వడ్డీ వ్యాపారాలు చేసుకోండి
-
టీచర్ల కొట్లాటపై విచారణ
పోచమ్మమైదాన్ : ‘వడ్డీ వ్యాపారాలు చేసుకోండి.. పంతులు పని ఎందుకు మీకు? ఇప్పటికే ప్రభుత్వ టీచర్లు సరిగా పనిచేయరు.. చదువు సరిగా చెప్పరని అంటుంటారు.. ప్లాట్ల బిజినెస్, చిట్టీల వ్యాపారం చేసుకోండి.. ఉద్యోగాల విలువ మీకు తెలియదు. రోడ్ల మీద తిరిగే వాళ్లలా కొట్లాడుకోవడం ఏంటి?’ అంటూ ఆర్జేడీ బాలయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
గీసుకొండ మండలం ధర్మారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టీచర్లు మెుగిలయ్య, ప్రేమ్‌నాథ్ బుధవారం ఉదయం ప్రార్థన ముగిసిన తర్వాత చిట్‌ఫండ్ డబ్బుల విషయంలో కొట్టుకున్నారు. మెుగిలయ్య ఓ చిట్‌ఫండ్ లో డబ్బులు తీసుకున్నాడు. దీనికి ప్రేమ్‌నాథ్‌తో పాటు ఇతర ఉపాధ్యాయులు జమానత్‌గా ఉన్నారు. మెుగిల య్య చిట్‌ఫండ్ డబ్బులు చెల్లించకపోవడంతో జమానత్‌గా ఉన్న ప్రేమ్‌నాథ్, ఇతర టీచర్ల వేతనాల్లో నుంచి డబ్బులు కట్ అవుతున్నాయి. ఈ విషయంలో పలుమార్లు గొడవలు జరిగాయి.
బుధవారం కూడా వారి ద్దరు గొడవపడి కొట్టుకున్నారు. పరస్పరం ఒకరిపై మరొకరు పోలీస్‌స్టేçÙన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. వీరి కొట్లాటపై గురువారం దినపత్రికల్లో కథనం ప్రచురితమైంది. పత్రికల్లో చూసిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్జేడీ వై.బాలయ్య గురువారం డిప్యూటీ డీఈఓ తోట రవీందర్, ఎంఈఓ సృజన్ తేజలతో కలిసి పాఠశాలకు చేరుకొని విచారణ జరిపారు. దాడికి దిగిన ప్రేమ్‌నాథ్‌ను తొలుత, ఆతర్వాత మెుగిలయ్యను విచారించారు.
ఉపాధ్యాయుల కొట్లాట సమయంలో పదో తరగతి విద్యార్థులు ఉండగా వారిని కూడా అడిగి తెలుసుకున్నారు. ఎస్‌ఎంసీ బాధ్యులను అడగ్గా ఇద్దరు ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అటెండెన్స్ రిజిస్టర్‌లో టీచర్లు ఉమారాణి, రవికుమార్ సంతకాలు చేసి లేకపోవడంతో పాఠశాలకు వచ్చిన వారు ఎందుకు చేయలేదని హెచ్‌ఎం సుజాతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు సంతకాలు పెట్టగానే మెుబైల్‌ఫోన్లు డిపాజిట్ చేయించుకోవాలని ఆదేశించారు. అటెండెన్స్‌ను జిరాక్స్ తీయించుకున్నారు. విచారణ అనంతరం చర్యల నిమిత్తం డిప్యూటీ డీఈఓ తోట రవీందర్ నివేదికను జిల్లా విద్యాశాఖ అధికారికి అప్పగించారు.