రాజకీయ చట్రంలో ‘రెవెన్యూ’
- అధికారం మొత్తం నాయకుల చేతుల్లోనే
– తాజాగా తహసీల్దారుల బదిలీల్లో వారిదే పెత్తనం
– నైతిక హక్కులు కోల్పోయిన అధికారులు
అనంతపురం అర్బన్ : రాజకీయ చట్రంలో రెవెన్యూ వ్యవస్థ బందీగా మారింది. అధికారం మొత్తం రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్లిపోవడంతో అధికారులు వారివారి నైతిక హక్కులు కోల్పోయారు. కార్యాలయాల్లో ఏపని చేయాలన్నా రాజకీయ నాయకుల కనుసన్నల్లోనే జరుగుతోంది. నాయకులు చెప్పిన వాటికి తలలూపడం.. వారు చెప్పిన చోట సంతకం చేయడమే విధులుగా అధికారులు పనిచేసుకెళుతున్నారు. అన్ని శాఖలకు పెద్ద దిక్కుగా ఉన్న రెవెన్యూ శాఖలో రాజకీయ పెత్తనం ఎక్కువ కావడంతో పాలన గాడితప్పుతోంది.
తాజాగా జరిగిన 23 మంది తహసీల్దార్ల బదిలీల్లో రాజకీయ నాయకుల పెత్తనం సాగింది. వారు సిఫారసులకు అనుగుణంగానే పోస్టింగ్‌లు ఇచ్చినట్లు బహిరంగ విమర్శలు వెల్లువెత్తాయి. ఉద్యోగుల సాధారణ బదిలీలకు ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ 24 వరకు గడువు ఇచ్చింది. దీంతో పలువురు తహసీల్దారులు రాజకీయ సిఫారసు లేఖలను ప్రజాప్రతినిధుల నుంచి తీసుకొచ్చి ఉన్నతాధికారులకు ఇచ్చారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో వీరికి స్థాన చలనం కల్పించే అంశాన్ని ఉన్నతాధికారులు అప్పట్లో తాత్కాలికంగా పక్కన పెట్టారు. పరిస్థితి కొంత సద్దుమణిగిన తర్వాత సిఫారసులకు అనుగుణంగానే పోస్టింగ్‌లు ఇచ్చినట్లు తెలిసింది.
పెత్తనంపై రెవెన్యూలో కలవరం
రెవెన్యూ శాఖపై అధికార పార్టీ నాయకుల పెత్తనం... ఆ శాఖ ఉద్యోగులను కలవరపెడుతోంది. తహసీల్దారు స్థాయి అధికారిని రాజకీయ నాయకులు తమ గుప్పిట్లో పెట్టుకుంటే మండలం మొత్తం వారి చేతుల్లో ఉన్నట్లేనని అంటున్నారు. ఏ పని జరగాలన్నా నాయకులు కనుసన్నల్లోనే చేయాల్సిన దుస్థితి ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే రెవెన్యూ వ్యవస్థపై ప్రజల్లో చెడు భావనలు చాలా ఉన్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే రెవెన్యూ వ్యవస్థపై ప్రజలు విశ్వాసం కోల్పోయే ప్రమాదముంది.