు ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. దుబ్బాకలో ఉన్న మంత్రి హరీష్‌రావుకు జర్నలిస్టులు సీఈఓ వైఖరిని తప్పుబడుతూ వినతిపత్రం అందజేశారు. కాగా, జడ్పీ చైర్‌పర్సన్ రాజమణి సైతం సీఈఓ తీరును తప్పుబట్టారు. ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుల ఫోరం జిల్లా అధ్యక్షుడు మనోహర్‌గౌడ్, కాంగ్రెస్ జెడ్పీటీసీ ప్రభాకర్, టీడీపీ సభ్యుడు శ్రీకాంత్‌గౌడ్ మీడియాపై ఆంక్షలు విధించటాన్ని ఖండించారు.
సంప్రదాయాలు పాటించను..
జెడ్పీ సమావేశం, స్థాయీ సంఘ సమావేశాలకు మీడియా ప్రతినిధులు హాజరుకావటం ఆనవాయితీ. దీనికి విరుద్ధంగా విలేకరులు హాజరు కావొద్దంటూ సీఈఓ నిషేధం విధించడం కలకలం రేపింది. మీడియా ప్రతినిధులు ఎంతగా నచ్చజెప్పినా ఆమె వినిపించుకోలేదు. గత సంప్రదాయాలతో తనకు పని లేదన్నారు. అంతగా అవసరమైతే తమ సిబ్బంది సాయంత్రం వివరాలు చెబుతారు వార్తలు రాసుకోండన్నారు.
ఉద్యమిస్తాం : టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు
మీడియాపై ఆంక్షలు విధించటం దారుణం. దీన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. సీఈఓ తన వైఖరి మార్చుకుని ఆంక్షలు ఎత్తివేయపోతే జిల్లా వ్యాప్తంగా ఉద్యమిస్తాం. - విష్ణువర్ధన్‌రెడ్డి, టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు