ఆకాశంలో అద్భుత దృశ్యం
రావులపాలెం: సమయం.. బుధవారం ఉదయం 11 గంటలు.. ఎండ చుర్రుమంటున్న వేళలో అనుకోకుండా ఆకాశం వైపు చూసిన వారికి కనువిందైన దృశ్యం కనిపించింది. మబ్బుల నడుమ సూర్యుని చుట్టూ ఇంద్రధనుస్సు మాదిరిగా రంగుల వలయం ఏర్పడింది. వలయపు అంచుకు, సూర్యునికి మధ్య పలచటి చీకటి అలముకున్నట్టు నల్లగా ఉంది. తూర్పు గోదావరి జిల్లాలో.. ప్రధానంగా కోనసీమ ప్రాంతంలో ఈ విశేషం చాలాసేపు కనిపించింది.
ఈ వలయం రాబోయే ఉత్పాతానికి సంకేతమని కొందరు భావిస్తే.. మరికొందరు కలియుగాంతానికి సూచన అనేంతవరకూ ఊహాగానాలు వ్యాపించాయి. కానీ ఇది తుఫాను రాకకు సంకేతం కావచ్చని రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల ఫిజిక్స్ విభాగం రీసెర్చ్ డెరైక్టర్ డాక్టర్ కె.రామచంద్రరావు తెలిపారు. ఇలాంటి వలయాన్ని శాస్త్త్రవేత్తలు ‘హాలో’ అంటారన్నారు. భూమికి ఏడు వేల మీటర్ల ఎత్తున దుమ్ముధూళితో కూడిన అణువులు దట్టమైన ‘హై సిర్రస్’ మేఘాలుగా మారి, వాటిలో మంచు స్ఫటికాలు ఏర్పడతాయని వివరించారు. సూర్యకాంతి వాటిపై పడి పరావర్తనం, వక్రీభవనం చెంది ఏడు రంగులుగా మారి ఈ వలయాలు ఆవిష్కృతమవుతాయన్నారు.