
మృతదేహానికి రీపోస్టుమార్టం
ఓ మృతదేహానికి 42 రోజుల తర్వాత నల్లగొండ డీఎస్పీ సుధాకర్, రూరల్ సీఐ వెంకటేశ్వర్‌రెడ్డి,
చందంపేట (దేవరకొండ):
ఓ మృతదేహానికి 42 రోజుల తర్వాత నల్లగొండ డీఎస్పీ సుధాకర్, రూరల్ సీఐ వెంకటేశ్వర్‌రెడ్డి, తహసీల్దార్ దైద యాకూబ్, ఉస్మానియా వైద్యుల సమక్షంలో శనివారం రీపోస్టుమార్టం నిర్వహించారు. నల్లగొండలోని ఓ ప్రైవేట్ వైద్యుడి నిర్లక్ష్యం కారణంగానే తమ కుమారుడు మృతిచెందాడని నల్లగొండ వన్‌టౌన్‌లో పోలీస్‌స్టేషన్‌లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. గత నెల 12వ తేదీన అనీష్(12) మృతిచెందిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా డీఎస్పీ సుధాకర్ మాట్లాడుతూ రెండు నెలల క్రితం అనీష్ కాలికి గడ్డ కావడంతో నల్లగొండలోని సుశృత హాస్పెటల్ వైద్యుడు డాక్టర్ అరుణ్‌కుమార్ వద్దకు తీసుకెళ్లారు. సదరు వైద్యుడు వైద్యం నిమిత్తం వైద్య పరీక్షలు నిర్వహించి డాప్సన్ హైప్రెన్‌సెన్సిటివిటీ సిండ్రోమ్ ఇంజక్షన్ వాడడం వల్లే అనీష్ మృతి చెందాడని అనీష్ తల్లిదండ్రులు కేతావత్ రవి, సుశీల ఫిర్యాదు చేశారని తెలిపారు.
ఆ మేరకు 15 రోజుల క్రితం అనీష్ స్వగ్రామమైన చందంపేట మండలం సండ్రగడ్డ గ్రామపంచాయతీ హంక్యాతండాలో విచారణ నిర్వహించామని పేర్కొన్నారు. శనివారం పోస్టుమార్టం నిర్వహించామని, ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి వివరాలు అందితే కేసు విచారణ పురోగతి ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌ఐ శ్రీనివాస్, వీఆర్వో రాజవర్ధన్‌రెడ్డి, వీఆ ర్‌ఏ, గ్రామస్తులు తదితరులున్నారు.
డాక్టర్‌పై చర్య తీసుకోవాలి
గిరిజన బాలుడు అనీష్ మృతికి కారణమైన నల్లగొండలోని సుశృత ఆస్పత్రి డాక్టర్ అరుణ్‌కుమార్‌పై చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా బంజార సేవా సంఘం నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంగోతు బాలాజీనాయక్ డిమాండ్ చేశారు. శనివారం చందంపేట మండలంలోని హంక్యాతండాలో అనీష్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన స్థలానికి వచ్చిన వారు విలేకరులతో మాట్లాడారు.
వైద్యుడి, ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే అనీష్ మృతి చెందాడని ఆరోపించారు. తక్షణమే డాక్టర్ అరుణ్‌కుమార్‌ను పోలీసులు కస్టడికి తీసుకుని రిమాండ్‌కు తరలించాలని కోరారు. ఆయన వెంట ధరావత్ సంపత్‌నాయక్, గట్ల అనంతరెడ్డి, వెంకట్, రవి తదితరులున్నారు.