మహిళ గొంతులో దిగిన రాడ్
– రోడ్డు ప్రమాదంలో దుర్ఘటన
ఉంగుటూరు :
పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం ఫత్తేపురం గ్రామం వద్ద బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ గొంతులోకి ఆటో మిర్రర్ రాడ్ దిగింది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల కథనం ప్రకారం.. నిడమర్రుకు చెందిన 10మంది మహిళా కూలీలు చేబ్రోలులోని కోళ్లఫారంలో పనిచేయడానికి ఆటోలో బయలుదేరారు. ఆ ఆటోను ఫత్తేపురం వద్ద ఎదురుగా వస్తున్న ఖాళీ ఆటో ఢీకొంది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న ముగ్గురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. బైనేపల్లి గ్రామానికి చెందిన పెనుమాక లక్ష్మీకాంతం గొంతులోకి అదే ఆటో మిర్రర్ రాడ్డు దిగింది. వీరిని 108 వాహనంలో తాడేపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించగా, అక్కడి వైద్యులు చికిత్స చేశారు. లక్ష్మీకాంతం గొంతులోని రాడ్‌ను చాకచక్యంగా తొలగించారు.