అట్టపెట్టెలతో లభించిన శ్యాంపిల్ మందులు
ఎల్.ఎన్.పేట : మండల కేంద్రంలో డ్రగ్ అధికారులు మంగళవారం ఆకస్మిక దాడులు చేశారు. దాడుల్లో శ్రీగోపాల్ మెడికల్ అండ్ జనరల్ స్టోర్‌లో సుమారు రూ.3లక్షల విలువ చేసే 51 రకాల శ్యాంపిల్స్‌తో పాటు బిల్లులు, రికార్డుల్లో నమోదు కాని మరికొన్ని మందులను పట్టుకున్నట్టు డ్రగ్ అధికారులు ఎ.కృష్ణ, ఎ.లావణ్య విలేకరులకు తెలిపారు. గోపాల్ దుకాణంలో మందులు పరిశీలిస్తున్న సమయంలో లోపల ఉన్న మరో గది తాళాలు కావాలని యజమానికి అడిగామని దీనికి యజమాని నిరాకరించి వెళ్లిపోయి సాయంత్రం వరకు రాకపోవడంతో వీఆర్‌వో డీవీ రమణమ్మ, ఎల్‌ఎన్‌పేట ప్రభుత్వ ఆసుపత్రి పార్మసిస్ట్ బి.ఉషారాణి ఆధ్వర్యంలో గడియను పగులగొట్టేందుకు సిద్ధపడ్డారు. ఈ సమయంలో ఓ వ్యక్తి వచ్చి తాళాలు తీసుకువస్తామని చెప్పి 15 నిమిషాల తరువాత తేవడంతో గదిని తెరచి సోదాలు చేశామని చెప్పారు. ఆ గదిలో పెట్టెలతో శ్యాంపిల్స్ మందులు, బిల్లుల్లేని మందులు లభించాయని వివరించారు. మందులను స్వాధీనం చేసుకుని సీజ్ చేసి ఆమదాలవలస కోర్టుకు అప్పగిస్తామని చెప్పారు. దుకాణదారుని లైసెన్స్ రద్దు చేయడంతో పాటు కేసు నమోదు చేశామన్నారు.
మత్తుమందులు విక్రయిస్తే చర్యలు
మందుల దుకాణాల్లో డాక్టర్లు చీటి లేకుండా ఎలాంటి రోగానికైనా మందులు విక్రయించడం నేరమని అధికారులు కృష్ణ, లావణ్య చెప్పారు. అదేlవిధంగా మత్తును కలిగించే కొన్ని రకాల మందులు విక్రయించిన దుకాణదారులపై కేసులు నమోదు చేస్తామన్నారు. కాలం చెల్లిన, శ్యాంపిల్స్ మందులు దుకాణాల్లో ఉండకూదని వివరించారు. ఈ దాడుల్లో భాగంగా సరుబుజ్జిలి మండలం రొట్టవలస వద్ద ఉన్న మందుల దుకాణంలో కొన్ని రకాల శ్యాంపిల్స్ లభించాయన్నారు. ఆ దుకాణ యజమానిపైన శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు కేసు నమోదు చేశామన్నారు.