ఖాళీలతో కుంటుపడుతున్న రెవెన్యూ పాలన
Published Mon, Jul 18 2016 5:17 PM | Last Updated on Thu, Apr 4 2019 2:50 PM
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా రెవెన్యూ శాఖలో తహసీల్దారు కేడరులో ఆరు పోస్టులు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులు ఖాళీ అయ్యి సుమారుగా 20 రోజులు కావస్తున్నా వీటిని భర్తీ చేసేందుకు ఆధికారులు ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. దీంతో ఈ విభాగాల్లో పనులు జరగక ప్రజలు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు.
– ఖాళీగా ఉన్న పోస్టుల్లో ప్రధానంగా కలెక్టరేట్‌లో రెండు ఉన్నాయి. వీటిలో ఒకటి ‘ఎ’ సెక్షన్ సూపరింటెండెంట్ (ఏఓ), మరొకటి ‘ఈ అండ్ ఎఫ్’ సూపరింటెండెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో ఏఓ పోస్టు కలెక్టరేట్‌లో కీలకమైనది. ఈ విభాగంలో సిబ్బందిపై పర్యవేక్షణ ఉంటుంది. ఉద్యోగుల సర్వీసులకు సంబంధించిన అంశాలను ఈ శాఖలో నిరంతరం నిర్వహిస్తారు. కాగా, ఏఓ సీటులో ఇంతవరకు ఉన్న ఎం.కాళీప్రసాద్ ఇటీవల జరిగిన బదిలీల్లో హిరమండలం తహసీల్దారుగా బదిలీ అయ్యారు. దీంతో ఏఓ పోస్టు ఖాళీ అయ్యింది. అలాగే, ఈ అండ్ ఎఫ్ సీటు కొన్ని నెలలుగా కాళీగా ఉంది. ఇక్కడ పనిచేసిన సూపరింటెండెంట్ నరసన్నపేట తహసీల్దారుగా వెళ్లారు. ఇక్కడ ఇంతవరకు ఎవ్వరినీ నియమించలేదు. దీంతో భూములకు సంబంధించిన ఫైల్స్ నిలిచిపోతున్నాయి.
– శ్రీకాకుళం ఆర్‌డీఓ కార్యాలయం ఏఓ (పరిపాలనాధికారి) పోస్టు జూన్ 30న ఖాళీ అయ్యింది. ఇక్కడ పనిచేసిన డి.జనార్దన రావు పదవీ విరమణ చేశారు. ఇప్పటి వరకు ఎవ్వరినీ నియమించలేదు. డివిజన్‌లో 13 మండలాలను సమన్వయం చేసే కీలకమైనది ఈ పోస్టు. దీంతో పలు ఫైళ్లు చాలా వరకు నిలిచిపోతున్నాయి. మండలాల నుంచి వచ్చిన సమాచారం, మండలాలకు పంపించాల్సిన సమచారం సక్రమంగా జరగక రెవెన్యూ సిబ్బంది. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా, ఇక్కడ ఆర్డీఓ కూడా ఇన్‌చార్జిగానే ఉన్నారు.
– ఇక మండల స్థాయిలో మూడు చోట్ల తహసీల్దార్లు లేరు. జి. సిగడాం, కోటబోమ్మాళి, పాతపట్నం మండలాల తహసీల్దారులను ఇటీవల బదిలీ చేశారు. వీరి స్థానంలో నియమాకాలు చేసినా వారు చేరలేదు. దీంతో, అక్కడి సూపరింటెండెంట్లు ఇన్‌చార్జి తహసీల్దార్లుగా వ్యవహరిస్తున్నారు. అయితే, ఇన్‌చార్జిల వల్ల కొన్ని న్యాయపరమైన సమస్యలు, ఇతర రెవెన్యూ పాలనలో పురోగతి ఉండదు. వారు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకొనేందుకు అధికారం లేదు. ఈ సమస్యలు గుర్తించి, జిల్లా స్థాయి ఉన్నతాధికారులు తక్షణం స్పందించి ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకపోతే ఇప్పటికే కుంటి నడక నడుస్తున్న రెవెన్యూ వ్యవస్థ మరింత వెనుకబడే అవకాశం ఉంది.
Advertisement