సీనియర్ డీసీఎం ను బదిలీ చేయాలని మెరుపు ధర్నా
సీనియర్ డీపివో కార్యాలయం వద్ద ఎస్‌సీఆర్‌ఎంయూ ఆధ్వర్యంలో ఆందోళన
నగరంపాలెం: గుంటూరు రైల్వే డివిజనులో ఉద్యోగుల సంక్షేమాన్ని మరిచి నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తున్న గుంటూరు రైల్వే డివిజను సీనియర్ కమర్షియల్ మేనేజరు ఉమామహేశ్వరావును వెంటనే బదిలీ చేయాలని సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ డివిజన్ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం మధ్యహ్నం పట్టాభిపురంలోని డివిజనల్ రైల్వే మేనేజరు కార్యాలయం వద్ద మెరుపు ధర్నాకు దిగి సీనియర్ డీపీవో కార్యాలయాన్ని ముట్టడించి బైఠాయించారు. ఎస్‌సీఆర్‌ఎంయూ డివిజనల్ సెక్రటరీ హనుమంతరావు మాట్లాడుతూ.. ఉమామహేశ్వరరావు బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఉద్యోగుల విషయంలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. రెండు నెలల్లో 14మంది ఉద్యోగులను బదిలీ చేశారన్నారు. స్పౌజ్ కేటగిరిలో ఉన్న వారిని కూడా ఇష్టానుసారంగా బదిలీ చేశారన్నారు. డివిజన్‌లో జరుగుతున్న ధర్నాను జోన్ పరిధిలోని సీజీఎం దృష్టికి జోన్ ప్రదాన కార్యదర్శి శంకర్రావు తీసుకెళ్లడంతో ఆయన హామీ మేరకు ముట్టడిని విరమించారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు పి సుబ్బారావు, వైస్ ప్రెసిడెంట్ నారయణరెడ్డి, ట్రెజరర్ రవిశంకర్, ఏడీఎస్ రాజశేఖర్, సాంబశివరావు, హెడ్ బ్రాంచీ సెక్రటరి కె.వెంకట్రావు, స్టేషన్ బ్రాంచీ అధ్యక్షుడు శ్రీనివాస్, సెక్రటరి ఎమ్‌వీఎస్ ప్రసాద్ పాల్గొన్నారు.